breaking news
Mumbai Metro Rail Corporation
-
అనుమతులకు మించి చెట్ల నరికివేత.. ముంబై మెట్రోకు సుప్రీంకోర్టు షాక్!
ముంబై: కోర్టు ఆదేశాలను అతిక్రమించే ప్రయత్నించినందుకు ముంబై మెట్రో రైల్ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆరే అడవిలో అనుమతులకు మించి చెట్లను నరికినందుకు రూ.10 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని రెండు వారాల్లోగా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌కు అందజేయాలని ముంబై మెట్రో రైల్ లిమిటెడ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టు కోసం ఆరే కాలనీలో చెట్ల నరికివేతపై స్టే ఇవ్వాలని కోరుతూ 2019లో న్యాయ విద్యార్థి రిషవ్ రంజన్ సీజేఐకు రాసిన లెటర్ పిటిషన్‌ను సుప్రీకోర్టు సుమోటోగా స్వీకరించారు. దీనిపై సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జేబీ పర్ధివాలాతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు ఆదేశాలకు మించి ఎక్కువ చెట్లను నరికేసేందుకు అనుమతి కోరడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను అతిక్రమించడమే కాకుండా కోర్టు ధిక్కారానికి సమానమని వ్యాఖ్యానించింది. తమ ఆదేశాలను ధిక్కరించినందుకు ముంబై మెట్రో అధికారులను అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. Supreme Court slams Mumbai Metro Rail Corporation Ltd (MMRCL) for attempting to "overreach" the SC order in Aarey forest tree case and imposes Rs 10 lakhs fine on Mumbai Metro for seeking to fell more trees in violation of court’s order. pic.twitter.com/DCR88SdFHV — ANI (@ANI) April 17, 2023 మరోవైపు ఆరే అడవుల్లోని 177 చెట్లను తొలగించేందుకు ముంబై మెట్రోకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. చెట్ల నరికివేతపై స్టే విధించడం వల్ల ప్రాజెక్టు పనులు ఆగిపోతాయని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. కాగా గోరేగావ్ సబర్బన్‌లోని అటవీ ప్రాంతం ఆరే కాలనీ వద్ద మెట్రో కార్ షెడ్ ప్రాజెక్ట్ కోసం చెట్లను విచక్షణారహితంగా నరికివేయడాన్ని వ్యతిరేకిస్తూ పర్యావరణవేత్తలు నిరసనలు వ్యక్తం చేయడంతో ఈ వివాదం నెలకొంది. చదవండి: నలుగురు సైనికులను కాల్చి చంపింది మన జవానే.. ఉగ్ర కోణం లేదు.. -
ఎన్నాళ్లీ ‘వృక్షసంహారం’?
మానవాళికి చెట్లు చేసే మేలేమిటో తెలుసుకోవడానికి ఎవరూ గూగుల్‌ను ఆశ్రయించనవసరం లేదు. పర్యావరణవేత్తలు చెబితే తప్ప తెలియని వారెవరూ లేరు. చెట్ల ఉపయోగాల గురించి బడి చదువుల దగ్గరనుంచి గురువులు నూరిపోయడమే ఇందుకు కారణం. దురదృష్టమేమంటే అధికార పీఠాలపై ఉన్న నేతలు, ఉన్నతాధికార వర్గంలో పనిచేస్తున్నవారు ఏ బళ్లో చదువుకుని ఆ స్థాయికి ఎదిగారోగానీ... దేశంలో ‘అభివృద్ధి’ పేరు చెప్పి వృక్ష సంహారం జరగని రోజంటూ దేశంలో ఉండటం లేదు. ఇప్పుడు ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్(ఎంఎంఆర్‌సీ) వంతు వచ్చింది. పర్యవ సానంగా ఆ మహానగరం శివార్లలోని ఆరే కాలనీకి మూడింది. అందులోని వేల చెట్లు నేలకొరి గాయి. ఈ చెట్లను కాపాడటానికి గత నాలుగేళ్లుగా ఆ కాలనీ వాసులు, పర్యావరణ ఉద్యమకారులు చేయని పోరాటమంటూ లేదు. 2015లో వారి ఒత్తిడికి తలొగ్గి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీకి అనేక ప్రత్యామ్నాయ ప్రతిపాదనలొచ్చాయి. వాటిల్లో ఏ ఒక్కటీ తమకు ఉపయోగపడదంటూ మెట్రో రైల్ కార్పొరేషన్ తిరస్కరించింది. చివరకు ఆరే కాలనీలో ఓ చీకటి రాత్రి చెట్లు కూల్చే పని ప్రారంభం కాగానే జనం అడ్డుకున్నారు. హైకోర్టును ఆశ్రయించారు. కానీ స్టే ఇవ్వడానికి శనివారం న్యాయస్థానం నిరాకరించడంతో సోమవారం వారు సుప్రీంకోర్టు తలుపుతట్టారు. ఈనెల 21 వరకూ యధాతథ స్థితిని కొనసాగించమని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. చిత్రమేమంటే ఈలోగానే... అంటే రెండురోజుల్లోనే 2,141 చెట్లు నేలకూలాయి. ముంబై మహా నగర జనాభా దాదాపు రెండు కోట్లు. అక్కడ రోజూ 80 లక్షలమంది ప్రయా ణీకులు(దాదాపు ఇజ్రాయెల్ జనాభా పరిమాణం) ఇప్పుడున్న సిటీ రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తారు. ప్రస్తుతం ఉన్న రెండు మెట్రో లైన్లకు తోడు మరో లైన్ నిర్మిస్తే అంధేరీ ఈస్ట్‌లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయానికి, శాంతాక్రజ్‌లోని దేశీయ విమానాశ్రయానికి, నగర పరిసరాల్లోని ప్రధాన ప్రాంతాలకూ కూడా రవాణా సౌకర్యం విస్తరిస్తుందని, రోజూ 17 లక్షలమందికి ఉపయో గపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. దాన్నెవరూ కొట్టిపారేయడం లేదు. కానీ అందుకు నగరా నికి ప్రాణవాయువును అందిస్తున్న ఆరే ప్రాంత వృక్షజాలాన్ని ధ్వంసం చేయాలా అని ప్రశ్నిస్తు న్నారు. ఈ కాలనీకి చేర్చి ఉన్న సంజయ్ గాంధీ జాతీయ పార్క్ వన్యమృగాలకూ, వందలాది రకాల పక్షులకూ నిలయం. ఈ పక్షుల్లో అనేకం ఆరే కాలనీ వాసుల్ని కూడా పలకరిస్తాయి. కను విందు చేస్తాయి. భిన్న జాతుల పక్షుల్ని వీక్షించడానికి, తమ కెమెరాల్లో బంధించడానికి విహంగ ప్రేమికులు నిత్యం ఇక్కడికొస్తారు. దీనికి ‘మినీ కశ్మీర్’గా పేరుంది. ఉరుకుల, పరుగుల జీవితాలకు కాస్తంత విరామం ఇచ్చి, ప్రశాంతంగా స్వచ్ఛమైన వాయువు పీల్చి పునీతులు కావడానికి నగర వాసుల్లో అత్యధికులు ఎన్నుకునే చోటిది. ఇక్కడున్న లక్షలాది వృక్షాల్లో అనేకం 110 ఏళ్లపైబడినవి. దాదాపు 3,180 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆ చెట్లనుంచి వీచే గాలిని ఆస్వాదిస్తూ వందలమంది ఇక్కడ సైక్లింగ్, జాగింగ్ చేస్తుంటారు. మెట్రో రైలు అయినా, మరొకటైనా నగర