కోవిడ్‌ టీకా ఇలా..!

NEGVAC working on management of COVID-19 vaccine roll-out - Sakshi

భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో టీకా పంపిణీ ఎలా జరుగుతుందోనన్న ఆసక్తితో అందరూ చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు టీకా డ్రైరన్‌ నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌కి పూర్తి సన్నద్ధంగా ఉంది.  
 – న్యూఢిల్లీ

వ్యాక్సిన్‌ తొలుత ఎవరికి ?
► కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌పై ఏర్పాటైన జాతీయ నిపుణుల కమిటీ (ఎన్‌ఈజీవీఏసీ) సిఫారసులకనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేసే వైద్య సిబ్బంది కోటి మందికి తొలుత టీకా ఇస్తారు. ఈ ఆరోగ్య సిబ్బందిని మళ్లీ సబ్‌ కేటగిరీలుగా విభజించారు. ఫ్రంట్‌లైన్‌ హెల్త్‌ అండ్‌ ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీస్‌ (ఐసీడీఎస్‌) వర్కర్లు, నర్సులు, సూపర్‌వైజర్లు, మెడికల్‌ ఆఫీసర్లు, పారామెడికల్‌ స్టాఫ్, సహాయక సిబ్బంది, వైద్య విద్యార్థులకి తొలి ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పటికే వీరికి సంబంధించిన డేటాను సేకరించి కరోనా వ్యాక్సినేషన్‌ కోసం రూపొందించిన డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ కోవిన్‌ (ఇౌగిఐN)లో ఇప్పటికే పొందుపరిచారు.

► కరోనా మహమ్మారిపై పోరాటం సాగిస్తున్న కేంద్ర, రాష్ట్రాలకు చెందిన సాయుధ బలగాలు, హోమ్‌ గార్డులు, విపత్తు నిర్వహణ, సివిల్‌ డిఫెన్స్‌ సంస్థలు, జైళ్లలో పని చేసే సిబ్బంది, మున్సిపల్, రెవెన్యూ అధికారులు 2 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇస్తారు. ఈ జాబితాలో రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన హోం, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖల్లో పనిచేసేవారు కూడా ఉన్నారు.
 

► 50 ఏళ్ల కంటే ఎక్కువ వయసు కలిగిన వారికి తొలి దశలో వ్యాక్సిన్‌ లభిస్తుంది. వీరిని రెండు కేటగిరీలుగా విభజించారు. 60 ఏళ్ల వయసుపైబడిన వారు, 50–60 మధ్య వయసు ఉన్నవారు. ముందు 60 ఏళ్ల పైబడిన వారికి ఇస్తారు. తాజాగా జరిగిన లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తారు

► కోవిడ్‌–19 కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా తొలి విడతలోనే వ్యాక్సిన్‌ ఇస్తారు.

► ఈ ఏడాది ఆగస్టు కల్లా తొలి విడత పంపిణీ పూర్తయితే, ఆ తర్వాత మిగిలిన జనాభాకి వారికి ఉన్న అవసరాలు, టీకా లభ్యత అనుగుణంగా  క్రమక్రమంగా ఇస్తూ వస్తారు.

వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ ఎలా?

► సాధారణ ప్రజలు వ్యాక్సిన్‌ పొందాలంటే ఆన్‌లైన్‌లో ముందస్తుగా రిజిస్ట్రేషన్‌ చేసు కోవాలి. అప్పటికప్పుడు టీకా కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకోవడం కుదరదు.

► కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కోవిన్‌ వెబ్‌సైట్‌ లేదంటే యాప్‌ల ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. కోవిన్‌ వెబ్‌సైట్‌లోకి ప్రభుత్వ ఫొటో గుర్తింపు కార్డు లేదంటే ఆధార్‌ని అప్‌లోడ్‌ చేసి పేరు, చిరునామా వంటి వివరాలు ఇవ్వాలి. అప్పుడు రిజిస్టర్‌ చేసిన మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్‌ చెయ్యగానే టీకా కోసం ఏ తేదీన, ఎన్ని గంటలకి, ఎక్కడికి రావాలి అన్న వివరాలు అందిస్తారు.

► కోవిన్‌ డిజిటల్‌ వ్యవస్థని జిల్లా స్థాయిలో అధికారులు పర్యవేక్షిస్తారు. కోవిన్‌ యాప్‌ ఆండ్రాయిడ్, యాపిల్‌ ఫోన్లలో ఇప్పటికే అందుబాటులో ఉంది.

వ్యాక్సిన్‌ ప్రక్రియ ఎలా ?
వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మూడు గదులున్న కేంద్రం ఉండాలి. ఒక గది వెయిటింగ్‌ రూమ్‌ కాగా రెండో గది డాక్టర్‌ టీకా ఇవ్వడానికి వినియోగిస్తారు. ఇంక మూడో గదిలో టీకా తీసుకున్న వ్యక్తిని అరగంట సేపు వైద్యుల పరిశీలనలో ఉంచుతారు. అయిదుగురు ఆరోగ్య సిబ్బంది ఇందులో పనిచేస్తారు. ఒక అధికారి లబ్ధిదారుడి వివరాలన్నీ తనిఖీ చేస్తారు. రెండో అధికారి ఆ వ్యక్తికి వ్యాక్సిన్‌ ఇవ్వడానికి అనుమతినిస్తారు. మూడో అధికారి టీకా డోసు ఇస్తారు. మరో ఇద్దరు అధికారులు టీకా ఇచ్చిన వ్యక్తి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తారు. ఇప్పటికే 96 వేల మంది వ్యాక్సినేటర్లకి శిక్షణ ఇచ్చారు. వీరిలో 2,360 మందికి జాతీయ స్థాయిలో శిక్షణ ఇస్తే 715 జిల్లాల్లో మరో 57 వేల మందికి శిక్షణ ఇచ్చారు. కోవిన్‌ యాప్‌ ద్వారా వ్యాక్సిన్‌ కోసం ఇప్పటికే 75 లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.

వ్యాక్సిన్‌ ఎక్కడ వేస్తారు ?
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులతో పాటు వైద్య అధికారి లేదంటే డాక్టర్‌ అందుబాటులో ఉన్న ఎంపిక చేసిన నిర్ణీత ప్రాంతాల్లో టీకా కార్యక్రమం నిర్వహిస్తారు. పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్‌లో కూడా వ్యాక్సిన్‌ కేంద్రాలుగా మారుస్తారు. ఇక మారుమూల గ్రామాల్లో ప్రజలకి టీకా ఇవ్వడానికి ప్రత్యేకంగా మొబైల్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కొండలు, అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి ఆరోగ్య సిబ్బందే స్వయంగా వెళ్లి టీకాలు వేస్తారు. (చదవండి: కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి గ్రీన్‌సిగ్నల్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top