రోడ్డు ప్రమాదాలు.. ముంబైలోనే అధికం

Police Records Says More Road Accident In Mumbai - Sakshi

మరణాల్లో నాసిక్‌కు తొలిస్థానం 

సాక్షి, ముంబై: రాష్ట్రవ్యాప్తంగా గడిచిన తొమ్మిది నెలల కాలంలో జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో ముంబైలోనే ఎక్కువ శాతం జరిగినట్లు పోలీసు స్టేషన్లలో నమోదైన రికార్డులను బట్టి తెలుస్తోంది. పోలీసు రికార్డుల ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో ముంబై అగ్రస్థానంలో ఉండగా, మృతుల్లో మాత్రం నాసిక్‌ మొదటి స్థానంలో నిలిచింది. ర్యాష్‌ డ్రైవింగ్, వాహనంపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడం, ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించడం లాంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా వెల్లడైంది. డ్రైవర్ల తప్పిదం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అనేకమందికి గాయాలు కాగా, కొందరు అమాయకులు మృత్యువాత పడ్డారు.

పోలీసు రికార్డుల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21,049 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 9,006 ప్రమాదాల్లో 9,719 మంది మృత్యువాత పడ్డారు. 7,685 ప్రమాదాల్లో 11,240 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2,836 ప్రమాదాల్లో 4,961 మందికి స్వల్ప గాయాలయ్యాయి. 1,522 ప్రమాదాల్లో మాత్రం అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. కేవలం వాహనాలు మాత్రమే దెబ్బతిన్నాయి.

కాగా, గతేడాది జనవరి–సెప్టెంబర్‌ మధ్య కాలంలో 16,797 రోడ్డు ప్రమాదాలు మాత్రమే జరిగాయి. వాటిలో 7,216 ప్రమాదాల్లో 7,768 మంది చనిపోయారు. అంటే, గతేడాది ఇదే కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాల కంటే ఈసారి దాదాపు 5 వేల ప్రమాదాలు ఎక్కువగా జరిగాయని, దాదాపుగా రెండు వేల మంది ఎక్కువగా మరణించారని స్పష్టమవుతోంది. 

1377 బ్లాక్‌ స్పాట్లు 
రాష్ట్రవ్యాప్తంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న 1,377 బ్లాక్‌ స్పాట్లను అధికారులు గుర్తించారు. వీటిలో ముంబైలో బైంగన్‌వాడి జంక్షన్, జోగేశ్వరీ, అంధేరీలోని గుండవలి పరిసర ప్రాంతాలు ఉన్నాయి. నాసిక్‌ గ్రామీణ ప్రాంతాల్లో సిన్నర్‌ ఫాటా, ముండేగావ్‌ ఫాటా, ముసల్గావ్‌ ఫాటా, మోహాదారి ఘాట్, సావద్‌గావ్‌ ఫాటా, అరాయి శివారు ప్రాంతం, వానర్‌వాడి ఉండగా, నాసిక్‌ నగరంలోని ఫాల్కే వాడిని బ్లాక్‌ స్పాట్‌గా గుర్తించారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top