వరుడికి పాజిటివ్‌: అధికారుల బంపర్ ఆఫర్‌ తెలిస్తే..

Wedding Pheras In PPE After Groom Tests Covid Positive - Sakshi

అయిదు రోజుల పెళ్లి కాదు.. అరుదైన పెళ్లి

వరుడికి కరోనా, అధికారుల వినూత్న ఐడియా

పీపీఈ కిట్లలో వివాహ వేడుక వైరల్‌

సాక్షి, భోపాల్‌: కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తున్న ప్రస్తుత సంక్షోభ సమయంలో ఒక విచిత్రమైన పెళ్లి తంతు విశేషంగా నిలిచింది. ముహూర్తాలు పెట్టుకుని, బంధుమిత్రులను ఆహ్వానించి, అంగరంగ వైభవంగా తమ బిడ్డలకు పెళ్లి చేయాలనుకున్నారు. తీరా అన్నీ సిద్ధం  చేసుకున్నాక, మాయదారి మహమ్మారి  విజృంభించింది. ఇది చాలదన్నట్టుగావరుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో వీరి మూడు ముళ్ల వేడుక అరుదైన  పెళ్లిగా మారిపోయింది. చాలా పరిమితమైన అతిధులు, పీపీఈ కిట్లు వేసుకుని మరీ ఒక జంట తమ వివాహ వేడుకను ముగించుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని రాట్నంలో ఈ వివాహ తంతు జరిగింది. వధువు, వరుడుతోపాటు మరో ముగ్గురు పూర్తి రక్షణ చర‍్యలు తీసుకుని వివాహ  కార్యక్రమాన్ని  ముగించారు.  పీపీఈ కిట్లు, పూలదండలతో హోమగుండం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న  ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో  చక్కర్లు కొడుతోంది.  

రాట్నం తహశీల్దార్‌ గార్గ్‌ అందించిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 19న కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. దీంతో పెళ్లిని ఆపాలని తొలుత ప్రయత్నించారు. కానీ సీనియర్‌ అధికారులు చొరవ తీసుకుని వినూత్నంగా ఆలోచించారు. కరోనా విస్తరించ కుండా, చాలా తక్కువ మందితో పీపీఈ కిట్లతో సోమవారం పెళ్లి ముచ్చటను కాస్తా ముగించారు ఇరు కుటుంబాల వారు. అయితే ఇక్కడో విశేషంకూడా ఉంది. ప్రస్తుతం కరోనా కాలంలో కోవిడ్‌ మార్గదర‍్శకాలను  ప్రజలు పాటించేలా ఒక వినూత్న ఐడియాను చేపట్టారు అధికారులు. కేవలం 10 లేదా అంతకంటే తక్కువ అతిథులతో వివాహం చేసుకోబోయే జంటలకు భీంద్ ఎస్‌పీ మనోజ్ కుమార్ సింగ్ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. ఈ నూతన దంపతులకు తన ఇంట్లో రుచికరమైన విందు ఇస్తామని  ప్రకటించారు. అంతేకాదు ఆ జంటలకు మెమెంటోలు ఇస్తామన్నారు.కోవిడ్ మార్గదర్శకాలతో  వారిని సురక్షితంగా  ప్రభుత్వ వాహనంలో ఇంటికి సాగనంపుతామని కూడా వెల్లడించారు. కాగా కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వివాహ కార్యక్రమాలకు గరిష్టంగా 50 మంది​ అతిథులకు మాత్రమే అనుమతి ఉంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top