బెంగాల్‌  సీఎంగా సువేందు ప్రమాణం  | Suvendu Adhikari takes oath as West Bengal First CM | Sakshi
Sakshi News home page

బెంగాల్‌  సీఎంగా సువేందు ప్రమాణం 

May 10 2026 2:07 AM | Updated on May 10 2026 2:07 AM

ప్రమాణం చేస్తున్న సువేందు 

కోల్‌కతాలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం 

ప్రధాని మోదీసహా బీజేపీ అగ్రనేతల హాజరు 

అధికారం కట్టబెట్టినందుకు ఓటర్లకు కృతజ్ఞతగా సాష్టాంగనమస్కారం చేసిన ప్రధాని  

వేదిక ప్రాంగణంలో ఝాల్‌మురీ స్టాళ్లు    

కోల్‌కతా: పోరాటాల గడ్డ పశ్చిమబెంగాల్‌లో కమలనాథుల పరిపాలనా శకానికి నాందిపలుకుతూ ప్రధాని మోదీ సమక్షంలో రాష్ట్ర అగ్రనేత సువేందు అధికారి శనివారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తద్వారా రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తొలి బీజేపీ నాయకునిగా సువేందు చరిత్ర సృష్టించారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, పలువురు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్‌డీఏ కూటమి పార్టీల అగ్రనేతల సమక్షంలో అత్యంత అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి అధికారి చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. 

తర్వాత ఉప్పొంగిపోయిన ప్రధాని తమకు అపూర్వ విజయాన్ని అందించిన బెంగాల్‌ ఓటర్లకు మోకాళ్లపై ఒంగి నేలకు తల ఆన్చి నమస్కారంచేశారు. ఈ సందర్భంగా బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లోని ప్రమాణస్వీకార ప్రాంగణం జైశ్రీరాం, భారత్‌ మాతాకీ జై నినాదాలతో మార్మోగిపోయింది. భవానీపూర్‌లో మమతా బెనర్జీని మట్టికరిపించి, నందిగ్రామ్‌లో విజయాన్ని సాధించిన సువేందుకు ప్రధాని ప్రమాణ స్వీకారం తర్వాత శుభాకాంక్షలు తెలిపారు. 

సువేందు తర్వాత సీనియర్‌ బీజేపీ నేత దిలీప్‌ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్‌ కీర్తనీయ, క్షుదిరాం టుడు, నితీశ్‌ ప్రామాణిక్‌లు కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. బ్రాహ్మణ, ఓబీసీ, గిరిజన, కాయస్థ, మథువా, రాజ్‌వంశీ ఇలా ఆరు సామాజిక వర్గాలకు చెందిన నేతలను కేబినెట్‌లోకి తీసుకుని బీజేపీ తమ సామాజిక సమానత్వాన్ని చాటింది. రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల నేతలకు సమప్రాధాన్యతనిచ్చింది. సోమవారం రాజ్‌భవన్‌లో మరికొందరు నేతలు మంత్రులుగా ప్రమాణంచేయనున్నారు. ప్రమాణంచేసిన మంత్రులకు ఇంకా శాఖలను కేటాయించలేదు. సోమవారం శాఖలను కేటాయించి తొలి కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. 

పెద్దసంఖ్యలో హాజరైన కమలదళ సభ్యులు 
తొలిసారిగా రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్న క్షణాలను చిరస్మరణీయంగా మార్చాలని బీజేపీ నిర్ణయించింది. ఇందుకోసం భారీసంఖ్యలో అభిమానులు, కార్యకర్తలను తరలించారు. ప్రాంగణమంతా భారీ ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటుచేసి సువేందు, మోదీల పాత ప్రసంగాలను ప్రసారంచేశారు. ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారంచేశారు. పార్టీ జెండాల రెపరెపలతో ప్రాంగణం కాషాయమయమైంది. 

‘‘ఈరోజు కోసం ఎన్నాళ్ల నుంచో వేచిచూస్తున్నా. ఎట్టకేలకు మా ప్రభుత్వం వచ్చింది. ఇక టీఎంసీ అరాచకాలకు చెట్లుచీటీ పడుతుంది. సరిహద్దు ఆవలినుంచి చొరబాట్లు ఆగిపోతాయి. అరాచకాలను తట్టుకోలేక నా కుమారుడు సొంత రాష్ట్రం నుంచి వలసపోయాడు. ఇప్పుడు తిరిగొస్తాడు’’అని 80 ఏళ్ల భగవతీదేవి చెప్పారు. హిందు ప్రభుత్వపాలన ఆరంభాన్ని కళ్లారా చూసేందుకు వచ్చానని 70ఏళ్ల నవదీ్వప్‌ మఠ్‌లో ప్రజ్ఞాన్‌ మహరాజ్‌అనే సాధువు చెప్పారు. బీజేపీ ప్రభుత్వం కొలువుతీరే క్షణాలను కళ్లారా చూడాలని కెనడానుంచి వచ్చానని 50 ఏళ్ల వ్యక్తి చెప్పారు. 

