
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్, డీఈవో
నిర్మల్ రూరల్: ఏప్రిల్ 3నుంచి 13వరకు పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. బుధవారం మంత్రి పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన, ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ఇంటర్మీడియట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ఇంటర్ పరీక్షలను అధికారులు విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. ప్రతీ పదో తరగతి పరీక్షా కేంద్రం వద్ద తప్పనిసరిగా ఏఎన్‌ఎం అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. విద్యార్థులకు రవాణా కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఉదయం, మధ్యాహ్నం నడపాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థులు హాల్‌టికెట్లను bse.telangana. gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కలెక్టర్ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో పదో తరగతి విద్యార్థులు 9,078 మంది పరీక్షలకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఇందులో బాలురు 4,445 మంది, బాలికలు 4,633 మంది ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో 48 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. డీఈవో రవీందర్‌రెడ్డి తదితరులున్నారు.