ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చీఫ్‌ పదవీకాలం ఏడాది పొడిగింపు

Govt extends tenure of ED Director Sanjay Kumar Mishra by a year - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాము అనుకున్నదే చేస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్ల పదవీకాలాన్ని ఐదేళ్ల దాకా  పొడిగించే వెసులుబాటును కల్పిస్తూ ఇటీవలే వివాదాస్పద ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చిన కేంద్రం... దీనికి అనుగుణంగానే ఈడీ డైరెక్టర్‌ సంజయ్‌ కుమార్‌ మిశ్రా పదవీకాలాన్ని బుధవారం మరో ఏడాదిపాటు పెంచింది. 1984 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన మిశ్రా 2018 నవంబరు 18న రెండేళ్ల పదవీకాలానికి ఈడీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

2020లో ఆయన పదవీకాలాన్ని పెంచుతూ... రెండేళ్ల బదులు మూడేళ్లకు గాను ఆయన్ను ఈడీ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు కేంద్ర నియామక ఉత్తర్వులను సవరించింది. కొందరు దీన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా... ఆ ఒక్కసారికి  పొడిగింపునకు సమ్మతించిన కోర్టు తదుపరి మాత్రం సంజయ్‌కుమార్‌ మిశ్రాకు పొడిగింపు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. అయినప్పటికీ సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం పదవీకాలాన్ని పెంచుతూ ఆర్డినెన్స్‌ తెచ్చి... మిశ్రాకు మరో ఏడాది పొడిగింపునిచ్చింది. గురువారం ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా... 2022 నవంబరు 18 దాకా ఆయన పదవిలో కొనసాగుతారని బుధవారం ఆదేశాలు జారీచేసింది.

జాబితాలోకి విదేశాంగ కార్యదర్శి
పదవీకాలం పొడిగింపు అర్హుల జాబితాలో విదేశాంగ కార్యదర్శిని చేరుస్తూ కేంద్రం ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులను సవరించింది. రక్షణ, హోంశాఖ కార్యదర్శులు, ఐబీ డైరెక్టర్, ‘రా’ కార్యదర్శి, సీబీఐ, ఈడీల డైరెక్టర్ల పదవీకాలాన్ని గరిష్టంగా ఐదేళ్ల వరకు పొడిగించేలా ఆదివారం ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో విదేశాంగ కార్యదర్శిని చేర్చింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top