పచ్చని పల్లెలో నెత్తుటి మరకలు | - | Sakshi
Sakshi News home page

పచ్చని పల్లెలో నెత్తుటి మరకలు

May 5 2025 9:06 AM | Updated on May 5 2025 9:06 AM

పచ్చన

పచ్చని పల్లెలో నెత్తుటి మరకలు

తేదీ 12 మార్చి 2021.. ప్రశాంతంగా ఉన్న పల్లెలో దారుణం చోటు చేసుకుంది. కేశం శ్రీకాంత్‌(20) అనే యువకుడు మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను వేధించేవాడు. ఎంత చెప్పినా తీరు మార్చుకోకపోవడంతో కన్నతల్లి కేశం ఇందిర రోకలితో శ్రీకాంత్‌ తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

క్షణికావేశంలోనే..

గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కుటుంబంలో ఎక్కువ మంది ఉండటంతో తప్పు చేస్తే ఎవరు చూస్తారో అనే భయం ఉండేది. నేడు ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో భయపడే పరిస్థితి లేదు. దీనికి తోడు మద్యం, మత్తు పదార్థాలకు బానిసవడం, వివిధ సామాజిక మాధ్యమాలలో వస్తున్న నేరాలు చూడటం.. హత్యలు, అత్యాచారాలకు కారణమవుతున్నాయి. పోలీసులు, న్యాయ వాదులు, మానసిక వైద్యులతో అవగాహన సద్సులు ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా మార్పు వస్తుంది. – డాక్టర్‌ అల్లాడి సురేశ్‌,

మానసిక నిపుణుడు

కుటుంబ కలహాలతోనే..

గ్రామాలలో కుటుంబ కలహాలు, చిన్నచిన్న గొడవల కారణంగా క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవడం, హత్యలు చేయడం జరుగుతుంది. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు నిందితులను పట్టుకుని వెంటనే కోర్డులకు హాజరు పరచడం జరుగుతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తమను సంప్రదిస్తే తగిన సహాయం చేయడంతోపాటు భరోసా కేంద్రం ద్వారా కౌన్సెలింగ్‌ ఇచ్చి వారిలో మార్పు వచ్చేలా చూ స్తాం. ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుంగా తగిన చర్యలు చేపడుతాం. చట్టా లపై అవగాహన కల్పించి నేరాలు జరగకుంగా చూస్తాం. – గోవర్ధన్‌రెడ్డి, సీఐ, సోన్‌

తేదీ 25 ఏప్రిల్‌ 2025.. ౖబైనం అశోక్‌, అతని తండ్రి ఎర్రన్న ఇద్దరూ కొద్దిరోజులుగా డబ్బుల విషయంలో గొడవ పడుతున్నారు. నిత్యం ఇరువురు మద్యం సేవించి ఇంటికి వచ్చి నిన్ను చంపుతా.. అంటే నిన్ను చంపుతా అంటూ కొన్ని రోజులుగా బెదిరించుకుంటున్నారు. చివరకు తండ్రి ఎర్రన్న అన్నంత పని చేశాడు. నిద్రిస్తున్న అశోక్‌పై గొడ్డలితో దాడిచేసి చంపేశాడు.

తేదీ 29 సెప్టెంబర్‌ 2023.. గ్రామానికి చెందిన సిలారి పెద్దమల్లు భూ తగాదాల విషయంలో తమ్ముడు సిలారి చిన్న మల్లయ్యపై గ్రామం నడిబొడ్డున అందరూ చూస్తుండగానే కర్రలు, కత్తులతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన చిన్న మల్లయ్యను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

లక్ష్మణచాంద: ఒకప్పుడు పల్లెలు అంటే పచ్చని పంటపొలాలు, ప్రశాంత వాతావరణం, కల్మషం లేని మనుషులు, వ్యవసాయంలో నిమగ్నమైన రైతుల సమాజం. కానీ కాలం మారింది. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై, సామాజిక మాధ్యమాల ప్రభా వం, మద్యం, మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువతతో గ్రామీణ జీవన స్వరూపం మారుతోంది. ఈ మార్పుల నేపథ్యంలో లక్ష్మణచాంద మండలంలోని మల్లాపూర్‌లో జరుగుతున్న వరుస హత్యలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

