3 నుంచి పత్తి కొనుగోళ్లు..!
భైంసాటౌన్: జిల్లాలో పత్తి కొనుగోళ్లకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఈనెల 3 నుంచి సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈసారి కొనుగోళ్లలో అవకతవకలకు ఆస్కారం లేకుండా కేంద్ర ప్రభుత్వం కపాస్ కిసాన్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. పత్తి విక్రయించే రైతులు ముందుగా ఈ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రైతు వ్యవసాయ శాఖ ద్వారా సాగుచేసిన పత్తి పంటకు సంబంధించి క్రాప్‌బుకింగ్‌లో నమోదు చేసి ఉండాలి. ఆధార్‌కు అనుసంధానంగా ఉన్న మొబైల్ నంబర్‌కు ఓటీపీ లేదా, బయోమెట్రిక్/ఐరిస్ ద్వారా కూడా ఆధార్ ధ్రువీకరిస్తారు. రైతులు ఆధార్‌కు అనుసంధానించిన సెల్ నంబర్‌ను యాప్‌లో నమోదు చేసుకుంటే, స్లాట్ బుకింగ్ చేయవచ్చు. స్మార్ట్ ఫోన్‌లో కపాస్ కిసాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, అందులో స్లాట్ బుకింగ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇందులో పత్తి విక్రయించే తేదీ, జిన్నింగ్ మిల్ కేటాయిస్తారు. అవగాహన లేని రైతులకు ఏఈవోలు, సీసీఐ సిబ్బంది ద్వారా స్లాట్ బుకింగ్‌లో సహకరించేలా ఏర్పాట్లు చేశారు. 8–12 తేమ శాతం ఉన్న పత్తికి క్వింటాలుకు రూ.8,110 చెల్లించనుండగా, ఆపై తేమశాతం పెరిగితే ఒక శాతానికి రూ.81 తగ్గించి ధర చెల్లించనున్నారు.
భైంసాలోనే అఽధికం..
జిల్లాలోని నిర్మల్, సారంగపూర్, భైంసా, కుభీర్ ఏంఎసీ పరిధిలో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. మొత్తం 17 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అధిక సంఖ్యలో భైంసాలోనే ఏర్పాటు కానున్నాయి. జిల్లాలో ఎక్కువగా ముధోల్ నియోజకవర్గంలోనే రైతులు పత్తి సాగు చేస్తారు. దీంతో భైంసా పట్టణంలో 12 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు కానుండగా, ప్రస్తుతం 10 మిల్లులకు అనుమతి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
పది మిల్లుల్లో కేంద్రాలు..
ఈనెల 3 నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే పట్టణంలో 12 జిన్నింగ్ మిల్లులను గుర్తించాం. వీటిలో పది మిల్లుల్లో సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.
– పూర్యానాయక్, ఏఎంసీ ఉన్నత శ్రేణి కార్యదర్శి, భైంసా


