నీరే..
కల్లాల్లో కళ్లలో..
రైతుల ఆరుగాలం శ్రమ ఒక్క తుపానుతో తుడిచిపెట్టుకుపోయింది. ఆరు నెలలు రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటలు ఇటీవలే చేతికి వచ్చాయి. దిగుబడిని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ఇక రేపోమాపో కోసేందుకు మరికొందరు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో విరుచుకుపడిన మోంథా తుపాను జిల్లా రైతులకు కన్నీటి దిగుబడి మిగిల్చింది. బుధవారం కురిసిన వర్షానికి ఒకవైపు కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లోని వరి, సోయా ధాన్యం తడిసిపోయింది. కోతకు వచ్చిన వరి పొలాలు నేలవాలాయి. ఖానాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆరబెట్టిన వరి ధాన్యం వర్షంతో తడిసి ముద్దయింది. రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. మండలంలో 101 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తహసీల్దార్ సుజాత తెలిపారు. ఇక లోకేశ్వరం మండలంలోనూ చేతికొచ్చిన ధాన్యం తడిసింది. యార్డుల్లో, కల్లాల్లో ధాన్యం తడిసిపోతుండటంతో కొందరు రైతులు టార్పలిన్లు కప్పి రక్షించే ప్రయత్నం చేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. ఇదిలా ఉంటే వర్షాలకు తర్లపాడ్ నుంచి కొమురంభీం చౌరస్తాకు వెళ్లే ప్రధాన రహదారి కోతకు గురై రవాణా పూర్తిగా అస్తవ్యస్తమైంది. పట్టణంలోని ప్రధాన వీధులు కుంటలుగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల రోడ్లు గుంతలమయమై ప్రమాదకరంగా మారాయి. – ఖానాపూర్/లోకేశ్వరం


