నిర్మల్‌చైన్‌గేట్‌:రాష్ట్రంలో ఈ..... | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌చైన్‌గేట్‌:రాష్ట్రంలో ఈ.....

Mar 29 2023 12:28 AM | Updated on Mar 29 2023 12:28 AM

నిర్మల్‌చైన్‌గేట్‌:రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోతున్న తొమ్మిది మెడికల్‌ కాలేజీలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, టీఎస్‌ ఎంఐడీసీ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న వైద్య కళాశాలల పనుల పురోగతిపై ఆయా జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఇంజినీరింగ్‌ ఏజెన్సీలు, ప్రజా ప్రతినిధులతో మంగళవారం జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేశారన్నారు. అందులో భాగంగా గత సంవత్సరం 8 నూతన వైద్య కళాశాలలు ప్రారంభించుకున్నామని తెలిపారు. ఈ ఏడాది 9 కళాశాలలు ప్రారంభించే దిశగా పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. దేశంలో ప్రతి లక్ష జనాభాకు అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్యలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. ప్రస్తుతం కరీంనగర్‌, కామారెడ్డి, జనగామ, వికారాబాద్‌, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, కుమురంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాలో నూతన వైద్య కళాశాల పనుల జరుగుతున్నాయని వివరించారు. వీటిపై కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక దష్టి సారించాలని, ప్రతీరోజు పనులు పురోగతి తెలుసుకుంటూ క్షేత్రస్థాయిలో వచ్చే చిన్నచిన్న సమస్యలను పరిష్కరించాలన్నారు.

ఎన్‌ఎంసీ తనిఖీలకు సిద్ధంగా ఉండాలి...

రాష్ట్రంలో నిర్మించే తొమ్మిది వైద్య కళాశాల పనులను జాతీయ వైద్య కమిషన్‌ పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తుందని తెలిపారు. ఇప్పటికే ఆరు కళాశాలల పనులను క్షేత్రస్థాయిలో ఎన్‌ఎంసీ పరిశీలించిందన్నారు. ఆసిఫాబాద్‌, సిరిసిల్ల, నిర్మల్‌ జిల్లాల్లో ఎన్‌ఎంసీ పర్యటన త్వరలోనే ఉంటుందని తెలిపారు. కలెక్టర్లు, వైద్యశాఖ అధికారులు సమావేశం నిర్వహించుకుని ఎన్‌ఎంసీ తనిఖీలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. వైద్య కళాశాలలో అవసరమైన సామగ్రి అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. టీచింగ్‌ స్టాఫ్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్ల , మిగిలిన స్టాఫ్‌ నియామక ప్రక్రియ నెలన్నర కాలంలో పూర్తి చేస్తామన్నారు. వైద్య కళాశాలల నిర్మాణానికి ఏప్రిల్‌ చాలా కీలకమని, నెలాఖరు వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జూలై నుంచి మొదటి విడత అడ్మిషన్స్‌ ప్రారంభమవుతాయని తెలిపారు.

మే 15 వరకు పూర్తిచేస్తాం

జిల్లా ఆస్పత్రిలో ప్రస్తుతం 100 పడకలు అందుబాటులో ఉన్నాయని, 125 అదనపు పడకల ఏర్పాటు కోసం 11 కోట్లతో భవన నిర్మాణ పనులు చేపట్టి 40 శాతం పూర్తి చేశామని కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి తెలిపారు. మెడికల్‌ కాలేజ్‌ పనులు 55 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. మే 15 వరకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. జూమ్‌ మీటింగ్‌లో అదనపు కలెక్టర్‌ రాంబాబు, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జీవీడీఎస్‌.ప్రసాద్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ధనరాజ్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

జూమ్‌ మీటింగ్‌లో మాట్లాడుతున్న హరీశ్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement