
గ్రామస్తులతో మాట్లాడుతున్న ఆర్డీవో రవికుమార్
లోకేశ్వరం: అబ్దుల్లాపూర్‌లో కబ్జాకు గురైన భూమి కోర్టు అధీనంలో ఉందని, కోర్టు తీర్పు వచ్చేదాకా ఇరు గ్రామాలవారు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని భైంసా ఆర్డీవో రవికుమార్ సూచించారు. బుధవారం అబ్దుల్లాపూర్ గ్రామ సరిహద్దు ప్రాంతంలోని 328 సర్వే నంబర్‌లోగల భూమిని కోర్టు ఆదేశాల మేరకు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కన్కపూర్ గ్రామానికి చెందిన కొబ్బన్నోల్ల గంగన్నతోపాటు అబ్దుల్లాపూర్ వీడీసీ సభ్యులతో మాట్లాడి భూమి గురించి తెలుసుకున్నారు. ఈ భూమి కోర్టు అధీనంలో ఉందని, పూర్తి సర్వే చేయించి నివేదిక కోర్టుకు అందజేస్తామని తెలిపారు. ఆర్డీవో అబ్దుల్లాపూర్–కన్కపూర్ గ్రామస్తులతో మాట్లాడుతుండగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గైని మురళీమోహన్ జోక్యం చేసుకుని భూకబ్జాపై ప్రశ్నించారు. దీంతో అబ్దుల్లాపూర్ గ్రామస్తులు మురళీమోహన్‌తో వాగ్వాదానికి దిగగా ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆర్డీవో వెంట డీటీ అశోక్, అబ్దుల్లాపూర్, కన్కపూర్ గ్రామస్తులున్నారు.