విజయ్.. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో సంచలనం. అంటే ఇప్పుడు రియల్ హీరో. అంతుకుముందు రీల్ హీరో. సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటుడు. ఇప్పుడు అదే ఆయన్ను సీఎం పీఠంవైపు నడిపించింది. రజినీకాంత్ లాంటి వారే రిస్క్ చేయలేని చోట.. విజయ్ ఒక అడుగు ముందుకేసి మరీ సక్సెస్ కొట్టాడు. ధైర్యమే సక్సెస్‌కు పునాది అనే విషయాన్ని విజయ్ నిరూపించారు. అలాంటి ఇలాంటి సక్సెస్ కాదు. తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకేలు మాత్రమే ఎప్పట్నుంచో రాజ్యమేలుతున్న చోట. ఒక గట్టిదెబ్బ కొట్టాడు.
కొత్త పార్టీతో తొలి అడుగు వేసేటప్పుడు ప్రభుత్వ ఏర్పాటు వరకూ వెళ్లడం అంత చిన్న విషయం కాదు. అలాంటిది విజయ్ చేసి చూపించాడు. ఏదో 60 నుంచి 70 సీట్లు అని అంచనా వేసిన చోట విజయ్.. ఏకంగా వందకు పైగా సీట్లు సాధించాడు. మొత్తం 108 స్థానాల్లో విజయ్ భేరీ మోగించి తన సత్తా చూపెట్టాడు.
అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్య్యే మ్యాజిక్ ఫిగర్‌కు 10 సీట్ల దూరంలో విజయ్ ఆగిపోవడంతో తీవ్ర అనిశ్చిత నెలకొంది. ఫలితంగా రెండు, మూడు సీట్లు సాధించిన పార్టీలకు డిమాండ్ పెరిగిపోయింది.
దీనిపై వరుసగా ఫలితాలు వచ్చిన దగ్గర్నుంచీ హైడ్రామా నడుస్తూనే ఉంది. ఒకసారి చిన్న పార్టీల మద్దతు అని, కాసేపు కాదనే డ్రామానే నడిచింది. దాంతో వరుసగా గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరడం, అక్కడ పూర్తి సభ్యుల మద్దతు లేదనడం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ మూడుసార్లు గవర్నర్‌ను విజయ్ కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ఇక్కడితో ఎండ్ కార్డ్ పడలేదు. ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎట్టకేలకు వీసీకే, ఐయూఎంలు తాము మద్దతు ఇస్తున్నట్లు లేఖలు ఇవ్వడంతో మరొకసారి గవర్నర్‌ను కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎట్టకేలకు గవర్నర్ అపాయింట్‌మెంట్..
అయితే నాల్గోసారి అపాయింట్‌మెంట్‌లో ట్విస్ట్ చోటు చేసుకుంది. కాసేపు గవర్నర్ అపాయింట్ ఇవ్వలేదన్నారు. ఆయన కేరళ పర్యటనకు వెళుతున్నారనేది మొదటి సారాంశం. దాంతో విజయ్ సీఎం ప్రమాణ స్వీకారానికి మరింత సమయం పడుతుందా? అని అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది.
ఈ నడుమ గవర్నర్ తన కేరళ పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. విజయ్‌కు అపాయింట్‌మెంట్ ఖరారు అయ్యింది. దాంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గవర్నర్ మనసు మార్చుకుని అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయినట్లే.
ఇన్ని టేకులు సినిమాల్లో కూడా తీసుకుని ఉండడు..
తమిళనాడులో ప్రముఖ హీరోల్లో ఒకరైన విజయ్.. సినిమా చేసేటప్పుడు కూడా ఇన్ని టేకులు తీసుకుని ఉండడు అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. సినిమా మనిషి కదా.. ఓపిక ఎక్కువే ఉంటుంది. టేకులు తీసుకోవడం విజయ్‌కు అలవాటే. అదే ఇప్పుడు జరుగుతుందని అనేవారు కూడా ఉన్నారు. రియల్ లైఫ్‌లో టేక్‌లు ఇలానే ఉంటాయని, ఇంత హైడ్రామా నడుమ విజయ్ కూడా మనసులో ఇదే అనుకుని ఉంటాడని అంటున్నారు. టేకాఫ్ అయ్యే ముందు ఈ టేకులను పెద్దగా పట్టించకోవాల్సిన అవసరం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం.
సినిమా పరంగా టేకులు అంటే ఒకే సందర్భాన్ని పదే పదే చేయడం. ఇప్పుడు అదే విజయ్ నిజ జీవితంలో కూడా జరుగుతూ ఉంది. విజయ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన నాటి నుండి ఇదే జరుగుతూ వస్తోంది. ఒకే సందర్భం.. గవర్నర్‌ను విజయ్ మళ్లీ మళ్లీ కలవడం. దీనికి ఎప్పటికి ఫుల్‌స్టాప్ పడుతుందో చూడాలి. ఈరోజు(శనివారం, మే 9వ తేదీ) ముగింపు పడే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ కేరళ పర్యటన రద్దు నేపథ్యంలో ఆ టేక్‌కు కాస్త క్లియరెన్స్ వచ్చింది. ఫలితంగా విజయ్ సీఎం టేక్ రేపో, మాపో ఓకే అవ్చొచ్చు.


