సుసంపన్న భారతం.. పాతికేళ్ల లక్ష్యం.. పంచ ప్రతిజ్ఞలతో సాకారం

pm modi independence day speech 2022 red fort - Sakshi

అవినీతి, బంధుప్రీతి, వారసత్వం... 

అన్ని రంగాలకూ పాకిన సమస్యలు 

వీటిని కూకటివేళ్లతో పెకిలించేస్తాం

దాక్కున్న దోపిడీదారుల్ని లాక్కొస్తాం 

ప్రపంచానికి సాంకేతిక సారథిగా భారత్‌.. ఎర్రకోటపై తొమ్మిదోసారి జెండా ఎగరేసిన మోదీ 

సైనికులు, చిన్నారుల స్వదేశీ స్ఫూర్తికి సెల్యూట్‌.. గాంధీ నుంచి అల్లూరి దాకా అందరికీ నివాళులు 

నారీ శక్తిని గౌరవించుకుందాం అంటూ హితవు.. ‘21 గన్‌ సెల్యూట్‌’తో హొవిట్జర్ల సింహగర్జన 

న్యూఢిల్లీ: అమృతోత్సవ సంబరాల్లో ఆసేతుహిమాచలం తడిసి ముద్దయింది. ఏ ఇంటిపై చూసినా త్రివర్ణ పతాక రెపరెపలే కన్పించాయి. ఎక్కడ చూసినా స్వాతంత్య్ర స్ఫూర్తి వెల్లివిరిసింది. 76వ స్వాతంత్య్ర దినాన్ని సోమవారం దేశమంతా ఘనంగా జరుపుకుంది. ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని, రాష్ట్రాల రాజధానుల్లో ముఖ్యమంత్రులు జెండా ఎగురవేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు సర్వత్రా మువ్వన్నెల జెండా సగర్వంగా ఎగిరింది. చిన్నా పెద్దా అంతా ఉత్సవాల్లో పాల్గొని జోష్‌ పెంచారు. జెండాలు చేబూని ర్యాలీలు, ప్రదర్శనలతో అలరించారు. వలస పాలనను అంతం చేసేందుకు అమర వీరులు చేసిన అపూర్వ త్యాగాలను మనసారా స్మరించుకున్నారు. దేశాభివృద్ధికి, జాతి నిర్మాణానికి పునరంకితమవుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. భారత నౌకా దళం ఆరు ఖండాల్లో పంద్రాగస్టు వేడుకలు జరిపి దేశవాసుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది. 

‘అమృతోత్సవ భారతం ఇక అతి పెద్ద లక్ష్యాలనే నిర్దేశించుకోవాలి. రానున్న పాతికేళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు సంకల్పించుకోవాలి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇందుకు పంచ ప్రతిజ్ఞలు చేసుకుందామంటూ పిలుపునిచ్చారు. ‘మన ఘన వారసత్వం, తిరుగులేని ఐక్యతా శక్తి, సమగ్రత పట్ల గర్వపడదాం. ప్రధాని, ముఖ్యమంత్రులు మొదలుకుని సామాన్యుల దాకా పూర్తి చిత్తశుద్ధితో బాధ్యతలను నెరవేరుద్దాం. తద్వారా వందేళ్ల వేడుకల నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకుందాం’’ అని ప్రజలను కోరారు. ‘‘అవినీతి, బంధుప్రీతి జాతిని పట్టి పీడిస్తున్నాయి. వారసత్వ పోకడలు దేశం ముందున్న మరో అతి పెద్ద సవాలు. రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లోనూ తిష్ట వేసిన ఈ అతి పెద్ద జాఢ్యాల బారినుంచి దేశాన్ని విముక్తం చేయాల్సిన సమయమిదే’ అన్నారు.

76వ స్వాతంత్య్ర దినం సందర్భంగా సోమవారం ఉదయం ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా సంప్రదాయ కుర్తా, చుడీదార్, బ్లూ జాకెట్, త్రివర్ణాల మేళవింపుతో కూడిన అందమైన తలపాగా ధరించారు. అనంతరం పూర్తిగా దేశీయంగా తయారు చేసిన ఏటీఏజీఎస్‌ శతఘ్నుల ‘21 గన్‌ సెల్యూట్‌’ నడుమ జాతీయ జెండాకు వందనం చేశారు. ప్రధానిగా పంద్రాగస్టున ఆయన పతాకావిష్కరణ చేయడం ఇది వరుసగా తొమ్మిదోసారి. అనంతరం గాంధీ మొదలుకుని అల్లూరి దాకా దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులందరికీ పేరుపేరునా ఘన నివాళులర్పించారు. తర్వాత జాతినుద్దేశించి 82 నిమిషాల పాటు ప్రసంగించారు. గత ప్రసంగాల్లా ఈసారి కొత్త పథకాలేవీ ప్రధాని ప్రకటించలేదు. 

