
మాట్లాడుతున్న ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో వరుణ్‌రెడ్డి
● ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో వరుణ్‌రెడ్డి ● ఘనంగా జామ్డా ఆశ్రమ పాఠశాల గోల్డెన్ జూబ్లీ
నార్నూర్: పట్టుదలతో చదువుకుని ఉన్నత లక్ష్యసాధన కోసం విద్యార్థులు కృషి చేయాలని ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి అన్నారు. మండలంలోని జామ్డా బాలికల ఆశ్రమ పాఠశాల గోల్డెన్ జూబ్లీ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జ్యోతిప్రజ్వలన చేసి వార్షికోత్సవాన్ని ఎవరెస్ట్ శిఖరం అధిరోహిత మాలోత్ పూర్ణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థుల్లో విద్య నైపుణ్యం పెంచడానికి కార్యక్రమాలు చేపడుతూ వంద శాతం ఫలి తాల సాధన కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు. తల్లిదండ్రులు చిన్నచిన్న పండుగలకు విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లి వారి విద్యకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చదువు ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుందని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల నైపుణ్యతను వెలికితీసి పోటీ ప్రపంచం ముందుకు తీసుకెళ్లాలని కోరారు. అనంతరం ఎవరెస్టు శిఖరం అధిరోహిత మాలోత్ పూర్ణ మాట్లాడుతూ ఆడపిల్లలు భయపడకుండా ముందుకెళితే ఏదైనా సాధ్యమేనని తెలి పారు. ఒక లక్ష్యం పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని సూచించారు. జీవితంలో ఆరోగ్యం, బాధ్యత, లక్ష్యం ఈ మూడు ఉంటే ఉన్నత శిఖరానికి చేరుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో డీడీ దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.