Sakshi News home page

నిషేధించిన పద్ధతే.. 41 మంది కార్మికులను కాపాడింది!

Published Tue, Nov 28 2023 9:20 PM

Rat Hole Mining Is Illegal But Used In Rescue Operation - Sakshi

ఉత్తరకాశీ: ఉత్తరకాశీ సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తీసుకురావడానికి చివరికి నిషేధించిన పద్దతే దిక్కైంది. భారతీయ సాంకేతికతతో పాటు అమెరికా నుంచి తీసుకొచ్చిన భారీ యంత్రాలు కూడా ధ్వంసమయ్యాయి. చివరికి గతంలో నిషేధించిన ర్యాట్ హోల్ పద్దతినే ఉపయోగించారు. ఆరు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకున్నప్పటికీ చివరికి అత్యంత ప్రమాదకర విధానంలోనే రెస్క్యూ బృందాలు చేరుకోగలిగారు. అసలు ఏంటి ఈ ర్యాట్ హోల్ మైనింగ్? ఎందుకు నిషేధించారు. 

ఏమిటీ ర్యాట్‌–హోల్‌ పద్ధతి?
మేఘాలయలో ఈ పద్ధతి చాలా ఫేమస్‌. అక్రమ బొగ్గు గనుల్లో ఈ విధానంలోనే బొగ్గు తవ్వేస్తారు. ముందుగా గని ఉపరితలంపై మనిషి దూరేంత చిన్న రంధ్రం చేసి అందులోకి వెళ్లి సమాంతరంగా చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ బొగ్గుపొరలను తొలుస్తారు. ప్రస్తుత ఘటనలో పదేళ్లుగా ఈ వృత్తిలో అనుభవం ఉన్న కార్మికులను రంగంలోకి దించారు. అయితే.. బొగ్గును వెలికితీయడం కాకుండా కార్మికులను కాపాడేందుకు ఈ పద్దతిలో పనిచేయడం ఇదే తొలిసారి. 600 మిల్లీమీటర్ల పైపులో కూడా దూరి పనిచేసిన అనుభవం ఉన్నట్లు పేర్కొన్న కార్మికులు.. ఇక్కడ 800 మిల్లీమీటర్ల పైపులోంచి వెళ్లి పనిచేశారు.  

పర్యావరణ ఆందోళనలతో నిషేధం..
ర్యాట్ హోల్ మైనింగ్‌పై అనేక విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ పద్దతిలో కార్మికుల ప్రాణాలకు ఎలాంటి భద్రత ఉండదు. లోపలికి వెళ్లిన కార్మికులకు వెలుతురు ఉండదు. గనులు కూలిపోవడం, వర్షాలు వచ్చినప్పుడు అవి నీటితో నిండిపోవడం వంటి అతి ప్రమాదకర పరిస్థితులు ఈ పద్దతిలో కార్మికులకు ఎదురవుతాయి. గతంలో ఈ రకమైన మైనింగ్ పద్దతుల్లో పదుల సంఖ్యలో కార్మికులు మరణించారు. దీనిపై పర్యావరణ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. శాస్త్రీయ పద్దతిలో లేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ పద్దతిని నిషేధించింది. ఈశాన్య రాష్ట్రాలు సవాలు చేసినప్పటికీ గ్రీన్ ట్రిబ్యునల్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. అయితే... ప్రత్యామ్నాయ మార్గాలు లేనందున మేఘాలయా వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: Uttarkashi Tunnel: ఉత్తరకాశీ టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌ సక్సెస్‌.. 41 మంది సురక్షితం


 

Advertisement

What’s your opinion

Advertisement