బీజేపీ నేతల తీరును ఎండగట్టండి
మంత్రులు, ఎంపీలతో భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం!
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆదేశించినట్లు తెలిసింది. తేజస్వీ వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయంటూ, బీజేపీ నేతల తీరును ప్రజల్లో ఎండగట్టాలని సూచించినట్లు సమాచారం. కాగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా, పార్లమెంట్‌లో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించాలని ఆయన చెప్పారు.
గురువారం సీఎం ఢిల్లీ తుగ్లక్‌రోడ్డులోని తన అధికారిక నివాసంలో పలువురు పార్టీ ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్లమెంట్‌లో రాష్ట్ర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తేజస్వీ వ్యాఖ్యలపై స్పందిస్తూ గట్టిగా తిప్పికొట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. కాగా, తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రొద్భలంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
గతంలో ‘తల్లిని చంపి, బిడ్డను బతికించారు’ అంటూ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలే... తాజాగా తేజస్వీ విమర్శలకు దోహదం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఢిలీల్లోని తెలంగాణ భవన్‌లో ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, యెన్నెం శ్రీనివాస్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు, మాజీమంత్రి బసవరాజు సారయ్య విలేకరులతో మాట్లాడారు.