ప్రజలకు ఉపయో గపడేదే కావొచ్చు. కానీ అందుకోసం ఇంత ప్రాణప్రదమైన ప్రాంతాన్ని పాక్షికంగానైనా నాశనం చేయవచ్చా? మెట్రో రైలు బోగీలను పరిశుభ్రం చేయడం, వాటికి అవసరమైన మరమ్మత్తులు చేయడం వంటి అవసరాలకు షెడ్లు నిర్మించడం కోసం ఈ చెట్ల కూల్చివేత పర్వం మొదలైంది. ముంబైతో సహా మన మహానగరాలు వేల కోట్లు ఆర్జించే పెట్టే బంగారు గనులే కావొచ్చు. అక్కడ అనేకులకు ఉపాధి దొరుకుతుండవచ్చు. కానీ వాటికి కావలసినంత అపకీర్తి కూడా ఉంది. అందులో అనేకం కాలుష్యకారకాలు. ప్రపంచంలో అత్యంత కాలుష్యభరిత నగరాలు 20 ఉంటే అందులో 15 మన నగరాలే! తీవ్ర ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రపంచంలోని 15 నగరాల్లో మన వాటా 11! ఈ నగరాల వాతావరణంలో, ఇక్కడి తాగునీటిలో మృత్యువు దాగుందని నిపుణులు చాన్నాళ్లుగా చెబుతున్నారు. నగర పౌరుల ఊపిరితిత్తుల్లోకి కొంచెం కొంచెంగా చొరబడుతున్న కాలుష్యం వారిని రోగగ్రస్తులుగా మారుస్తోంది. కేన్సర్, గుండె జబ్బులు వగైరాలకు కారణ మవుతోంది. అనేకుల్లో అకాల వృద్ధాప్యాన్ని కలిగిస్తోంది. వారిని పనిపాటలకు దూరం చేస్తోంది. ఇదంతా మన పాలకులకు ఆందోళన కలిగించాలి. దీన్ని సరిచేయడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించడానికి పురిగొల్పాలి. ఆరే కాలనీ తరహాలో చెట్లు పెంచాలి. తొలగించకతప్పదను కుంటే ఆ చెట్లను మరొకచోట పాతడానికి ప్రయత్నించవచ్చు. కానీ జరుగుతున్నదంతా అందుకు విరుద్ధం. ప్రపంచ అధ్యయన సంస్థలు చెబుతున్న వాస్తవాలేవీ వారిలో కదలిక తీసుకురావడం లేదు. ఇల్లు కట్టుకుందామనో, ఉన్న ఇంటిని విస్తరించుకుందామనో ఎవరైనా తమ ఆవరణలో చెట్లు కొట్టాలంటే అందుకు అనుమతులు తీసుకోవడం అవసరం. కానీ తమకు అలాంటి నిబంధనలు వర్తించవన్నట్టు అధికార యంత్రాంగాలు ప్రవర్తిస్తున్నాయి. ఆరే కాలనీ చెట్ల నరికివేత వ్యవహారం తీసుకుంటే చట్ట ప్రకారం పాటించాల్సిన నిబంధనలన్నిటినీ తుంగలో తొక్కారు. 1975నాటి చట్టం ప్రకారం ఏ చెట్టు తొలగించాలన్నా అందుకు అనుమతి ఉండాలి. అలా తొలగించడానికి పక్షం రోజులముందు ప్రజలందరికీ తెలిసేలా ఆ అనుమతిని పత్రికల్లో ప్రచురించాలి. ఆరేళ్లక్రితం బొంబాయి హైకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం సంబంధిత సంస్థలు తమ తమ వెబ్సైట్లలో అనుమతి కాపీలను అప్లోడ్ చేయాలి. కానీ ఆరే కాలనీ చెట్ల కూల్చివేతలో ఈ నిబంధనలేవీ పాటించలేదు. చెట్లు కూల్చడం మొదలుపెట్టిన శుక్రవారం రాత్రే అనుమతి కాపీని కూడా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెబ్సైట్లో ఆదరా బాదరాగా అందుబాటులోకి తెచ్చారు. పాలనా సంస్థలే ఇలా చట్టాల్ని ధిక్కరించే స్థితికి దిగజారడం, ప్రశ్నించినవారిని నిర్బంధించడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. -
బిగ్‌బీ ! ఈ విషయం మీకు తెలియదా ?
