తమిళనాడు ఎన్నికలంటేనే.. నీలగిరిలో రాజకీయాలు వేడెక్కిపోతాయి. శీతల విడిదికి కేంద్రాలుగా ఉన్న నీలగిరి కొండల్లో వేడి రాజుకుంటుంది. తూర్పు, పశ్చిమ కనుమల కలయికకు కేంద్రబిందువైన నీలగిరుల్లో.. ఊటీ, కున్నూరు, కూడలూరు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఎన్నికలు ఏవైనా కానీ.. ఈ మూడు నియోజకవర్గాల్లో గెలుపోటములను అంచనా వేయడం తలలు పండిన విశ్లేషకులకు కూడా సాధ్యం కాదనే విషయం ఇక్కడి అభ్యర్థులను కల్లోలపరుస్తోంది. ఈ మూడు నియోజకవర్గాలపై విశ్లేషణను ఎక్కడా మిస్సవ్వకుండా చదివేయండి..
అంత ఈజీ కాదు..
ఊటీ, కున్నూరు, కూడలూరు నియోజకవర్గాల్లో ప్రస్తుతం డీఎంకే-కాంగ్రెస్ కూటమి రెండు చోట్ల.. అన్నాడీఎంకే ఒకచోట బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే.. ఇక్కడ గెలుపోటములను అంచనా వేయడం అంత ఈజీ కాదు. ఊటీ నియోజకవర్గాన్ని ఇక్కడ అధికారికంగా ఉదగై అంటారు. నిజానికి ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్.గణేశ్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పర్యాటకమే ప్రధాన ఆర్థిక వ్యవస్థ. టీ-కాఫీ తోటలకు నెలవు. అయితే.. కీలకమైన పరిశ్రమలు మూతపడడంతో ఇక్కడ నిరుద్యోగిత పెరుగుతోంది. స్థానిక సమస్యలు తోడవ్వడం యాంటీ-ఇన్‌కంబెన్సీకి దారితీసే ప్రమాదాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఆ పార్టీకి కలిసివచ్చే అంశమే..!
ఇక కున్నూరు నియోజకవర్గం డీఎంకేకు బలమైన ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతం. టీ-కాఫీ తోటల్లో పనిచేసే కార్మికులకు ఈ నియోజకవర్గం నిలయం. కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా డీఎంకేకు కలిసివచ్చే అంశమే..! అయితే.. తేయాకును సేకరణకు ఇచ్చే కూలీ సమస్య పరిష్కారం కాకపోవడంతో.. ఇక్కడి కార్మికులు అసంతృప్తిగా ఉన్నారు. దీన్ని అన్నాడీఎంకే అడ్వాంటేజ్‌గా తీసుకుంటే.. పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆ మూడు వర్గాలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపితే..
ఇక కూడలూరు నియోజకవర్గంలో గిరిజన ఓటర్లదే ఆధిపత్యం. అనూహ్య ఫలితాలకు ఈ నియోజకవర్గం వేదిక. ఇక్కడ ఇరులర్, కురుంబర్ వర్గాలు గెలుపోటములను శాసిస్తాయి. వీరితోపాటు.. పడుగర్ వర్గానికి పెద్దమొత్తంలోనే ఓటుబ్యాంకు ఉంది. ఈ మూడు వర్గాలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపితే.. ఆ పార్టీ అభ్యర్థి విజయం కరతలామలకమే..! గిరిజనుల సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీలు ఇచ్చే అభ్యర్థికే ఇక్కడి ఓటర్లు పట్టంకడతారు.
ఆ నియోజకవర్గాల్లో పాగా వేయాలంటే..
మొత్తానికి నీలగిరిలోని మూడు నియోజకవర్గాల్లో పాగా వేయాలంటే.. ఏ పార్టీ అయినా.. ఉపాధి, పరిశ్రమల కల్పన, తేయాకు సేకరణ కూలీ ధర, కార్మికుల సంక్షేమం వంటి అంశాలు కీలక భూమిక పోషిస్తాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా పడుగర్ వర్గం ఓటు బ్యాంకు అత్యంత కీలకం. డీఎంకే, కాంగ్రెస్, అన్నాడీఎంకే పార్టీలకు వేర్వేరుగా ఓటు బ్యాంకులు ఉన్నప్పటికీ.. ఈసారి పెరిగిన యువ ఓటు బ్యాంకు ప్రస్తుత ఎన్నికల్లో గెలుపోటములను శాసించే అవకాశాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఏది ఏమైనా.. ఊటీలో విజయానికి కాంగ్రెస్ ఈసారి చమటోడ్చాల్సిందే..! కున్నూరును తిరిగి నిలబెట్టుకోవాలంటే.. కార్మికుల కూలీ ధరలపై డీఎంకే స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఇక కూడలూరులో అన్నాడీఎంకే బలంగా కనిపిస్తున్నా.. నెక్-టు-నెక్ పోటీ తప్పదని తెలుస్తోంది.


