
ఏవోకు వినతిపత్రం ఇస్తున్న వైద్యులు
● ఐఎంఏ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన
నిర్మల్‌చైన్‌గేట్: రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైట్ టు హెల్త్ మెడికల్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ఐఎంఏ నిర్మల్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఉదిగిరి రామకృష్ణ , స్టేట్ వర్కింగ్ కమిటీ నాయకులు డాక్టర్ అప్పాల చక్రధారి అన్నారు. దేశవ్యాప్త ధర్నాలో భాగంగా నిర్మల్ ఐఎంఏ ఆధ్వర్యంలో రాజస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన తలాతోక లేని వైద్య బిల్లును ఉపసంహరించు కోవాలని జిల్లా కేంద్రంలోని ఐఎంఏ కార్యాలయం ఎదుట సోమవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ప్రైవేటు వైద్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తే ప్రజారోగ్యానికి విఘాతం కలుగుతుందన్నారు. ప్రజలకు ఆరోగ్యం కల్పించడం అనేది రాష్ట్ర ప్రభుత్వాల ధర్మమని ఇది రాజస్థాన్ ప్రభుత్వం చూసుకోకుండా ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యంచేస్తూ ప్రైవేట్ డాక్టర్ల వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుందన్నారు. ఎమర్జెన్సీ అనే పదానికి నిర్వచనం కూడా చెప్పకుండా ఈ బిల్లులో ఎమర్జెన్సీ సేవలు అన్నింటికీ ఏ రకమైన చార్జీలు లేకుండా 24 గంటలు డాక్టర్లు చూడాలని చెప్పడంతో వైద్యులు, రోగుల మధ్య సంబంధాలు దెబ్బతింటాయన్నారు. నిజంగా ప్రజారోగ్యంపై పాలకులకు ప్రేమ ఉంటే మొత్తం ప్రైవేట్ వైద్య వ్యవస్థను జాతీయం చేసి దేశ ప్రజలందరికీ సామాజిక వైద్యాన్ని ఉచితంగా అందించాలని సూచించారు. కార్యక్రమంలో సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ దామెరరాములు, ప్రధాన కార్యదర్శి పొలిశెట్టి సంతోష్, ప్రచారసమితి నాయకులు డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు, వైద్యులు శ్రీనివాస్, బీఎల్‌ఎన్.రెడ్డి, కావేటి శ్రీకాంత్, రనిత్, సుచిన్, మల్లయ్య, రాఘవ స్వామి పాల్గొన్నారు.