ఢిల్లీ: ఏపీ-2024 ఎన్నికల్లో అర్థరాత్రి పోలింగ్ పెరగడంపై ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ మరోసారి అనుమానం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఏపీలో 3,500 పోలింగ్ బూత్‌ల్లో తెల్లవారుజామున రెండు గంటల వరకూ ఓటింగ్ జరగడంలో మతలబు ఏంటి? అనే సందేహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని కాన్సిట్యూషన్ క్లబ్‌లో ‘ఎన్నికల సమగత్రకు సవాళ్లు’ అనే అంశంపై భారత్ జోడో అభియాన్ సదస్సు నిర్వహించారు పరకాల ప్రభాకర్. ఈ మేరకు ఏపీ ఎన్నికల్లో అర్థరాత్రి పోలింగ్ పెరగడంపై ఆధారాలతో పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
‘ఏపీ-2024 ఎన్నికల్లో తెల్లవారుజామున 2 గంటల వరకు ఓటింగ్ జరగడంలో మతలబు ఏంటి?, 3,500 పోలింగ్ బూత్‌లలో తెల్లవారుజాము రెండు గంటల వరకూ ఓటింగ్ జరగడం వెనుక అనుమానాలున్నాయి. రాత్రి గం. 11. 45ని నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకూ ప్రతి నిమిషానికి ముగ్గురు ఓటు వేయడం ఎలా సాధ్యం. ఇది ఎన్నికల సమగ్రత ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల ప్రక్రియ అనేక అనుమానాలకు తావిస్తోంది’ అని తన ప్రజెంటేషన్‌లో పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు.


