వేసవి దృష్ట్యా గతంలో ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఐదు నెలలపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కూలీలకు 20శాతం అదనపు భత్యం ఇచ్చేది. కానీ.. ఈ వేసవిలో అదనపు భత్యం ఊసేలేకుండా పోయింది. దీంతో కూలీల్లో నిరాశ వ్యక్తమవుతోంది. ఉపాధి పని దినాలు పెంచేందుకు ఏటా రాష్ట్ర ప్రభుత్వం కూలీలకు అదనపు భత్యాన్ని అందజేసేది. దీంతో పని చేసిన కూలీలకు ఆ రోజు పొందే కూలిలో ఫిబ్రవరి నెలలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్, మే నెలల్లో 30 శాతం, జూన్‌లో 20 శా తం అదనపు భత్యం చెల్లించేవారు. కానీ.. ఉపాధిహామీ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలో వినియోగించిన సాఫ్ట్‌వేర్‌ను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎస్‌ఐసీ) సాఫ్ట్‌వేర్ ప్రవేశపెట్టింది. దీంతో ప్రస్తుత ఏడాది నుంచి ఉపాధి చెల్లింపులు నేరుగా కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎస్‌ఐసీ ఆధ్వర్యంలోకి వెళ్లడంతో అందులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే వీలు లేకుండా పోయింది. ఎండల తీవ్రత, వసతుల లేమి కారణంగా పనులకు వచ్చే కూలీల సంఖ్య తగ్గిపోతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.