‘పశ్చిమానికి’ పదవులేవీ..!?
‘ఆదిలాబాద్ పార్లమెంట్’కు హ్యాండ్ ఇచ్చిన అధికార పార్టీ సీనియర్లు ఉన్నా.. ప్రాధాన్యత సున్నా ప్రతిపక్షం బలంగా ఉన్నా.. పార్టీ బలోపేతంపై నిర్లక్ష్యం నేతలు, క్యాడర్‌లో నైరాశ్యం
నిర్మల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లు కావస్తోంది. అయినా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని నేతలకు ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ పదవి దక్కలేదు. కార్పొరేషన్‌లు, సలహాదారు హోదాలు, బోర్డులు, కమిటీల్లో నియామకాలు జరుగుతున్నా.. ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల నేతలను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదు.
పక్క జిల్లాలకు పదవుల వరుస..
తాజాగా తూర్పు జిల్లా పరిధిలోని మంచిర్యాల ఎ మ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావును సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్‌గా, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంత్రిపదవి దక్కించుకున్నారు. దండేపల్లికి చెందిన కొట్నాక తిరుపతి గిరిజన కోఆపరేటివ్ సొ సైటీ చైర్మన్‌గా ఉన్నారు. ఇంతవరకు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మాత్రం ఒక్కరికీ పదవి దక్కలేదు. పొరుగున ఉన్న నిజామాబాద్ జిల్లాలో ఒక్క బాల్కొండ నియోజకవర్గం నుంచే ముగ్గురు నేతలు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేశ్‌రెడ్డి, సహకార సంఘాల అసోసియేషన్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ ముగ్గురూ బాల్కొండ నియోజకవర్గానికి చెందిన వారే. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా ఇదే నియోజకవర్గానికి చెందినవారు. ఇక నిజామాబాద్ జిల్లాలోనే సిరికొండ మండలానికి చెందిన తాహెర్‌బిన్ హందాన్‌కు ఉర్దూ అకాడమీ చైర్మన్ పదవినిచ్చారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీమంత్రి షబ్బీర్‌అలీని ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కాసు ల బాలరాజుకు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ పదవిని ఇ చ్చారు. నిజామాబాద్‌కు చెందిన గడుగు గంగాధర్ ను రాష్ట్ర వ్యవసాయశాఖ కమీషన్ సభ్యుడిగా నియమించారు. తాజాగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధికి చెందిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని రా ష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. పక్క జిల్లాలకు పదవుల వర్షం కురుస్తుంటే, ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలోని నేతల్లో నైరాశ్యం నెలకొంది.
బీజేపీ బలంగా ఉన్నా..
ప్రస్తుతం ఆదిలాబాద్ ఎంపీతోపాటు నాలుగు అసెంబ్లీ స్థానాలు బీజేపీ అధీనంలో ఉన్నాయి. బీఆర్‌ఎస్ రెండు స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ ఖానాపూర్‌లో మాత్రమే విజయం సాధించింది. ఇటువంటి ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడానికి, స్థానిక నేతలకు పదవులు ఇవ్వడం అవసరమని కాంగ్రెస్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధితో తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోందని నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు
సీనియర్లు ఉన్నా..
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో పదుల సంఖ్యలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ సోయంబాపురావు, వేణుగోపాలచారి, రాథోడ్ బాపురావు, ఇంద్రకరణ్‌రెడ్డి, రేఖానాయక్, ఎమ్మెల్సీ వి ఠల్‌రెడ్డి, ఆత్రం సక్కు, విఠల్‌రెడ్డి, నారాయణరావు పటేల్, గ్రంథాలయసంస్థ చైర్మన్ అర్జుమంద్‌అలీ, అజ్మీరా శ్యాంనాయక్ వంటి అనుభవజ్ఞులు ఉన్నారు. వీరు ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్నారు. అయినా ప్రభుత్వం వారిని పరిగణనలోకి తీసుకోకపోవడంతో వారి అనుచరవర్గంలో నిరాశ నెలకొంది.


