
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సెప్టెంబరు ఆరున భారీ ఎత్తున వినాయక నిమజ్జనాలున్న తరుణంలో ముంబై పోలీసులు పలు నిషేధ ఉత్తర్వులు జారీ చేశారు. నిమజ్జనం తర్వాత పాక్షికంగా కరిగిన గణపతి విగ్రహాలకు ఫోటోలు తీయడం, ప్రచురించడం, ప్రసారం చేయడాన్ని నిషేధించారు. ఈ ఉత్తర్వు సెప్టెంబర్ ఏడు వరకు గ్రేటర్ ముంబై అంతటా అమలులో ఉంటుందని తెలిపారు.
గణపతి నిమజ్జనం అనంతరం నీటి అలలకు సగం కరిగిన విగ్రహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఇవి పలువురి మనోభావాలను దెబ్బతీస్తాయన్నారు. గతంలో ఇటువంటి విగ్రహాలను బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కార్మికులు తిరిగి నిమజ్జనం చేస్తున్నప్పుడు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రసారం అయ్యాయని పోలీసులు తెలిపారు. ఇటువంటి ఫొటోలు, వీడియోలు మతపరమైన భావాలను దెబ్బతీస్తాయని, ప్రజా శాంతికి భంగం కలిగించే ప్రమాదం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్) అక్బర్ పఠాన్ మాట్లాడుతూ నిమజ్జనం తర్వాత తేలియాడే లేదా సగం మునిగిపోయిన విగ్రహాల ఫోటోలు తీయడం, వాటిని ఏ రూపంలోనైనా ప్రచురించడం లేదా ప్రసారం చేయడాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరం అంతటా దీని గురించి ప్రచారం చేయాలని అధికారులను ఆయన కోరారు.