SC fines Mumbai Metro for felling of trees in Aarey forest - Sakshi
Sakshi News home page

అనుమతులకు మించి చెట్ల నరికివేత.. ముంబై మెట్రోకు సుప్రీంకోర్టు షాక్‌!

Published Mon, Apr 17 2023 2:47 PM

Mumbai Metro Fined For Felling Of Trees Beyond Permission In Aarey Forest - Sakshi

ముంబై: కోర్టు ఆదేశాలను అతిక్రమించే ప్రయత్నించినందుకు ముంబై మెట్రో రైల్‌ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. ఆరే అడవిలో అనుమతులకు మించి చెట్లను నరికినందుకు రూ.10 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని రెండు వారాల్లోగా చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌కు అందజేయాలని ముంబై మెట్రో రైల్‌ లిమిటెడ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. 

మెట్రో కార్‌ షెడ్‌ ప్రాజెక్టు కోసం ఆరే కాలనీలో చెట్ల నరికివేతపై స్టే ఇవ్వాలని కోరుతూ 2019లో న్యాయ విద్యార్థి రిషవ్‌ రంజన్‌ సీజేఐకు రాసిన లెటర్‌ పిటిషన్‌ను సుప్రీకోర్టు సుమోటోగా స్వీకరించారు. దీనిపై సీజేఐ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జేబీ పర్ధివాలాతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా కోర్టు ఆదేశాల​కు మించి ఎక్కువ చెట్లను నరికేసేందుకు అనుమతి కోరడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను అతిక్రమించడమే కాకుండా కోర్టు ధిక్కారానికి సమానమని వ్యాఖ్యానించింది. తమ ఆదేశాలను ధిక్కరించినందుకు ముంబై మెట్రో అధికారులను అత్యున్నత న్యాయస్థానం  హెచ్చరించింది.

మరోవైపు ఆరే అడవుల్లోని 177 చెట్లను తొలగించేందుకు ముంబై మెట్రోకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. చెట్ల నరికివేతపై స్టే విధించడం వల్ల ప్రాజెక్టు పనులు ఆగిపోతాయని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. కాగా గోరేగావ్ సబర్బన్‌లోని అటవీ ప్రాంతం ఆరే కాలనీ వద్ద మెట్రో కార్ షెడ్ ప్రాజెక్ట్ కోసం చెట్లను విచక్షణారహితంగా నరికివేయడాన్ని వ్యతిరేకిస్తూ పర్యావరణవేత్తలు నిరసనలు వ్యక్తం చేయడంతో ఈ వివాదం నెలకొంది.
చదవండి: నలుగురు సైనికులను కాల్చి చంపింది మన జవానే.. ఉగ్ర కోణం లేదు..

Advertisement
Advertisement