తీరంలో సముద్రజలాల అడుగున అతిపెద్ద త్రివర్ణపతాకం ఆవిష్కరణ
కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డ్ నమోదు
శ్రీ విజయపురం: త్రివర్ణపతాకంపై అభిమానం ఎంతటి అనితర సాధ్యమైన కార్యాన్నయినా సుసాధ్యంచేయిస్తుంది. భారత జాతీయజెండా గురించి యావత్ ప్రపంచం మరోసారి చర్చించుకునేలా చేశారు పలువురు సాహసికులు. పోలీసులు, సైన్యం, నావికాదళం, తీరగస్తీదళం, గజ ఈతగాళ్లుసహా పలువురి సమష్టి కృషి ఏకంగా నూతన గిన్నిస్ ప్రపంచరికార్డ్‌ను బద్దలుకొట్టేలాచేసింది. ఇందుకు అండమాన్‌నికోబార్ దీవుల్లోని రాధానగర్ బీచ్ వేదికైంది.
సముద్రజలాల్లో అడుగున అతిపెద్ద జాతీయజెండాను ఆవిష్కరించి పలువురు కొత్త గిన్నిస్ రికార్డ్‌ను నెలకొల్పడం విశేషం. అండమాన్‌నికోబార్ పరిధిలోని స్వరాజ్ ద్వీప్(హ్యావ్‌లాక్ ఐలాండ్)లోని రాధానగర్ బీచ్‌లోకి 60 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పున్న త్రివర్ణపతాకాన్ని తీసుకొచ్చారు. తర్వాత అండమాన్‌నికోబార్ పోలీస్, అటవీ శాఖ, భారత నేవీ, తీర గస్తీ దళంతోపాటు పలు డైవింగ్ సెంటర్లకు చెందిన గజ ఈతగాళ్లు జాతీయజెండాను సముద్రజలాల్లోకి మోసుకెళ్లారు.
తర్వాత నీటిలోకి తీసుకెళ్లి అడుగున పూర్తిగా పరిచారు. డ్రోన్ల నుంచి చూస్తే సముద్రంలో త్రివర్ణపతాకం నీలిఅలలకు రెపరెపలాడుతూ కన్పించి కనువిందుచేసింది. 200 మందికిపైగా డైవర్లు ఈ రికార్డ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిలో పాఠశాల విద్యార్థులు ఫతే జహాన్ సింగ్(16), లావణ్య ఇరా(15), రణ్‌విజయ్ సింగ్(14) సైతం పాల్గొనడం విశేషం. ఉదయం 10.35 గంటలకు రికార్డ్ నమోదైనట్లు గిన్నిస్ ప్రపంచ రికార్డ్స్ ప్రతినిధి రిషి నాథ్ ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో అండమాన్‌నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ డీకే జోషి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చంద్రభూషణ్ కుమార్, డీజీపీ హెచ్‌ఎస్ ధలివాల, సీనియర్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ‘‘భారీ అలల తాకిడిని సైతం తట్టుకుంటూ అంతటి బరువైన జెండాను నడుస్తూ లోపలిదాకా మోసుకుంటూ వెళ్లి ఆక్సిజన్ సిలిండర్ల సాయంతో ఊపిరితీసుకుంటూ జెండా ఆవిష్కరణ జేసి రికార్డ్‌ను నెలకొల్పడం నిజంగా అద్భుతం’’ అని గవర్నర్ జోషి అభినందించారు.
ఇక్కడ పర్యాటకం, సముద్ర కార్యకలాపాలకు ఊపందుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. సముద్రజలాల లోపల త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించడం మాటలకందని మధురానుభూతి అని ఢిల్లీలోని సర్దార్‌పటేల్ విద్యాలయలో పదో తరగతి చదువుతున్న రణ్‌విజయ్ సింగ్ చెప్పాడు. ఉట్టి కొట్టేటప్పుడు నిలబడినట్లుగా.. ఆదివారం సముద్రం అడుగు నుంచి ఒకరిపై మరొకరు నిల్చుని అతిపెద్ద మానవ నిచ్చెనగా ఏర్పడి మరో గిన్నిస్ రికార్డ్‌నెలకొల్పాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. స్వరాజ్ దీ్వప్‌లోని లైట్‌హౌస్ డైవ్ సైట్‌లో ఈ రికార్డ్‌కు డైవర్లు సిద్ధమవుతున్నారు.