అనూహ్య హింస

మల్లాపూర్‌ 1,729 జనాభాతో ఉన్న ఒక చిన్న వ్యవసాయ గ్రామం. ఇక్కడి ప్రజలు ప్రధానంగా వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడ్డారు. అక్షరాస్యత రేటు 44.4%గా ఉంది. గతంలో ఈ గ్రామం ప్రశాంతంగా, అల్లర్లు లేకుండా ఉండేదని స్థానికులు, పోలీసులు చెబుతున్నారు. కానీ ఇటీవల జరిగిన మూడు హత్యలు గ్రామాన్ని కలవరపెడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.

చిన్న విషయాలు.. పెద్ద పరిణామాలు

మల్లాపూర్‌లో హత్యలకు ప్రధాన కారణాలుగా భూ వివాదాలు, కుటుంబ కలహాలు నిలుస్తున్నాయి. పక్కపక్కనే ఉన్న భూముల యజమానుల మధ్య వైరం, కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి విభేదాలు క్షణికావేశంలో హత్యలకు దారితీస్తున్నాయి. ఈ సమస్యలను గ్రామ పెద్దలు లేదా అధికారుల సహాయంతో పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ, మద్యం, మత్తు పదార్థాల ప్రభావంలో ఆవేశానికిలోనై హత్యలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలు చిన్న కారణాలతో ప్రారంభమై, పెద్ద విషాదాలకు దారితీస్తున్నాయి.

మానవత్వం కనుమరుగు..

మల్లాపూర్‌లో జరిగిన కొన్ని హత్యలు మానవత్వం లేని క్రూరత్వాన్ని బహిర్గతం చేస్తున్నాయి. ఒక తల్లి తన కుమారుడిని రోకలితో కొట్టి చంపిన ఘటన, తండ్రి తన కుమార్తెను గొడ్డలితో నరికి చంపిన సంఘటన, అన్న తమ్ముడిని కర్రలు, కత్తులతో క్రూరంగా హత్య చేసిన ఘటనలు సమాజంలో మానవత్వం ఎక్కడికి పోయిందనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. ఈ ఘటనలు బంధుత్వాలు, ప్రేమ, మరియు సహనం వంటి విలువలు క్షీణిస్తున్నాయనే ఆందోళనను కలిగిస్తున్నాయి.

సామాజిక మాధ్యమాలు.. మద్యం

సామాజిక మాధ్యమాల ప్రభావం, మద్యం, మత్తు పదార్థాలకు అలవాటు పడటం గ్రామీణ సమాజంలో హింసను పెంచుతున్నాయి. యువత సామాజిక మాధ్యమాల ద్వారా హింసాత్మక కంటెంట్‌కు గురవుతూ, వాస్తవ జీవితంలో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటున్నారు.

పరిష్కార మార్గాలు..

ఈ హత్యలను నివారించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మల్లాపూర్‌ గ్రామస్తులు కోరుతున్నారు. సమస్యలు తలెత్తినప్పుడు గ్రామ పెద్దలు లేదా అధికారుల సహాయంతో పరిష్కరించుకోవాలని, ఆవేశానికి లోనై ప్రాణాలు తీయడం సరికాదని వారు సూచిస్తున్నారు. స్థానిక పోలీసులు, జిల్లా అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, మద్యం, మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించే చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. అలాగే, భూమి వివాదాలను పరిష్కరించడానికి రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని కోరుతున్నారు.

మల్లాపూర్‌లో హత్యల కలకలం

క్షణికావేశంలోనే బంధాలు తెంచుకుంటున్న వైనం..

గ్రామీణ జీవనం.. ప్రశాంతత నుంచి భయాందోళన వైపు..

నాలుగేళ్లలో మూడు మర్డర్లు..

పచ్చని పల్లెలో నెత్తుటి మరకలు 1
1/3

పచ్చని పల్లెలో నెత్తుటి మరకలు

పచ్చని పల్లెలో నెత్తుటి మరకలు 2
2/3

పచ్చని పల్లెలో నెత్తుటి మరకలు

పచ్చని పల్లెలో నెత్తుటి మరకలు 3
3/3

పచ్చని పల్లెలో నెత్తుటి మరకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement