సువేందు అధికారి అనే నేను.. | Suvendu Adhikari CM Oath Ceremony Live Updates | Sakshi
Sakshi News home page

సువేందు అధికారి అనే నేను..

May 9 2026 11:12 AM | Updated on May 9 2026 12:15 PM

Suvendu Adhikari CM Oath Ceremony Live Updates

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల సమక్షంలో ఈ ఘట్టం జరిగింది. సువెందు అధికారి క్యాబినెట్‌లో మంత్రులుగా ఎమ్మెల్యేలు దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్,  అశోక్ కీర్తానియా, క్షుదీరం తుడు, నిషిత్ ప్రమాణిక్‌లు కూడా ప్రమాణస్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్‌ గవర్నర్ ఆర్ఎన్ రవి ముఖ్యమంత్రి సువేందు, ఇతర మంత్రుల చేత ప్రమాణం చేయించారు. దీనికి ముందు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అమిత్ షా సమక్షంలో జరిగిన సమావేశంలో సువేందు అధికారి బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనితో ఆయన బెంగాల్ తొమ్మిదవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో  సువేందు అధికారి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరుగుతోంది.

 


సువేందు అధికారి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కోల్‌కతా చేరుకున్న ప్రధాని స్థానిక బీజేపీ సీనియర్ కార్యకర్తలలో ఒకరైన మఖన్ లాల్ సర్కార్‌ను సన్మానించి, ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. 1952లో కశ్మీర్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే ఉద్యమంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీతో కలిసి వెళుతున్న సందర్భంలో మఖన్ లాల్ సర్కార్ అరెస్టయ్యారు. ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ వద్ద మిఠాయిలు,  కుంకుమ రంగు ‘రసగుల్లాలు’ విక్రయానికి అందుబాటులో ఉంచారు. దీనికి ముందు ప్రధాని మోదీ,సువేందు అధికారి తదితరులు రవీంద్రనాథ్ ఠాగూర్‌కు నివాళులర్పించారు. 

ప్రమాణ స్వీకార మహోత్సవానికి  కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు సీనియర్ ఎన్‌డీఏ నేతలు హాజరయ్యారు. కాగా పశ్చిమ బెంగాల్‌కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ప్రధాని అక్కడికి చేరుకోగానే ‘మోదీ, మోదీ’ అనే నినాదాలు ఆ ప్రాంగణమంతటా మార్మోగిపోయాయి.

 


పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. ఎన్నికల సంగ్రామంలో సంచలన విజయంతో రాష్ట్రంలో కమలం వికసించింది. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై భవానీపూర్‌లో అద్భుత విజయం సాధించిన బీజేపీ నేత సువేందు అధికారి, ఈరోజు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉత్కంఠభరితమైన రాజకీయ పరిణామాల మధ్య జరుగుతున్న ఈ ఘట్టాన్ని యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ఎన్‌డీఏ అగ్రనేతలు హాజరయ్యారు. 

క్యాబినెట్ రేసులో సీనియర్లు
సువేందు అధికారి నేతృత్వంలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వంలో కీలక మంత్రి పదవుల కోసం బీజేపీలోని పలువురు ప్రముఖ నేతలు బలమైన పోటీదారులుగా ఉన్నారు. వారిలో మాజీ కేంద్ర మంత్రి నిశిత్ ప్రమాణిక్, బారక్‌పూర్ ఎమ్మెల్యే అర్జున్ సింగ్, ముర్షిదాబాద్ నుంచి రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే గౌరీ శంకర్ ఘోష్ వంటి కీలక నేతల పేర్లు మంత్రివర్గ కూర్పులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

మంత్రివర్గంలో ఆశావహుల జాబితా
వీరితో పాటు మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వారిలో మరికొన్ని ప్రముఖ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ వీహెచ్‌పీ మాజీ అధ్యక్షుడు శృతి శేఖర్ గోస్వామి, మాజీ ఎంపీ రూపా గంగూలీ, న్యాయవాది కౌస్తవ్ బాగ్చీతో పాటు దీపక్ బర్మన్, సజల్ ఘోష్, ఇంద్రనీల్ ఖాన్, జాయెల్ ముర్ము లాంటి నాయకులు కొత్త ప్రభుత్వంలో క్యాబినెట్ బెర్తుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
 

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement