దివ్యాస్త్రం దిగ్విజయం  | India successfully conducted the flight-test of an advanced Agni-5 missile | Sakshi
Sakshi News home page

దివ్యాస్త్రం దిగ్విజయం 

May 10 2026 1:57 AM | Updated on May 10 2026 1:57 AM

India successfully conducted the flight-test of an advanced Agni-5 missile

ఆధునీకరించిన అగ్ని–5 క్షిపణి పరీక్ష సక్సెస్‌ 

ఎంఐఆర్‌వీ టెక్నాలజీని పరీక్షించిన డీఆర్‌డీఓ 

ఒకేసారి భిన్న లక్ష్యాలను ఛేదించే సత్తా

న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతికతను జోడించిన అగ్ని–5 క్షిపణిని భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఇందుకు ఒడిశాలోని ఏపీజే అబ్దుల్‌ కలాం ద్వీపం వేదిౖకైంది. ఎంఐఆర్‌వీ సాంకేతికతను జతచేసి అగ్ని క్షిపణికి శుక్రవారం పరీక్షించామని రక్షణశాఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌కు ‘మిషన్‌ దివ్యాస్త్ర’అని పేరుపెట్టారు. మల్టిపుల్‌ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్‌ రీ–ఎంట్రీ వెహికల్‌(ఎంఐఆర్‌వీ) సాంకేతికత సాయంతో ఒకే క్షిపణి ద్వారా పలు వార్‌హెడ్‌లను ఏకకాలంలో ప్రయోగించవచ్చు. క్షిపణి కోసం శుక్రవారం తొలుత హిందూ మహాసముద్రజలాల్లో, భూతలంపై సుదూరాల్లోని వేర్వేరు ప్రాంతాలను లక్ష్యాలుగా నిర్దేశించారు.

 ‘‘కలాం ప్రయోగకేంద్రంలోని లాంచర్‌ నుంచి దూసుకెళ్లిన అగ్ని–5 క్షిపణి నింగిలోకి అత్యంత ఎత్తుకు చేరాక కిందకు తిరిగొస్తూ వేర్వేరు ప్రాంతాల్లోని లక్షిత ప్రదేశాలను ఢీకొట్టేలా పేలోడ్‌లను జారవిడిచింది. ఇవన్నీ నిర్దేశిత లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించాయి. పేలోడ్‌ల వేగం, పథం నిర్దేశిత ప్రమాణాలను అందుకున్నాయి. దీంతో ఎంఐఆర్‌వీ సాంకేతికతను పరీక్షించేందుకు చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది’’అని రక్షణశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. భూతలంపై, నౌకలపై మోహరించిన ట్రాకింగ్‌ వ్యవస్థల సాయంతో ఈ ప్రయోగం ఫలితాలను విశ్లేషించి పరీక్ష విజయవంతమైందని నిర్ధారించుకున్నారు.  

5,000 కిలోమీటర్ల పరిధిలో... 
అగ్ని–1 క్షిపణి మొదలు అగ్ని–4 క్షిపణి దాకా అగ్నిరకం మిస్సైళ్లు 700 నుంచి గరిష్టంగా 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయి. అగ్ని–5 ఏకంగా 5,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలనూ తుత్తునియలు చేయగలదు. ఈ క్షిపణిని రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) అభివృద్ధిచేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లోని రక్షణరంగ తయారీసంస్థల సహకారంతో ఈ క్షిపణిని తయారుచేశారు. ఎంఐఆర్‌వీ టెక్నాలజీని జోడించిన అగ్ని–5ను గత ఏడాది మార్చినెలలో తొలిసారిగా పరీక్షించిన విషయం తెల్సిందే. తాజా ప్రయోగం విజయవంతంకావడంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ ఆనందం వ్యక్తంచేశారు. 

పరిశోధన, ప్రయోగంలో పాలుపంచుకున్న డీఆర్‌డీవో, భారత సైన్యం, సంబంధిత పరిశ్రమ భాగస్వాములను ఆయన అభినందించారు. 100 కిలోమీటర్ల కంటే తక్కువ ఎత్తులోంచి దూసుకొచ్చే శత్రు క్షిపణులను మార్గమధ్యంలోనే అడ్డుకునేందుకు 2024 ఏప్రిల్‌లో భారత్‌ తొలిసారి ఎండో–అటా్మస్ఫిరిక్‌ ఇంటర్‌సెప్టార్‌ మిస్సైల్‌ను తొలిసారిగా పరీక్షించింది. తర్వాత ప్రతిష్టాత్మక బాలిస్టిక్‌ క్షిపణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తాజాగా మరోసారి అగ్ని–5 ఎంఐఆర్‌వీ సాంకేతికత సఫలంతో భారత వ్యూహాత్మక రక్షణ సామర్థ్యం మరింత పటిష్టంకానుంది. ఎంఐఆర్‌వీ టెక్నాలజీని అందిపుచ్చుకున్న అతికొద్ది ప్రపంచదేశాల సరసన భారత్‌ చేరింది. గతంలో అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌ల వద్దే ఈ టెక్నాలజీ ఉండేది. డీఆర్‌డీవో శాస్త్రవేత్తల కృషితో ఇప్పుడీ టెక్నాలజీ భారతపరమైంది.  

Advertisement
 
Advertisement
Advertisement