ముంబయి : ముంబయి మెట్రో రైలు ప్రాజెక్టుకు అనుకూలంగా బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. జల్సాలోని ఆయన ఇంటి ముందే పర్యావరణ ప్రేమికులు ' సేవ్ ఆరే - సేవ్ ఫారెస్ట్' ప్లకార్డులను పట్టుకొని నినాదాలు చేశారు. ‘నా స్నేహితుడు ఒకరు అత్యవసర వైద్య నిమిత్తం తన కారును వదిలి మెట్రోలో ప్రయాణించాడు. మెట్రో ద్వారానే తన పనిని తొందరగా ముగించుకొని మళ్లీ ఇంటికి చేరుకున్నాడు. అది చూసి నాకు ఆనందం కలిగింది. వీలైనన్ని వృక్షాలను పెంచడమే కాలుష్యానికి పరిష్కారం. నేను నా తోటలో వృక్షాలను పెంచుతున్నాను. మీరు కూడా ఈ పని చేయండి అంటూ’ అమితాబ్ ట్వీట్ చేశారు. అమితాబ్ చేసిన ట్వీట్ పై ముంబయి మెట్రో ప్రధాన అధికారి అశ్విని బిడే 'కృతజ్ఞతలు బచ్చన్ జీ' అంటూ అనుకూలంగా స్పందించారు. అయితే దీనిపై పర్యావరణ ప్రేమికులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘బిగ్ బీ ! తోటల నుంచి అడవులను తయారు చేయలేమన్న చిన్న విషయం మీకు తెలియదా అంటూ’ ఆందోళన నిర్వహించారు. ముంబయిలోని మెట్రోరైలు ప్రాజెక్టు కోసం ఆరే కాలనీలోని 27 వేల వృక్షాలను తొలగించాలని ముంబయి మెట్రో నిర్ణయించింది. ఇందుకు బృహత్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కూడా అనుమతి ఇవ్వడంతో అప్పటి నుంచి పర్యావరణ ప్రేమికుల నిరసనలు కొనసాగుతున్నాయి. T 3290 - Friend of mine had a medical emergency, decided to take METRO instead of his car .. came back very impressed .. said was faster, convenient and most efficient .. 👍 Solution for Pollution .. Grow more trees .. I did in my garden .. have you ❤️ — Amitabh Bachchan (@SrBachchan) September 17, 2019 -
చెట్లు నరకొద్దు...మెట్రో లైన్ మార్చండి
సాక్షి, ముంబై: ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎమ్మెమ్మార్సీ) తలపెట్టిన కొలాబా-బాంద్రా సీబ్జ్ మెట్రోలైన్-111 నిర్మాణంలో భాగంగా చర్చ్‌గేట్‌లోని చెట్ల నరికివేతను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. కొలాబా-బాంద్రా-సీబ్జ్ మెట్రోలైన్-111 కోసం చర్చ్‌గేట్‌లోని జే టాటా రోడ్ వద్ద 73 చెట్లను తొలగించనున్నట్లు అధికారులు తెలిపారు. తాము పుట్టినప్పటి నుంచి చెట్లను చూస్తున్నామని, మెట్రో నిర్మాణం కోసం చెట్లను నరికివేయకుండా గతేడాది డిసెంబర్ నుంచి ఎమ్మెమ్మార్సీకి లేఖలు రాస్తున్నామని స్థానికులు తెలిపారు. జేజే టాటా సర్కిల్ వద్ద భూగర్భ మార్గాలను నిర్మిస్తున్నారని, పనుల్లో భాగంగా అక్కడ నిర్వహించే డ్రిల్లింగ్కు పురాతన భవనాలు ఎలా తట్టుకోగలవని ప్రశ్నించారు. మెట్రో లైన్‌ను మరో చోటికి మార్చాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఎమ్మెమ్మార్డీఏ అధికారులు మాట్లాడుతూ.. కొలాబా-బాంద్రా సీప్జ్ మెట్రో మార్గంకు దాదాపు 589 చెట్ల అడ్డు వస్తున్నాయన్నారు. వీటిని నరికివేయడం ద్వారా 32,977 కి.లోల ఆక్సీజన్ తగ్గుతుందని, ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు దాదాపు 1,000 మొక్కలను నాటేందుకు నిర్ణయించామని ఎమ్మెమ్మార్డీ అధికారి వెల్లడించారు.