ప్రతి ముగ్గురిలో ఒకరికి నకిలీల బెడద | One in three people are at risk of counterfeiting | Sakshi
Sakshi News home page

ప్రతి ముగ్గురిలో ఒకరికి నకిలీల బెడద

Mar 19 2026 2:27 AM | Updated on Mar 19 2026 2:27 AM

One in three people are at risk of counterfeiting

పాతుకుపోతున్న కౌంటర్‌ఫీట్‌ ఉత్పత్తులు 

సగానికిపైగా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌లో లభ్యం 

అత్యధికంగా రెడీమేడ్స్‌లో నకిలీ ప్రొడక్ట్స్‌

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌: కాదేదీ నకిలీకి అనర్హం అన్నట్టుగా.. ఔషధాలు, ఎల్రక్టానిక్స్, రెడీమేడ్స్, ఎఫ్‌ఎంసీజీ.. ఇలా దాదాపు అన్ని విభాగాల్లోనూ నకిలీ వస్తువుల తాకిడి భారతీయ వినియోగదారుల మార్కెట్లను ముంచెత్తుతోంది. పది మంది పట్టణ వినియోగదారుల్లో తొమ్మిది మంది తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా నకిలీ ఉత్పత్తిని కొనుగోలు చేశారంటే మన రిటైల్‌ వ్యవస్థలో ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తోంది. 

లాభాపేక్షలేని అథెంటికేషన్‌ సొల్యూషన్‌ ప్రొవైడర్స్‌ అసోసియేషన్‌ (ఏఎస్‌పీఏ), రేటింగ్స్‌ ఏజెన్సీ క్రిసిల్‌ సంయుక్తంగా విడుదల చేసిన స్టేట్‌ ఆఫ్‌ కౌంటర్‌ఫీటింగ్‌ ఇన్‌ ఇండియా 2025 నివేదిక ప్రకారం.. ఏడాది కాలంలో సుమారు 35% మంది పట్టణ వినియోగదారులు నకిలీ ఉత్పత్తుల బారిన పడ్డారు. ఫార్మాస్యూటికల్స్, ఎఫ్‌ఎంసీజీ, ఆటోమొబైల్‌ విడిభాగాలు, దుస్తులు, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్, వ్యవసాయ ఉత్పత్తుల వంటి విభాగాల్లో నకిలీ వస్తువుల ప్రభావం పెరుగుతోంది. 

ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మదాబాద్, జైపూర్, ఇండోర్‌లలో చేసిన సర్వే ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. ఏడాది కాలంలో నకిలీ వస్తువుల బెడద పెరిగిందని 74% మంది నమ్ముతున్నారు. మూడింట రెండొంతుల మంది తాము నకిలీ ఉత్పత్తులను గుర్తించగలమని విశ్వాసంగా ఉన్నప్పటికీ.. మరిన్ని అవగాహన కార్యక్రమాలు అవసరమని 93% మంది భావిస్తున్నారు. 

సింహభాగం ఆన్‌లైన్‌లో.. 
గత 12 నెలల్లో తాము నకిలీ దుస్తులను చూశామని లేదా కొనుగోలు చేశామని దాదాపు మూడింట ఒక వంతు మంది వినియోగదారులు తెలిపారు. నకిలీ ఫ్యాషన్‌ ఉత్పత్తుల విక్రయాలు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌ మార్కెట్లలోనూ దర్శనమిస్తున్నాయి. రోజువారీ వినియోగ వస్తువులపైనా వాటి ప్రభావం పెరుగుతోంది. ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలు, వ్యక్తిగత సంరక్షణ వస్తువులు, గృహ వినియోగ వస్తువుల వంటి ఎఫ్‌ఎంసీజీ విభాగాల్లో కౌంటర్‌ఫీట్స్‌ వెల్లువెత్తుతున్నాయి. ఔషధాల నకిలీలు ప్రజారోగ్యానికి పెద్ద సవాల్‌గా మారుతున్నాయి. 

కౌంటర్‌ఫీట్‌ ఆటోమోటివ్‌ విడిభాగాలు వాహనాల పనితీరును, విశ్వసనీయతను దెబ్బతీయడమే కాకుండా భద్రత పరంగా తీవ్ర ఆందోళనలను కలిగిస్తున్నాయి. గృహోపకరణాలు, ఎల్రక్టానిక్స్‌తో కూడిన కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ విభాగంలో కూడా నకిలీల బెడద పెరుగుతోంది. నకిలీ వ్యవసాయ ముడిసరుకులు పంట దిగుబడి, రైతుల ఆదాయం, ఆహార భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయి. అయితే కౌంటర్‌ఫీట్‌ వస్తువుల కొనుగోళ్లలో సగానికి పైగా ఆన్‌లైన్‌ చానళ్ల ద్వారానే జరుగుతున్నాయి.  

ఆరోగ్యం, క్షేమానికి ముప్పు.. 
నకిలీల బెడద దాదాపు ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ఒక అంతర్జాతీయ సమస్య. నకిలీ వస్తువులు వినియోగదారుల ఆరోగ్యం, క్షేమానికి ముప్పు కలిగించడమే కాకుండా మార్కెట్‌ పోటీని దెబ్బతీస్తాయి. అసలైన తయారీదారులకు నష్టం కలిగిస్తాయి. ప్రభుత్వాలకు పన్ను ఆదాయం రాకుండా చేస్తాయి. భారత్‌లో మూడేళ్లలో నకిలీ ఘటనలు పెరిగాయి. నకిలీ వస్తువులను తయారు చేసేవారు సాంకేతికంగా మరింత బలపడ్డారు. 

ఈ–కామర్స్‌ వృద్ధి, మార్కెట్ల ప్రపంచీకరణ వల్ల నకిలీలపై పోరాటం మరింత సవాలుగా మారిందని నివేదిక వెల్లడించింది. నకిలీ వస్తువుల నిరోధానికి, అక్రమ ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా దేశంలో అథెంటికేషన్‌ (ధ్రువీకరణ) వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంగా ఏఎస్‌పీఏ 1998 నుంచి పనిచేస్తోంది. 

వివిధ రంగాల్లో నకిలీల ప్రభావం.. 
» దుస్తులు: 31% 
»  వ్యవసాయ ఉత్పత్తులు: 30% 
»  మందులు: 28% 
» ఎఫ్‌ఎంసీజీ: 27% 
» వాహన విడిభాగాలు: 22% 
» ఎల్రక్టానిక్స్‌: 18% 

కొనుగోలు మార్గాలు.. 
» ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌: 53%  
» స్థానిక దుకాణాలు: వ్యవసాయ ఉత్పత్తులు 75%, మందులలో 63% వాటా 
» సోషల్‌ మీడియా: దుస్తుల విభాగంలో 46%, ఎలక్ట్రానిక్స్‌లో 35% వాటా 

వినియోగదారుల వైఖరి.. 
» ధర వ్యత్యాసం: కౌంటర్‌ఫీట్‌ గూడ్స్‌ అసలైన వాటికంటే 22% చౌకగా ఉంటాయని అంచనా 
» అదనపు చెల్లింపు: అసలైన వస్తువుల కోసం సగటున 9% అదనంగా చెల్లించడానికి కస్టమర్లు సిద్ధం 
»  ఫిర్యాదు చేసే ధోరణి: నకిలీ వస్తువులపై ఫిర్యాదు చేసేందుకు 50% మంది రెడీ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement