
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వెట్టిచాకిరీ!
● ఆదర్శ పాఠశాలల్లో పనికి తగ్గ వేతనం అందని వైనం.. ● ఆ వేతనాలు కూడా సకాలంలో అందని ప్రభుత్వం ● ఐదు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు ● విధులు బహిష్కరించి నిరసన
కుంటాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఆందోళన బాట పట్టారు. ఏళ్లుగా పనిచేస్తున్న ఈ ఉద్యోగులకు పనికి తగిన వేతనం ఇవ్వడం లేదు. ఇచ్చే అరకొర వేతనాలు కూడా సక్రమంగా చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 14 ఆదర్శ పాఠశాలల్లో 56 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2014లో నియమితులైన ఈ ఉద్యోగులలో ఫిజికల్ డైరెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ సబార్డినేట్లు, నైట్ వాచ్‌మెన్‌లు ఉన్నారు. వీరు పాఠశాలల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ వారి వేతనాలు రెగ్యులర్ ఉపాధ్యాయులతో పోలిస్తే చాలా తక్కువ. అయినా ప్రభుత్వం నెలనెలా చెల్లించడం లేదు. ప్రస్తుతం మార్చి నుంచి జూలై వరకు ఐదు నెలల వేతనాలు చెల్లించలేదు. దీంతో సోమవారం విధులు బహిష్కరించి ప్రిన్సిపాళ్లకు వినతిపత్రాలు సమర్పించారు. అప్పులతో జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు అప్పు కూడా దొరకని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
రెగ్యులర్ సిబ్బందితో సమానంగా..
ఆదర్శ పాఠశాలల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానమైన విధులను నిర్వర్తిస్తారు. వీరు బోధన, బోధనేతర పనులు, పరీక్షల నిర్వహణ, విద్యార్థుల విద్యాభివృద్ధి, రికార్డుల నిర్వహణ, హాజరు పర్యవేక్షణ, ఆఫీస్ సహాయక, ల్యాబ్ ఆపరేటర్, లైబ్రేరియన్ వంటి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పాఠశాలల సమగ్ర నిర్వహణలో కీలక భూమిక పోషిస్తున్నారు.
ఇల్లు గడవడం కష్టంగా ఉంది..
మాకు వేతనాలు సక్రమంగా రావడం లేదు. దీంతో ఇల్లు గడవడం కష్టంగా మా రుతోంది. పిల్లల ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్నాం. అందుకే విధులు బహిష్కరించాం. – ఎ.గజేందర్, కుంటాల
ఐదు నెలలుగా జీతాలు లేవు..
పనికి తగిన వేతనం లేదు. ఆపై ఐదు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నాం. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. కుటుంబ పోషణ భారంగా మారింది. – శృతి, ఫిజికల్ డైరెక్టర్, బోథ్
డిమాండ్లు ఇవీ..
సమాన పనికి సమాన వేతనం : రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన వేతనం అందించాలి.
కోతల రహిత వేతనం: పీఎఫ్, ఈఎస్‌ఐ, జీఎస్‌టీ వంటి కోతలు లేకుండా పూర్తి వేతనం చెల్లించాలి.
ఉద్యోగ భద్రత: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు దీర్ఘకాల ఉద్యోగ భద్రత కల్పించాలి.
హెల్త్ కార్డులు: అర్హులైన ప్రతి ఉద్యోగికి ఆరోగ్య సంరక్షణ కార్డులు అందించాలి.
నెలవారీ వేతనం: ప్రతి నెలా వేతనం చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వెట్టిచాకిరీ!

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వెట్టిచాకిరీ!