దోచిందంతా కక్కిస్తాం 
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ కక్షసాధింపు కోసం కేంద్రం వాడుకుంటోందన్న విపక్షాల విమర్శలను మోదీ తిప్పికొట్టారు. ‘ఒకవైపు దేశంలో కోట్లాది మందికి తలదాచుకునే నీడ లేదు. మరోవైపు కొందరు మాత్రం దాచుకోవడానికి ఎంతటి చోటూ చాలనంతగా అక్రమార్జనకు పాల్పడ్డ తీరును ప్రజలంతా ఇటీవల కళ్లారా చూశారు’ అంటూ విపక్ష నేతలు తదితరుల నివాసాలపై ఈడీ, ఐటీ దాడుల్లో భారీ నగదు బయట పడుతుండటాన్ని ప్రస్తావించారు. ‘అవినీతిని సంపూర్ణంగా ద్వేషిస్తే తప్ప ఇలాంటి ధోరణి మారదు. అవినీతిని, అవినీతిపరులను సమాజమంతా అసహ్యించుకోవాలి’ అని పిలుపునిచ్చారు.

‘గత ఎనిమిదేళ్లలో రూ.2 లక్షల కోట్ల నల్ల ధనాన్ని వెలికితీసి ప్రత్యక్ష పథకాల ద్వారా నగదు రూపేణా బదిలీ చేసి దేశాభివృద్ధికి పెట్టుబడిగా పెట్టాం. బ్యాంకులను దోచి దేశం వీడి పారిపోయిన వారిని వెనక్కు రప్పించే పనిలో ఉన్నాం. వారి ఆస్తులను ఇప్పటికే జప్తు చేశాం. దేశాన్ని దోచుకున్న వాళ్లనుంచి అంతకంతా కక్కించి తీరతాం. అందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. వాళ్లెంత పెద్దవాళ్లయినా సరే, తప్పించుకోలేరు’’ అని హెచ్చరించారు.

‘దేశ నైపుణ్యానికి, సామర్థ్యానికి బంధుప్రీతి తీరని హాని చేస్తోంది. దేశ ఉజ్వల భవిత కోసం దీనికి అడ్డుకట్ట వేయాల్సిందే. దీన్ని నా ప్రజాస్వామిక, రాజ్యాంగపరమైన బాధ్యతగా కూడా భావిస్తా. రాజకీయాల్లో కూడా వారసత్వాలు దేశ సామర్థ్యాన్ని ఎంతగానో కుంగదీశాయి. వారసత్వ రాజకీయాలకు పాల్పడే వారికి కుటుంబ క్షేమమే పరమావధి. దేశ సంక్షేమం అసలే పట్టదు’’ అంటూ దుయ్యబట్టారు. రాజకీయాలను, వ్యవస్థలను పరిశుభ్రం చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలంతా తనతో చేతులు కలపాలన్నారు. 

అలసత్వం అసలే వద్దు 
స్వాతంత్య్రం సిద్ధించిన ఈ 75 ఏళ్లలో ఎంతో సాధించేశామన్న అలసత్వానికి అస్సలు తావీయొద్దని ప్రధాని అన్నారు. ‘‘మన వ్యక్తిగత కలలను, ఆకాంక్షలను, సామాజిక లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు వచ్చే పాతికేళ్ల కాలం సువర్ణావకాశం. స్వతంత్య్ర యోధుల కలలను సాకారం చేసేందుకు కంకణబద్ధులవుదాం. స్వాతంత్య్ర ఫలాలను, అధికార ప్రయోజనాలను చిట్టచివరి నిరుపేదకు కూడా సంపూర్ణంగా అందించాలన్న మహాత్ముని ఆకాంక్షను నెరవేర్చేందుకు నేను కట్టుబడ్డా’’ అని చెప్పారు.  