ప్రత్యేక ఆకర్షణగా ఝాల్‌మురీ.. 
ప్రచారంవేళ ప్రధాని రుచిచూసిన బెంగాలీ చిరుతిండి ఝాల్‌మురీ శనివారం ప్రమాణస్వీకార ప్రాంగణంలో అందర్నీ నోరూరించింది. బీజేపీ నేతలు ప్రత్యేకంగా ఈ స్టాళ్లను ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. మరవరాలు, పచ్చి మిరప, మసాలా దినుసులతో ఝాల్‌మురీ చేస్తారు. దీనిని తినేందుకు పెద్దసంఖ్యలో జనం ఎగబడ్డారు. 20 స్టాళ్లు సరిపోక సొంతంగా కొందరు వ్యాపారులు సైతం స్టాళ్లు పెట్టుకున్నారు. ‘‘ఝాల్‌మురీ కాస్తంత ఘాటుగాఉంటుంది. కానీ బీజేపీ విజయానికి గుర్తుగా తీపి జోడించాం. అయినా వేగంగా సరుకు అమ్ముడపోయింది’’అని 24 నార్త్‌పరగణాల జిల్లా నుంచి స్టాల్‌ పెట్టిన మనీశ్‌ యాదవ్‌ చెప్పారు. బీజేపీ జెండా రంగుల్లో తయారుచేసిన రసగుల్లా అయితే హాట్‌కేకులా అమ్ముడుపోయింది. ‘‘మామూలుగా దొరికే ఝాల్‌మురీ కంటే ఇక్కడి ఝాల్‌మురీ నిజంగా బాగుంది’’అని కోల్‌కతాలోని గోలీగంజ్‌ వాసి మంజరి బసు అన్నారు.

కదలివచ్చిన తారాలోకం 
ప్రమాణ స్వీకారోత్సవంలో బెంగాలీ సినీలోకం తరలివచ్చింది. ఫిల్మ్, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగం నుంచి పలువురు ప్రముఖులు కార్యక్రమానికి విచ్చేశారు. ప్రసేన్‌జీత్‌ ఛట్జీ, జీషు సేన్‌గుప్తాలతోపాటు శాస్త్రీయ కళాకారులు పండిత్‌ అజయ్‌ చక్రవర్తి, డ్యాన్సర్‌ మమతా శంకర్, నటుడు రిషి కౌశిక్, పాయల్‌ సర్కార్‌సహా బెంగాలీ టెలివిజన్‌ రంగ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

వాళ్లకు న్యాయం చేయాలి: సీఎం తల్లి 
సువేందు సీఎంగా ప్రమాణం చేశాక ఆయన తల్లిదండ్రులు గాయత్రి, సిసిర్‌ అధికారులు అమితానందం వ్యక్తంచేశారు. తూర్పు మేదినీపూర్‌లోని కాంతి పట్టణంలో సొంతింట్లో వాళ్లు మాట్లాడారు. ‘‘మాకొడుకు సీఎం అయ్యాడని మాకంటే ఎక్కువగా బెంగాలీ ప్రజలే సంతోషిస్తున్నారు. సువేందు హయాంలో ఇకనైనా ఆర్జీకర్‌ వైద్యురాలి హత్యోదంతంలో బాధితులకు న్యాయం జరగాలి. ఇలాంటి అకృత్యాల్లో నిందితులకు కఠినంగా శిక్షలుపడేలా చేయాలని కోరుకుంటున్నా’’అని తల్లి గాయత్రి అన్నారు. సువేందు తండ్రి సిసిర్‌ గతంలో మూడుసార్లు ఎంపీగా గెలిచారు.

బీజేపీ అమరులకు మోదీ నివాళులు 
గత 15 ఏళ్లలో మమతాబెనర్జీ ప్రభుత్వ హయాంలో టీఎంసీ దాడుల్లో మృతిచెందిన బీజేపీ నేతలు,కార్యకర్తలకు నివాళిగా ఏర్పాటుచేసిన తాత్కాలిక స్మారకం వద్ద ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌  షా అంజలి ఘటించారు. ప్రమాణస్వీకార ప్రాంగణంలో ఈ స్మారకం ఏర్పాటుచేశారు. ‘‘కోల్‌కతాలో ఓవైపు బీజేపీ తొలి సర్కార్‌ కొలువుతీరుతుంటే మేం మాత్రం తొలుత టీఎంసీ అరాచకపాలనలో అమరులైన బీజేపీ కార్యకర్తలకు నివాళులరి్పంచాం. వీళ్ల త్యాగం సదా మాకు స్ఫూర్తిదాయకం’’అని తర్వాత మోదీ తన ‘ఎక్స్‌’ఖాతాలో పోస్ట్‌చేశారు.  

వృద్ధ నేతకు మోదీ పాదాభివందనం 
98 ఏళ్ల బీజేపీ నేత మఖన్‌లాల్‌ సర్కార్‌ను బీజేపీ ప్రత్యేకంగా వేదిక మీదకు ఆహ్వానించింది. శాలువా కప్పి ఆయన కాళ్లను ప్రధాని మోదీ మొక్కారు. తర్వాత ఆప్యాయంగా హత్తుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెల్సుకున్నారు. జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామప్రసాద ముఖర్జీతో కలిసి 1952లో కశ్మీర్‌లో త్రివర్ణపతాకాన్ని ఎగరేసిన బృందంలో మఖన్‌లాల్‌ ఉన్నారు. ఈ సందర్భంగా ఈయననూ అరెస్ట్‌చేశారు. ‘‘స్వాతం్రత్యానంతరం జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొని ఇప్పటికీ సజీవ స్ఫూర్తిగా ఉన్న అతికొద్ది మందిలో మఖన్‌లాల్‌ ఒకరు’’అని బీజేపీ కొనియాడింది. 1980లో బీజేపీ ఏర్పడ్డాక పశ్చిమబెంగాల్‌లోని వెస్ట్‌ దినాజ్‌పూర్, జల్పాయ్‌గురి, డార్జిలింగ్‌ జిల్లాలకు మఖన్‌లాల్‌ సమన్వయకర్తగా సేవలందించారు. 1981 నుంచి ఏడేళ్లపాటు జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement