● దుక్కి నుంచి కోత వరకు ఖర్చులే ● వర్షం, దిగుబడి, ధరలపై అనిశ్చితి ● అప్పులు చేసి సిద్ధమవుతున్న రైతులు | - | Sakshi
Sakshi News home page

● దుక్కి నుంచి కోత వరకు ఖర్చులే ● వర్షం, దిగుబడి, ధరలపై అనిశ్చితి ● అప్పులు చేసి సిద్ధమవుతున్న రైతులు

Jun 20 2026 12:01 AM | Updated on Jun 20 2026 12:01 AM

● దుక్కి నుంచి కోత వరకు ఖర్చులే ● వర్షం, దిగుబడి, ధరలపై అనిశ్చితి ● అప్పులు చేసి సిద్ధమవుతున్న రైతులు

భైంసా: ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైంది. జిల్లాలో రైతులు పత్తి, సోయాబీన్‌, మొక్కజొన్న తదితర పంటల సాగుకు రైతులు పొలాలను సిద్ధం చేస్తున్నారు. అయితే ఈసారి సాగు మొదలయ్యే ముందే రైతులపై పెట్టుబడి భారం గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే ట్రాక్టర్‌ చార్జీలు, ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, కూలీల వేతనాలు అన్నీ పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

భూమి సిద్ధం చేయడం నుంచే ‘అధ’నం..

పొలాలను సిద్ధం చేసే దశ నుంచే రైతులకు భారం మొదలవుతోంది. మొదటి దుక్కి, రెండో దుక్కి, రోటావేటర్‌, గట్లు సరిచేయడం వంటి పనులన్నీ ట్రాక్టర్ల ద్వారా జరుగుతున్నాయి. గతేడాది ఎకరాకు రూ.1,500 నుంచి రూ.1,800 వరకు ఉన్న ట్రాక్టర్‌ చార్జీలు ఈసారి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు పెరిగాయి. రోటావేటర్‌ పనులకు కూడా అదనంగా రూ.500 నుంచి రూ.800 వరకు పెరిగింది. దీంతో భూమి సిద్ధం చేయడానికే రైతులు గతేడాదితో పోలిస్తే ఈసారి ఎకరాకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.

కూలీల కొరత, వేతనాల పెరుగుదల..

వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీవ్రంగా ఉంది. ఉపాధి హామీ పనులు, ఇతర ఉపాధి అవకాశాలు పెరగడంతో వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం కష్టంగా మారింది. దీంతో వేతనాలు కూడా పెరిగాయి. గతేడాది మహిళా కూలీలకు రోజుకు రూ.250 నుంచి రూ.300 వరకు ఉన్న వేతనం ఇప్పుడు రూ.350 నుంచి రూ.450 వరకు చేరింది. పురుషులకు రూ.400 ఉన్న వేతనం ప్రస్తుతం రూ.500 నుంచి రూ.700 వరకు పెరిగింది. విత్తనాలు వేయడం నుంచి కోత వరకు అన్ని దశల్లో కూలీల ఖర్చు ఎక్కువైంది.

పండిన పంట ఖర్చులకే..

ప్రతీ సంవత్సరం ఖర్చులు పెరుగుతున్నాయి. ట్రాక్టర్‌ నుంచి కూలీల వరకు అన్నింటికీ ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తోంది. కానీ పంటకు ధర వస్తుందనే హామీ లేదు. వర్షం పడకపోతే మొత్తం పెట్టుబడి మట్టిలో కలిసిపోతుంది. రైతు జీవితమంతా అప్పులు, ఆశలు, ఆందోళనల మధ్యనే సాగుతోంది.

– జంగం గణపతి, రైతు

అన్ని ధరలు పెరిగాయి..

మేము కూడా ఇష్టపడి చార్జీలు పెంచడం లేదు. డీజిల్‌, ఆయిల్‌, టైర్లు, విడిభాగాల ధరలు విపరీతంగా పెరిగాయి. పాత రేట్లకు ట్రాక్టర్లు నడపడం గిట్టుబాటు కావడం లేదు. అందుకే ఈ ఖరీఫ్‌లో కొంత మేర చార్జీలు పెంచాల్సి వచ్చింది.

– సాయినాథ్‌, ట్రాక్టర్‌ యజమాని

18ఎండీఎల్‌11,12. ట్రాక్టర్‌తో విత్తనాలు విత్తుతున్న రైతులు

ఇక పత్తి, సోయాబీన్‌ సాగుకు అవసరమైన విత్తనాలు, డీఏపీ, పొటాష్‌, కాంప్లెక్స్‌ ఎరువులు, సూక్ష్మపోషకాల ధరలు గణనీయంగా పెరిగాయి. గతేడాది ఎకరాకు సగటున రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఉన్న ఎరువుల ఖర్చు ఈసారి రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు చేరింది. దీనితోపాటు పురుగుమందుల ఖర్చు కూడా పెరగడంతో మొత్తం పెట్టుబడి రైతులకు భారంగా మారింది.

పెరిగిన

ఎరువులు,

విత్తనాల

ధరలు..

చాలా మంది రైతులు బ్యాంకులు, సహకార సంఘాలు, ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి సాగుకు సిద్ధమవుతున్నారు. గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో చాలామంది ఇంకా అప్పుల బాధలోనే ఉన్నారు. ఒకప్పుడు రూ.20 వూలలో పూర్తయ్యే ఎకరం పత్తి సాగు ఇప్పుడు రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు చేరిందని రైతులు చెబుతున్నారు. సోయాబీన్‌ సాగులో కూడా ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement