రైల్వే స్టేషన్‌లో కిడ్నాపైన బాలుడు.. బీజేపీ కార్పొరేటర్‌ ఇంట్లో ప్రత్యక్షం!

Infant Stolen From UP Railway Station Found At BJP Leader Home - Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్‌లో నిద్రిస్తున్న తల్లి ఒడిలోనుంచి ఈనెల 23న 7 నెలల బాలుడిని ఎత్తుకెళ్లి సంఘటన ఇటీవల సంచలనంగా మారింది. కిడ్నాప్‌ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీని కనుగొన్నారు. మథురాకు 100 కిలోమీటర్ల దూరంలోని ఫిరోజాబాద్‌లో ఓ బీజేపీ కార్పొరేటర్‌ ఇంట్లో బాలుడిని గుర్తించారు. పిల్లలను ఎత్తుకెళ్లి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. 

కిడ్నాప్‌ గ్యాంగ్‌లో భాగమైన ఇద్దరు డాక్టర్ల నుంచి బాలుడిని రూ.1.8 లక్షలకు కొనుగోలు చేశారు బీజేపీ నేత వినిత అగర్వాల్‌, ఆమె భర్త. వారికి ఇదివరకే కూతురు ఉన్నప్పటికీ కొడుకు కావాలనే ఉద్దేశంతో కొనుగోలు చేశారు. ఈ కేసులో రైల్వే స్టేషన్‌లో పిల్లాడిని ఎత్తుకెళ్లిన వ్యక్తితో పాటు మొత్తం 8 మందిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు పోలీసులు. చిన్నారిని ఆమె తల్లికి అప్పగించారు. వైద్యులను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫికింగ్‌ గ్యాంగ్‌పై వివరాలు వెల్లడించారు సీనియర్‌ పోలీస్‌ అధికారి మహమ్మెద్‌ ముస్తాఖ్‌. 

‘దీపక్‌ కుమార్‌ అనే వ్యక్తి బాలుడిని ఎత్తుకెళ్లాడు. అతడితో పాటు హత్రాస్‌ జిల్లాకు సమీపంలో ఆసుపత్రి నిర్వహిస్తోన్న ఇద్దరు డాక్టర్లు ఈ గ్యాంగ్‌లో భాగస్వాములు. కొంత మంది ఆరోగ్య కార్యకర్తలకు సైతం ఇందులో భాగం ఉంది. చిన్నారి ఆచూకీ లభించిన ఇంటి సభ్యులను విచారించాం. వారికి ఒకే కూతురు ఉందని, కుమారుడు కావాలని చెప్పారు. అందుకే ఈ డీల్‌ కుదుర్చుకున్నారు.’ అని వెల్లడించారు ముస్తాఖ్‌. అయితే, ఈ అంశంపై అరెస్ట్‌ అయిన కార్పొరేటర్‌, బీజేపీ పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ఇదీ చదవండి: CCTV Footage: తల్లి ఒడిలో నిద్రిస్తున్న పసికందును ఎత్తుకుపోయిన దుండగుడు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top