పోలీస్ అమరుల త్యాగం మరువలేనిది
ఖానాపూర్: ప్రజల రక్షణ, చట్టాల అమలులో భాగంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమర వీరుల త్యాగాలు మరువలేనివని ఎస్పీ జానకీషర్మిల, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుంచి పోలీస్ అమరవీరుల స్తూపం వరకు శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ, ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. శాంతిభద్రత కోసం ప్రాణ త్యాగం చేసినవారి సేవలు కొత్త తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఖానాపూర్ సర్కిల్‌లో నక్సలైట్ల ఘాతుకానికి 19 మంది పోలీస్‌లు అమరులయ్యారని తెలిపారు. అనంతరం ఖానాపూర్ సర్కిల్ కార్యాలయం ఆవరణలోని స్థూపం వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి మౌనం పాటించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాజేశ్‌మీనా, సీఐ అజయ్, తహసీల్దార్ సుజాత, ఎస్సైలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.


