నిర్మల్ ఉత్సవాలకు సన్నద్ధం కావాలి
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ ఉత్సవాల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో నిర్మల్ ఉత్సవాల నిర్వహణపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గతేడాది ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందామన్నారు. జిల్లా చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని వేదిక ద్వారా ఆవిష్కరించామని తెలిపారు. ఈసారి కూడా మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇందుకోసం ఎన్టీఆర్ మినీ స్టేడియాన్ని సిద్ధం చేయాలని పేర్కొన్నారు. సుందరీకరణ పనులు చేపట్టి, మరుగుదొడ్లు, పెయింటింగ్స్, లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని తెలిపారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ప్రముఖులతో ప్రచారానికి సంబంధించి వీడియోలు రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో భోజన్న, డీవైస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, తహసీల్దార్ రాజు, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, అధికారులు పాల్గొన్నారు.


