ఆలయాన్ని సందర్శించండి
వెయ్యి రోజులపాటు పూజలు
ప్రజలు విరాళాలు ఇవ్వడం హర్షణీయం
ప్రత్యేక కథనంలో మోదీ
న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రతి ప్రాంతమూ పవిత్రమైనదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. భౌగోళిక హద్దులకు అతీతంగా ఐక్యతా భావంతో అవన్నీ పరస్పరం అనుసంధానమై ఉన్నాయని వెల్లడించారు. తరచుగా విభజనలతో నిండి ఉండే ఈ ప్రపంచంలో ఈ ఐక్యతా స్ఫూర్తి మునుపెన్నడూ లేనంతగా ప్రాసంగికత కలిగి ఉందని స్పష్టంచేశారు. గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని పునరుద్ధరించి, భక్తుల దర్శనాల కోసం తెరిచి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మోదీ ఈ మేరకు ఒక వ్యాసం విడుదల చేశారు.
సోమనాథ్ ఆలయాన్ని రక్షించడానికి ప్రాణాలను అర్పించిన వారి పోరాటాలు, త్యాగాలు, దానిని పదేపదే పునరుర్మించిన వారి కృషిని ఎన్నటికీ మర్చిపోలేమని ఉద్ఘాటించారు. ప్రతి భారతీయుడి హృదయంలో ఐక్యతా భావన, ఉమ్మడి నాగరిక చైతన్యం సజీవంగా ఉన్నందున సోమనాథ్ ఆలయం మహోన్నత వైభవంతో సగర్వంగా నిలుస్తూనే ఉంటుందని తేల్చిచెప్పారు. ఆలయ వైభవాన్ని పునరుద్ధరించడానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన లెక్కలేనంత మంది వ్యక్తులు కృషి చేశారని కొనియాడారు. దేశంలోని ప్రతి భాగాన్నీ వారు పవిత్రంగా భావించారని తెలిపారు.
సోమనాథ్ ప్రాచీన ప్రతిధ్వనులు వినండి
వెయ్యేళ్ల అసాధారణ కృషి, త్యాగాలను స్మరించుకుంటూ రాబోయే వెయ్యి రోజులపాటు సోమనాథ్‌లో ప్రత్యేక పూజలు జరుగుతాయని మోదీ వెల్లడించారు. ఈ ఉత్సవాల కోసం చాలామంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ఇస్తుండడం సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సమయంలో భారతీయులు సోమనాథ్‌ను సందర్శించాలని పిలుపునిచ్చారు. సోమనాథ్ తీరంలో నిలబడి దాని ప్రాచీన ప్రతిధ్వనులను వినాలని సూచించారు. భక్తితో ఉప్పొంగిపోవడమే కాకుండా క్షీణించని, అఖండమైన, ఎవరికీ లొంగని నాగరిక స్ఫూర్తి స్పందనను సైతం అనుభూతి చెందుతారని వివరించారు.
భక్తులు భారతదేశ అజేయ స్ఫూర్తిని తెలుసుకుంటారని, ఎన్ని కుటిల యత్నాలు జరిగినా భారతీయ సంస్కృతి ఎందుకు అజేయంగా నిలిచి ఉందో అర్థం చేసుకుంటారని తెలియజేశారు. సోమనాథ్‌కు వెళ్తే విజయ దృశ్యాన్ని వీక్షించే అవకాశం లభిస్తుందని, అది కచ్చితంగా మరపురాని అనుభూతినిస్తుందని వెల్లడించారు. సోమనాథ్ ఆలయంపై జరిగిన తొలి దాడికి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ఆరంభంలో ఆలయాన్ని దర్శించానని, సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో పాల్గొన్నానని ప్రధానమంత్రి గుర్తుచేశారు. పునరుద్ధరించిన ఆలయాన్ని ప్రారంభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నెల 11న మళ్లీ అక్కడికి వెళ్లబోతున్నానని చెప్పారు. ఆరు నెలల కంటే తక్కువ వ్యవధిలోనే సోమనాథ్‌లో రెండు ముఖ్యమైన ఘట్టాలకు హాజరయ్యే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఉద్ఘాటించారు.
వికాస్ భీ... విరాసత్ భీ
తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజుల్లో 2001 అక్టోబర్ 31న సోమనాథ్ ఆలయ 50వ వార్షికోత్సవాలు నిర్వహించినట్లు మోదీ గుర్తుచేసుకున్నారు. అదేరోజు సర్దార్ పటేల్ 125వ జయంతి వేడుకలు నిర్వహించామని, అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, కేంద్ర హోంమంత్రి ఎల్‌కే అద్వానీ హాజరయ్యారని తెలిపారు. వికాస్ భీ, విరాసత్ భీ(అభివృద్ధి, సంప్రదాయం) అనే సూత్రంతో స్ఫూర్తి పొందామని.. సోమనాథ్ నుంచి కాశీ వరకు, కామాఖ్య నుంచి కేదార్‌నాథ్ వరకు, అయోధ్య నుంచి ఉజ్జయినీ వరకు, త్రయంబకేశ్వర్ నుంచి శ్రీశైలం వరకు ఆధ్యాత్మిక కేంద్రాలను, వాటి సాంప్రదాయ స్వరూపాన్ని కాపాడుకుంటూనే, అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ప్రధాని మోదీ స్పష్టంచేశారు.


