తమిళనాట చిత్తయిన రాజకీయ ఉద్దండులు
ఓటమి పాలైన 14 మంది మంత్రులు
ఎమ్మెల్యేలైన సామాన్యులు
టీవీకే నుంచి 13 మంది మహిళల గెలుపు
తమిళనాట 2026 అసెంబ్లీ ఎన్నికలు సంచలనం సృష్టించాయి. అంచనాలను తలకిందులు చేశాయి. ‘విజయ్’భేరి ముందు దిగ్గజ పార్టీలు చిత్తయ్యాయి. రాజకీయాల్లో ఉద్దండులైన సీఎం స్టాలిన్ సహా 14 మంది మంత్రులు ఓటమిపాలయ్యారు. విజయ్ ప్రభంజనం ముందు మంత్రులే కాదు, కొన్ని పార్టీల కీలక నేతలు, హేమాహేమీలు నిలువలేకపోయారు. విజయ్ టీవీకే పార్టీ తరఫున దళితులు, దివ్యాంగులు, మహిళలు సత్తాచాటి ఎమ్మెల్యేలు కావడం గమనార్హం.
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని మార్పు చోటుచేసుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ప్రభంజనం సృష్టించి 108 స్థానాలతో అతిపెద్ద పార్టీ గా అవతరించింది. దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీ ల ఆధిపత్యానికి గండికొట్టింది. అభివృద్ధికి చిరునామా అయిన చెన్నై కొళత్తూరులో లేని వసతులు అంటూ లేవు. పదిహేనేళ్లుగా స్టాలిన్ ఈ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే, ఇక్కడి ఓటర్లు తాజాగా ఆయన్ని ఓడించి, టీవీకేకు చెందిన వీఎస్ బాబును అసెంబ్లీకి పంపించడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.
కూలిన మంత్రుల కోటలు
డీఎంకే ప్రభుత్వంలోని మొత్తం 34 మంది మంత్రులలో 14 మంది ఘోరంగా ఓడిపోయారు. ఏళ్ల తరబడి తమ బలాన్ని చాటుతూ కంచు కోటలుగా నియోజకవర్గాలను మలచుకున్న సీనియర్లు విజయ్ ప్రభంజనం ముందు నిలబడలేకపోయారు. సీనియర్ నాయకులు, మంత్రులు దురైమురుగన్(కాటా్పడి), సుబ్రమణియన్ (సైదాపేట), అన్బిల్ మహేశ్(తిరువెరంబూరు), పళణి వేల్ త్యాగరాజన్, మూర్తి, నాజర్, స్పీకర్ అప్పావు(రాధాపురం), డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి(కీల్ పెన్నాత్తూరు) తదితరులు టీవీకే అభ్యర్థుల చేతిలో ఓటమి చెందారు.
వీరిలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఎం.సుబ్రమణియన్, విద్యా మంత్రిగా అన్బిల్ మహేశ్ నిత్యం ప్రజలలోనే ఉన్నారు. తమిళనాడులో వైద్యం, విద్య బలోపేతంలో వీరి పాత్ర కీలకంగా నిలిచినా, విజయ్ ధాటికి తలవంచకతప్పని పరిస్థితి నెలకొంది. ఇక రాజకీయ ఉద్దండులైన నామ్ తమిళర్ కట్చి కనీ్వనర్ సీమాన్, కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్, సినీ దర్శకుడు సుందర్ సీ వంటి వారు కూడా టీవీకే అభ్యర్థుల చేతిలో పరాజయం చవి చూశారు.
ఒక్క ఓటుతో చేజారిన మంత్రి గెలుపు
శివగంగ జిల్లా తిరుపత్తూరు నియోజకవర్గంలో హోరాహోరీగా సాగిన పోరులో డీఎంకే సీనియర్ నేత, మంత్రి కేఆర్ పెరియకరుప్పన్ అనూహ్య రీతిలో పరాజయం పాలయ్యారు. టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి కేవలం ఒక్క ఓటు తేడాతో మంత్రిపై గెలిచి చరిత్ర సృష్టించారు. 212 ఓట్లతో ఆధిక్యం ప్రదర్శిస్తూ వచి్చన మంత్రికి చివరి రౌండ్ షాక్ ఇవ్వడంతో ఓటమి పాలయ్యారు. ఇక్కడ కౌంటింగ్ సమయంలో మూడు ఈవీఎంలు మొరాయించడంతో చివరకు వాటికి సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడంతో ఒక్క ఓటుతో టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి గెలుపొందడం విశేషం.
భారీ మెజార్టీ లూ టీవీకే కైవసం
ఈసారి తమిళనాడు అసెంబ్లీలో సామాన్యుల గళం మోగనుంది. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన టాప్–10 అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే, అందులో 9 మంది విజయ్ పార్టీ కి చెందిన వారే ఉండటం విశేషం. అత్యధిక మెజారిటితో గెలిచిన వారిలో తొలి స్థానంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి 98,110 ఓట్ల మెజారిటీతో నిలవగా మిగిలిన 9 మంది టీవీకేకు చెందిన వారే. ఆ తర్వాతి స్థానాల్లో షోళింగనల్లూర్ నుంచి శరవణన్ (96,780), మాధవరం నుంచి విజయ్ ప్రభు (94,985) భారీ మెజారిటీతో విక్టరీ కొట్టారు. పూందమల్లి, సేలం వెస్ట్, ఆవడి వంటి నియోజకవర్గాల్లో టీవీకే అభ్యర్థులు 70 వేలకుపైగా ఓట్ల మెజారిటీ సాధించారు.
టీవీకే తరఫున సామాన్యులు
రాజకీయ నేపథ్యం ఉన్నవారికే కాకుండా, సమాజంలోని అట్టడుగు వర్గాలకూ విజయ్ టికెట్లు కేటాయించారు. ఈ ఎన్నికల్లో ఓ ఆటో డ్రైవర్, ఓ డ్రైవర్ కుమారుడు, దివ్యాంగులు, మహిళలు గెలవడం విశేషం. టీవీకే తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో 35 ఏళ్లలోపు వారు 22 మందికి పైగా ఉన్నారు. గెలిచిన వారిలో 26 మంది దళిత సామాజిక వర్గానికి చెందినవారు. 13 మంది మహిళలూ ఈ సారి టీవీకే తరఫున అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
ఇక పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ టీవీకే అభ్యర్థులు తమ డిపాజిట్లను కాపాడుకున్నారు. టీవీకే అభ్యర్థులు 67 చోట్ల ఓడినా రెండో స్థానం దక్కించుకోవడం విశేషం. ఇక్కడ డీఎంకే, అన్నాడీఎంకేలు మూడో స్థానానికి పరిమితమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కొంగు మండలం, డెల్టా, ఉత్తర తమిళనాడుల్లో విజయ్ టీవీకే ప్రభంజనం సృష్టించినా, కేరళ– తమిళనాడు సరిహద్దుల్లోని కన్యాకుమారి జిల్లాలో ఆరు స్థానాలు ఉండగా ఒక్కచోట కూడా ఖాతా తెరవక పోవడం గమనార్హం.


