సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పీఎస్సార్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/మంచిర్యాలటౌన్: సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్‌గా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు(పీఎస్సార్) నియామకం అయ్యారు. కేబినెట్ హోదాతో కూడిన పదవిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పీఎస్సార్ ఎమ్మెల్యేగా ఎన్నికై నప్పటి నుంచి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఆయనకు బెర్త్ ఖరారు కాకపోవడంతో ఇన్నాళ్లుగా నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం కేబినెట్ హోదాతో కూడిన పదవిని ఇచ్చినా కొంత నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది.
ముందు నుంచీ కాంగ్రెస్‌లోనే..
కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడిగా ఉన్నా రు. తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్‌లో ప్రారంభించి.. పార్టీ మారకుండా పదవి ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉంటూ పార్టీని కాపాడుతూ వస్తున్నారు. 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్‌గా, 1999 నుంచి 2002 వరకు పీసీసీ సభ్యుడిగా, 2002 నుంచి 2005 వరకు పీసీసీ సెక్రెటరీగా, 2004 నుంచి 2006 వరకు టీటీడీ బోర్డు సభ్యుడిగా, 2005 నుంచి 2007 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా, 2007 నుంచి 2013 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీగా పనిచేశారు. 2018 నుంచి ఏఐసీసీ సభ్యుడిగా కొనసాగుతూనే, 2022లో ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా, 2023 ఎన్నికల్లో మంచిర్యాల ఎమ్మెల్యేగా గెలుపొందారు.
పదవిపై విముఖత
మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రేమ్‌సాగర్‌రావు కార్పొరేషన్ చైర్మన్ పదవిని స్వీకరించేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సీనియర్ నాయకుడిగా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేబినెట్‌లో బెర్త్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌కు రెండో విడతలో మంత్రిగా అవకాశం కల్పించి ప్రేమ్‌సాగర్‌రావును పక్కనబెట్టారు. అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ సమయంలో చీఫ్ విప్, విప్‌తో సహా కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో అవకాశం కల్పించడంపై చర్చకు వచ్చాయి. ఆయన మంత్రి పదవి తప్ప మరే పదవీ వద్దని, ఎమ్మెల్యేగానే నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని పలు మార్లు ప్రకటించారు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురికావడంతో ప్రస్తుతం కోయంబత్తూర్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సమయంలోనే ఆయనను నామినేటెడ్ పదవిలో నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ పదవి చేపట్టేందుకు ఇష్టం లేనట్లుగా ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకు ని కోలుకుని వచ్చాక నామినేటెడ్ పదవిని స్వీకరిస్తారా? లేదా తిరస్కరిస్తారా అనేది స్పష్టత రానుంది.


