
ఆదేశాలు రాగానే అమలు చేస్తాం
ఉపాధిహామీ పనులకు వచ్చే కూలీలకు వేతనం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెరిగిన వేతనానికి సంబంధించిన ఉత్తర్వులు అందగానే అమలు చేస్తాం. జాబ్‌కార్డులు కలిగిన కూలీలు వేసవికాలంలో పనులు సద్వినియోగం చేసుకోవాలి.
– విజయలక్ష్మి, డీఆర్డీవో
జిల్లాలో పథకం వివరాలు
జాబ్‌కార్డుల సంఖ్య : 1.71 లక్షలు
మొత్తం కూలీలు : 3.3 లక్షలు
యాక్టివ్ జాబ్‌కార్డులు : 1.27 లక్షలు
పనులకు వెళ్లే కూలీలు : 2.27 లక్షలు
వెచ్చించిన నిధులు : రూ.13,713.48 లక్షలు
ఇచ్చిన వేతనాలు : రూ.8,634.87 లక్షలు
మెటీరియల్ ఖర్చు : రూ.5,078.61 లక్షలు
నిర్మల్‌చైన్‌గేట్: ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ఈ వేసవి నుంచి వేతనం పెరగనుంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉత్తర్వులు అమలులోకి రానున్నాయి. ఇప్పటివరకు ఒక్కో కూలీకి రూ.257 చెల్లిస్తుండగా.. ఇక నుంచి రూ.272 అందనుంది. ఈ నిర్ణయంతో జిల్లాలో 3.3 లక్షల మంది కూలీలకు లబ్ధి చేకూరనుంది.
కేంద్రం పర్యవేక్షణలో..
ఉపాధిహామీ పథకం నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ను పూర్తిగా అధీనంలోకి తీసుకున్న కేంద్రం పని దినాల లక్ష్యాల కేటాయింపులను కూడా పర్యవేక్షిస్తోంది. కూలీల సంఖ్య ఆధారంగా గ్రామం, బ్లాక్ (మండలం), జిల్లాకు పనిదినాల లక్ష్యాలను నిర్దేశిస్తోంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే పనిదినాల లక్ష్యాన్ని కొంతమేర పెంచుతూ జిల్లాలకు ప్రత్యేక లక్ష్యాలు ఇచ్చేది. కానీ.. కొత్త సాఫ్ట్‌వేర్ రావడంతో కేంద్రం సూచనలే అమలవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దొరకని సమయాన ఉపాధిహామీ పనులు వినియోగించుకునే కూలీల సంఖ్య జిల్లాలో ఎక్కువగానే ఉంది. ఈ ఏడాది ఉపాధి పనులను జిల్లాలో 3.3 లక్షల మంది వినియోగించుకున్నారు.
