ఇక ఊరుకోరు.. రూ.కోటి జరిమానా | New Law on Air Pollution in Delhi NCR Says 5 Years in Prison 1 Crore Fine | Sakshi
Sakshi News home page

ఢిల్లీ కాలుష్య నియంత్రణకు కమిషన్‌ ఏర్పాటు

Oct 29 2020 3:33 PM | Updated on Oct 29 2020 3:35 PM

New Law on Air Pollution in Delhi NCR Says 5 Years in Prison 1 Crore Fine - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం పతాక స్థాయికి చేరుకుంది. రానున్నది శీతకాలం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్రం.. ఢిల్లీ నేషనల్‌ క్యాపిటల్‌‌ రీజియన్‌(ఎన్‌సీఆర్‌) వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక కమిషన్‌ని ఏర్పాటు చేస్తూ కొత్త ఆర్డినెన్స్‌ని తీసుకువచ్చింది. కమిషన్‌ ఫర్‌ ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ ఫర్‌ ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పేరిట దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇక ఈ నూతన నిబంధనల ప్రకారం కాలుష్య కారకులకు ఐదేళ్ల జైలు శిక్ష, కోటి రూపాయల జరిమానా విధించనున్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించే వారితో పాటు పర్యావరణ కాలుష్యానికి పాల్పడేవారిపై కేసు నమోదు చేసే అధికారం కమిషన్‌కి ఉంది. అంతేకాక హరియాణా, పంజాబ్‌, రాజస్తాన్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలను కూడా ఈ కమిషన్‌ పరిధిలోకి చేర్చుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: రాష్ట్రపతి భవన్‌ వద్ద తొమ్మిదేళ్ల బాలిక నిరసన)

18 మంది సభ్యులు.. మూడేళ్ల పదవి కాలం
18 మంది సభ్యులతో ఏర్పడనున్న ఈ కమిషన్‌కి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి లేక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి పూర్తికాలం చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇక 18 మంది సభ్యుల్లో పది మంది అధికారులు, బ్యూరోక్రాట్‌లు ఉండగా, మరికొందరు నిపుణులు, కార్యకర్తలు ఉండనున్నారు. వీరిని పర్యావరణ మంత్రి నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీతో పాటు మరో ముగ్గురు మంత్రులు, క్యాబినేట్‌ కార్యదర్శి మూడేళ్ల పదవీ కాలానికి నియమిస్తారు. ఈ కమిషన్‌ వాయు నాణ్యతను పర్యవేక్షించడంతో పాటు దానికి సంబంధించిన చట్టాలను అమలు చేస్తుంది. అలానే కాలుష్య స్థాయిలను నియంత్రించడానికి పరిశోధన, ఆవిష్కరణల కోసం ఉప సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చంటూ కేంద్రం ఆర్డినెన్స్‌లో పేర్నొన్నది. పంట వ్యర్థాల దహనం, కాలుష్యానికి సంబసంధించిన అన్ని ఇతర అంశాలను కమిషన్‌ పరిశీలిస్తుంది. ఇక తన వార్షిక నివేదికలను కమిషన్‌ పార్లమెంటుకు సమర్పించనుంది. (చదవండి: ఎట్టకేలకు కాలుష్యంపై చట్టం)

కమిషన్‌కు విస్తృత అధికారాలు..
అలాగే, రాష్ట్ర ప్రభుత్వాలు, దాని ఏజెన్సీలు, కమిషన్ ఆదేశాల మధ్య సంఘర్షణ విషయాలలో దీనికే ఎక్కువ అధికారాలుండటం విశేషం. ఈ కమిషన్‌కు విస్తృత అధికారాలు ఇవ్వబడ్డాయి. ఏదైనా ప్రాంగణాన్ని పరిశీలించడానికి, కాలుష్య యూనిట్లను మూసివేయడానికి.. విద్యుత్తు, నీటి సరఫరాను డిస్‌కనెక్ట్ చేయడానికి ఆర్డర్లు జారీ చేసే అధికారం కమిషన్‌కు ఉంటుంది. కమిషన్ ఏదైనా ఉత్తర్వు, ఆదేశాన్ని ఉల్లంఘిస్తే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 1 కోట్ల రూపాయల జరిమానా విధించవచ్చు. కమిషన్ ఆదేశాలకు వ్యతిరేకంగా వచ్చే అన్ని విజ్ఞప్తులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు మాత్రమే ఉంటాయి. సంబంధిత ఆదేశాలపై ఎటువంటి ఆదేశాలు జారీ చేయడానికి లేదా ఫిర్యాదు చేయడానికి ఇతర సంస్థలకు అధికారం ఉండదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement