
యువ వికాసానికి సిబిల్ అడ్డంకి
● రుణాల మంజూరుకు ఆర్బీఐ నిబంధన ● మార్గదర్శకాలు పాటిస్తామంటున్న బ్యాంకర్లు ● ఆందోళనలో దరఖాస్తుదారులు
నిర్మల్‌చైన్‌గేట్: నిరుద్యోగులకు స్వయం ఉపాధివైపు మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకం ప్రారంభించింది. ఈ పథకం కింద స్వయం ఉపాధి పొందేలా రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు రూ.6 వేల కోట్లు కేటాయించింది. దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా అర్హులను ఎంపిక చేసి రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే రూ.50 వేలకు మించి రుణాలకు ఆర్బీఐ సిబిల్ స్కోర్ నిబంధన అడ్డంకిగా మారింది. దీంతో రుణాల మంజూరులో అనిశ్చితి నెలకొంది.
పెద్ద ఎత్తున దరఖాస్తులు
ఈ పథకం కోసం జిల్లా యువత నుంచి 35,177 దరఖాస్తులు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల నుంచి వచ్చిన ఈ దరఖాస్తులను ఎంపీడీవోలు ఆన్‌లైన్‌లో పరిశీలించి, అర్హుల దరఖాస్తులను బ్యాంకులకు పంపారు. బ్యాంకులు సిబిల్ స్కోర్ ఆధారంగా రుణాలు మంజూరు చేస్తాయి.
రుణాల మంజూరు విధానం
పథకం కింద రూ.2 నుంచి రూ.4 లక్షల వ్యయం ఉన్న యూనిట్లకు 30%, రూ.1 నుంచి రూ.2 లక్షల యూనిట్లకు 20%, రూ.50 వేల నుంచి రూ.లక్ష వ్యయం ఉన్న యూనిట్లకు 10% రాయితీ ఇస్తారు. రూ.50 వేల లోపు అయితే రుణం పూర్తిగా రాయితీ ఉంటుంది. అయితే రూ.50 వేలకుపైగా మంజూరు చేసే రుణాలకు సిబిల్ స్కోర్ తప్పనిసరని బ్యాంకర్లు తెలిపారు.
మారిన ఆర్బీఐ నిబంధనలు
గతంలో పేదలకు రుణాలు సులభంగా అందేవి. ప్రస్తుతం రూ.50 వేలు దాటితే పాన్ కార్డ్, సిబిల్ స్కోర్ తప్పనిసరి. దీంతో యువతలో రుణాలపై అనుమానాలు చోటు చేసుకున్నాయి.
కార్పొరేషన్ దరఖాస్తులు మంజూరైన రాయితీ నిధులు
యూనిట్లు కోట్లలో
ఎస్సీ 7,350 2,894 39 96
ఎస్టీ 3,627 2,325 25 35
బీసీ 17,286 3,876 41 00
ఏంబీసీ/ఈబీసీ 923 842 8.90
మైనార్టీ 5,926 1,045 17 41
క్రిస్టియన్ 65 27 0 42
రిజర్వ్ బ్యాంక్ గైడ్‌లైన్స్ ప్రకారమే..
వివిధ రకాల రుణ మంజూరులో బ్యాంకులు తప్పనిసరిగా రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్ పాటించాల్సి ఉంటుంది. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఇచ్చే రుణాలకు సంబంధించి సిబిల్ స్కోర్‌ను పరిగణలోకి తీసుకోవద్దనే గైడ్‌లైన్స్ ఏమీ మాకు రాలేదు. అర్హులందరికీ నిబంధనల మేరకు రుణాలు మంజూరు చేస్తాం.
– బి.రాంగోపాల్, లీడ్ బ్యాంకు మేనేజర్