‘ప్రజావాణి’కి జనాల బారులు ప్రతీవారం అర్జీల వెల్లువ అపరిష్కృతంగానే సమస్యలు కలెక్టర్ ఆదేశించినా కదలని అధికారులు ప్రదక్షిణ చేస్తున్న బాధితులు
నేను లోకేశ్వరం మండలం నరసింహనగర్ తండా వాసిని. నా పేరి ట, మా నాన్న పేరిట తలా ఐదెకరాల చొప్పు న భూమి ఉంది. గత ప్రభుత్వం నా ఎకరంనర పట్టా భూమిని లాక్కుని క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసింది. ఆ భూమిలో గ్రామ కారోబార్ జాదవ్ మహేందర్ ఇప్పుడు అక్రమంగా ఇల్లు కట్టుకుంటున్నాడు. ఈ అక్రమ నిర్మాణాన్ని ఆపి, ఆ భూమి నాకు ఇప్పించండి.
– జాదవ్ కిషన్, నరసింహనగర్ తండా
నేను 40 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం మహారాష్ట్రకు వెళ్లాను. నాకు మహాగాంలో 86/ఆ సర్వే నంబర్లో 2.22 గుంటల భూమి ఉండేది. దీనిని కౌలుకి ఇచ్చేవాడిని. రెండు సంవత్సరాల క్రితం మా దూరపు బంధువు నన్ను, నా ముగ్గురు కూతుర్లను బెదిరిస్తూ అక్రమంగా సాగు చేసుకుంటున్నాడు. అధికారులు విచారణ జరిపి నా సాగు భూమికి టైటిల్ బుక్ ఇప్పించాలి.
నిర్మల్‌చైన్‌గేట్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ జిల్లాలో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుల నుంచి అర్జీలు స్వీకరించడం.. ఆన్‌లైన్‌లో నమోదు చేయడం మినహా శాశ్వత పరిష్కారం చూపడం లేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కలెక్టరేట్ చుట్టూ తిరిగి తిరిగి మోకాళ్లు అరుగుతున్నాయని పేర్కొంటున్నారు. అర్జీలు పెండింగ్‌లో పెట్టొద్దని కలెక్టర్ పదేపదే చెబుతున్నా.. ఆయా శాఖల అధికారులు మాత్రం పెడచెవిన పెడుతూనే ఉన్నారు. వ్యయ ప్రయాసలకోర్చి సుదూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే కలెక్టరేట్‌కు చేరుకుంటున్న బాధితులు ఉసూరుమంటున్నారు. ప్రతీ వారం 50 నుంచి 70 దరఖాస్తులు వస్తుండగా, ఈ వారం 100కు పైగా అర్జీలు వచ్చాయి. వీటిలో భూ సంబంధిత ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి.
ఒక్కొక్కరిదీ ఒక్కో బాధ..
గ్రామ, మండలస్థాయిలో పరిష్కారానికి నోచుకోని సమస్యలు కలెక్టర్‌కు చెప్పుకుంటే కొలిక్కి వస్తాయని ప్రజలు క్యూ కడుతున్నారు. కానీ ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉండటంలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిట్టూరుస్తున్నారు. జిల్లాలో కొన్ని ఎకరాల భూములు నిషేధిత(ప్రొహిబిటెడ్) జాబితాలో ఉన్నాయి. బాధిత రైతులు పదే పదే విన్నపాలు ఇస్తున్నా.. జాబితా నుంచి తొలగించడం లేదు. ఎందుకు నిషేధిత జాబితాలో చేర్చారు.. ఎందుకు తొలగించడం లేదో కూడా చెప్పడం లేదు. మీసేవ కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్డీవో, ఆడిషనల్ కలెక్టర్, కలెక్టర్ వరకు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో 90 శాతానికిపైగా రిజెక్ట్ చేసి పంపుతున్నారు. కలెక్టరేట్‌కు వచ్చే బాధితులను పలకరిస్తే వారి బాధలు వర్ణనాతీతం. వినే వారికే కన్నీళ్లు తెప్పిస్తాయి కానీ అధికారుల మనసు మాత్రం కరగడంలేదు.
క్షుణ్ణంగా పరిశీలించాలి..
ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమం కేవలం సమస్యలు విని, దరఖాస్తులు స్వీకరించే విధంగా కాకుండా పరిష్కారాల వేదికగా నిలిచేలా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మేము నిర్మల్ జిల్లా చిత్రకారుల సంఘం సభ్యులం. జనవరి 14, 15 తేదీల్లో సీఎం పర్యటన నేపథ్యంలో పట్టణంలోని డివైడర్ లకు పెయింటింగ్ వేయించడానికి మున్సిపల్ కమిషనర్ పనిని అప్పగించారు. పని చేసిన వెంటనే డబ్బులు ఇస్తానని చెప్పాడు. పెయింట్ కొనుగోలు కోసం రూ 2,20,000 ఇచ్చారు. మిగతా బిల్లు నేటికీ ఇవ్వడం లేదు. బిల్లు అడిగితే కమిషనర్ కాలయాపన చేస్తూ పట్టించుకోవడం లేదు. – నిర్మల్ జిల్లా చిత్రకారుల సంఘం సభ్యులు