సమాఖ్య భావనకే పెద్దపీట 
బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలను బలహీన పరుస్తోందన్న విమర్శలను మోదీ తిప్పికొట్టారు. ‘‘కేంద్ర రాష్ట్రాలు కలసికట్టుగా పని చేయాలనే సహకారాత్మక సమాఖ్య భావనను, ‘టీమిండియా’ స్ఫూర్తిని నేను సంపూర్ణంగా నమ్ముతానన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో గుజరాత్‌ సీఎంగా దాన్ని ఆచరణలో చూపించా’’నని చెప్పారు. దేశాన్ని కలసికట్టుగా అభివృద్ధి చేద్దామని విపక్షాలకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో పోటీపడదామని సూచించారు.

త్వరలో 5జీ సేవలు 
ఇది టెక్నాలజీ దశాబ్ది. ఈ రంగంలో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ ప్రపంచ సారథిగా ఎదుగుతున్నాం. 5జీ మొబైల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఊరూరికీ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్, కామన్‌ సర్వీసెస్‌ సెంటర్లు అందనున్నాయి. కొత్త పారిశ్రామిక వృద్ధి విప్లవం మారుమూలల్లోంచే రానుంది. విద్య, వైద్య సేవల్లో డిజిటల్‌ మాధ్యమం విప్లవాత్మక మార్పులు తేనుంది. పరిశోధన, నవకల్పనలే అజెండాగా ‘జై అనుసంధాన్‌’కు సమయమిదే. ప్రపంచ డిజిటల్‌ పేమెంట్లలో 40 శాతం వాటా మనదే. యూపీఐల విస్తృతే అందుకు కారణం. మిషన్‌ హైడ్రోజన్, సౌర శక్తిని అందిపుచ్చుకోవడం తదితరాల ద్వారా ఇంధన రంగంలో స్వావలంబన సాధిద్దాం. క్రమశిక్షణ, జవాబుదారీతనమే విజయానికి మూలసూత్రాలు. సేంద్రియ సాగుకు జై కొడదాం. 

రక్షణరంగం సూపర్‌
మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత లక్ష్యాల సాధనకు రక్షణ బలగాలు ఎంతగానో పాటుపడుతున్నాయి. ఫలితంగా బ్రహ్మోస్‌ వంటి సూపర్‌సోనిక్‌ క్షిపణులను దేశీయంగా తయారు చేసి ఎగుమతి చేసే స్థాయికి చేరాం. ఇందుకు మన సైనికులకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఎలక్టాన్రిక్‌ వస్తువులు మొదలుకుని అత్యాధునిక క్షిపణుల దాకా తయారు చేసే హబ్‌గా భారత్‌ మారుతోంది. విదేశీ బొమ్మలొద్దని, దేశీయ ఆట బొమ్మలతోనే ఆడుకుంటామని తమ పిల్లలంటున్నారని ఎంతోమంది తల్లిదండ్రులు చెబుతుంటే విని పులకించిపోతున్నా. ఆ ఐదారేళ్ల చిన్నారులకు నా సెల్యూట్‌. ఆత్మనిర్భర్‌ భారత్‌ స్ఫూర్తికిది తిరుగులేని సంకేతం. 

మహిళలే వృద్ధికి మూలం 
ప్రజాస్వామ్యాలన్నింటికీ మాతృక మన దేశమే. భిన్నత్వంలో ఏకత్వమే మన మూల బలం. అంతటి కీలకమైన ఐక్యతను సాధించాలంటే లింగ సమానత్వం అత్యంత కీలకం. మహిళలను అవమానించే ధోరణి మనలో అప్పుడప్పుడూ తొంగి చూస్తుండటం దురదృష్టకరం. ఈ జాఢ్యాన్ని మనలోంచి పూర్తిగా పారదోలుతామంటూ ప్రతినబూనుదాం. మాటల్లో గానీ, చేతల్లో గానీ మహిళల ఔన్నత్యాన్ని కించపరచొద్దు. కొడుకును, కూతురినీ సమానంగా చూడటం ద్వారా ఇందుకు ఇంట్లోనే పునాది పడాలి. ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం. స్త్రీలను గౌరవించడం మన దేశ వృద్ధికి ముఖ్యమైన మూల స్తంభమని గుర్తుంచుకోవాలి. 

మెరిసిన ఎర్రకోట 
పంద్రాగస్టు వేడుకల సందర్భంగా మువ్వన్నెల అలంకరణలతో ఎర్రకోట మెరిసిపోయింది. స్వాతంత్య్ర పోరాటంలోని కీలక ఘట్టాలకు సంబంధించిన చిత్రాలు కోట గోడలపై కనువిందు చేశాయి. కోట ప్రాంగణం, పరిసరాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

చదవండి: సంక్షేమ తెలంగాణం.. ఎన్నో పథకాల్లో దేశానికే ఆదర్శం 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top