అనుమతి లేకుండానే విజయోత్సవాలు | Karnataka Blames RCB For Bengaluru Stampede And Mentions Kohli | Sakshi
Sakshi News home page

అనుమతి లేకుండానే విజయోత్సవాలు

Jul 17 2025 11:46 AM | Updated on Jul 18 2025 5:11 AM

Karnataka Blames RCB For Bengaluru Stampede And Mentions Kohli

అందుకే చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట

కేవలం సమాచారం ఇచ్చారు.. అనుమతి తీసుకోలేదు 

దుర్ఘటనకు ఆర్సీబీ యాజమాన్యం, డీఎన్‌ఏ సంస్థ, కేఎస్‌సీఏ బాధ్యత వహించాలి

హైకోర్టుకు నివేదిక సమర్పించిన కర్ణాటక ప్రభుత్వం

బెంగళూరు: ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) విజయం తర్వాత బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటకు ఆర్సీబీ యాజమాన్యం, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ డీఎన్‌ఏ నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌తోపాటు కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(కేఎస్‌సీఏ) కారణమని కర్ణాటక ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు ఒక నివేదికను హైకోర్టుకు సమర్పించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

 ముందస్తుగా అనుమతి తీసుకోకుండానే విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు కర్ణాటక సర్కార్‌ స్పష్టంచేసింది. ఈ ర్యాలీ నిర్వహించాలని ఆర్సీబీ యాజమాన్యం, డీఎన్‌ఏ సంస్థ, కేఎస్‌సీఏ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు తప్పు పట్టింది. పోలీసులకు ముందుగా సమా చారం ఇవ్వలేదని, చట్టప్రకారం తీసుకోవాల్సి అనుమతులేవీ తీసుకోలేదని వెల్లడించింది.

 జూన్‌ 4న జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, మరో 30 మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై ఆర్సీబీ గెలిస్తే బెంగళూరులో విజయో త్సవాలు నిర్వహిస్తామంటూ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు కేవలం సమాచారం మాత్రమే ఇచ్చారని, అధికారికంగా అనుమతి తీసుకోలేదని ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఆ సమాచారంలో పూర్తి వివరాలు లేకపోవడంతో విజయోత్సవాలకు పోలీసులు అంగీకరించలేదని తెలిపింది. కేవలం సమాచారం ఇవ్వడాన్ని అనుమతి కోసం చేసుకున్న దరఖాస్తుగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. 

అయినప్పటికీ జూన్‌ 4న ఆర్సీబీ టీమ్‌ యాజమన్యం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, విధాన సౌధ నుంచి చిన్న స్వామి స్టేడియం ద్వారా విక్టరీ పరేడ్‌ నిర్వహించబోతున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రకటనలు జారీ చేసిందని వెల్లడించింది. సోషల్‌ మీడియాలో మొదటి పోస్టు ఉదయం 7.01 గంటలకు, చివరి పోస్టు మధ్యాహ్నం 3.14 గంటలకు పెట్టినట్లు తెలిపింది. ఆన్‌లైన్‌లో ఉచిత పాసులు అందుబాటులో ఉన్నాయని యాజమాన్యం చెప్పగా, అప్పటికే జనం స్టేడియం వద్దకు చేరుకున్నారని వివ రించింది. మొత్తానికి ఆర్సీబీ యాజమాన్యం, డీఎన్‌ఏ నెట్‌వర్క్స్‌ లిమిటెడ్, కేఎస్‌సీఏ నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు ప్రభు త్వం స్పష్టంచేసింది. ఈ దుర్ఘటనకు వారే పూర్తి బాధ్యత వహించాలని పేర్కొంది.  

ఆర్సీబీ సేవకులుగా పోలీసులు 
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో ఐపీఎస్‌ అధికారి వికాస్‌ కుమార్‌తోపాటు మరికొందరు పోలీసులను సస్పెండ్‌ చేయడాన్ని కర్ణాటక ప్రభుత్వం సమర్థించుకుంది. పోలీసులు ఆర్సీబీ టీమ్‌కు సేవకులుగా వ్యవహరించారని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ఆక్షేపించింది. ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయకుండానే ఆర్సీబీ విజయోత్సవాల కోసం ఏర్పాటు చేశారని ఆరోపించింది. అనుమతి ఉందో లేదో కూడా తెలుసుకోకుండా ఆర్సీబీ సేవలో తరించారని విమర్శించింది.  
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement