2047 నాటికి అభివృద్ధి భారత్‌ | Sakshi
Sakshi News home page

2047 నాటికి అభివృద్ధి భారత్‌

Published Mon, Sep 4 2023 5:23 AM

GDP-centric view changing to human-centric one says PM Narendra Modi - Sakshi

న్యూఢిల్లీ:  ప్రపంచ అభివృద్ధి ‘జీడీపీ కేంద్రిత విధానం’ నుంచి ‘మానవ కేంద్రిత విధానం’ వైపు మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. మన ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌’ మోడల్‌ ప్రపంచ సంక్షేమానికి ఒక మార్గదర్శిగా మారుతోందని స్పష్టం చేశారు. జీడీపీ పరిమాణంతో సంబంధం లేకుండా ప్రపంచంలో ప్రతి దేశానికీ ప్రాముఖ్యం ఉందని పేర్కొన్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధాని మోదీ తాజాగా వార్తా సంస్థ ‘పీటీఐ’కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక కొత్త ప్రపంచ క్రమం(వరల్డ్‌ ఆర్డర్‌) ఏర్పడిందని, కోవిడ్‌–19 తర్వాత మరో ప్రపంచ క్రమాన్ని చూస్తున్నామని చెప్పారు. మానవ కేంద్రిత అభివృద్ధి దిశగా ప్రపంచం పయనిస్తోందని, ఈ విషయంలో భారత్‌ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. జీ20కి సారథ్యం వహిస్తున్న భారత్‌ ప్రపంచ దేశాల్లో విశ్వాసం అనే విత్తనాలు నాటిందని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే..  

 పేదరికంపై విజయం తథ్యం  
‘‘చాలా ఏళ్ల క్రితం భారత్‌ను 100 కోట్లకుపైగా ఆకలితో అలమటించే ఖాళీ కడుపులున్న దేశంగా భావించేవారు. కానీ, ఇప్పుడు 100 కోట్లకుపైగా ఆకాంక్షలతో కూడిన హృదయాలు, రెండు కోట్లకుపైగా నైపుణ్యం కలిగిన చేతులు, కోట్లాది యువత ఉన్నదేశంగా భారత్‌ను చూస్తున్నారు. 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. ఈ కాలమంతా ఒక మంచి అవకాశమే. గొప్ప అభివృద్ధికి పునాదులు వేసే అవకాశం ఈనాటి భారతీయులకు వచి్చంది.

మనం సాధించే ప్రగతి రాబోయే వెయ్యేళ్లు గుర్తుండిపోతుంది. పేదరికంపై జరుగుతున్న యుద్ధంలో పేద ప్రజలు కచి్చతంగా విజయం సాధిస్తారు. విద్య, వైద్యం, సామాజిక రంగాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించబోతున్నాం. దేశంలో అవినీతి, కులతత్వం, మతతత్వానికి ఎంతమాత్రం స్థానంలేదు. జీ20 కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిర్వహించడంలో వింతేమీ లేదే. అది సహజమే.

భారత్‌ చాలా విశాలమైన, వైవిధ్యం కలిగిన దేశం. మన సొంత భూభాగంలో ఎక్కడైనా సదస్సులు నిర్వహించుకునే స్వేచ్ఛ మాకుంది. వాతావరణ మార్పులపై పోరాడే విషయంలో కేవలం ఒకే విధానం సరిపోదు. నిర్మాణాత్మక చర్యలుండాలి. వాతావరణ లక్ష్యాలను సాధించే విషయంలో ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోం. ఉగ్రవాద సంస్థలు టెక్నాలజీని విచ్చలవిడిగా వాడుకుంటున్నాయి. కార్యకలాపాల కోసం డార్క్‌ నెట్, మెటావెర్స్, క్రిప్టోకరెన్సీ వేదికలను ఉపయోగించుకుంటున్నాయి. సైబర్‌ నేరాలను అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలి.   
 
ప్రపంచ సమస్యలకు భారత్‌ పరిష్కారం   

భారత్‌లో అమలవుతున్న మానవ కేంద్రిత అభివృద్ధి మోడల్‌ను ప్రపంచ దేశాలు గుర్తించి, అనుసరిస్తున్నాయి. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగుతున్నాం. మన దేశాన్ని గతంలో కేవలం ఒక పెద్ద మార్కెట్‌గానే పరిగణించేవారు. ఇప్పుడు ప్రపంచ దేశాల ఎదుర్కొంటున్న సమస్యలకు భారత్‌ పరిష్కార మార్గాలు చూపిస్తోంది. అప్పుల భారం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు పెద్ద ముప్పుగా మారుతోంది. ఉచిత పథకాలు అనేవి సరైన ఆలోచన కాదు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తేనే అభివృద్ధి వేగవంతమవుతుంది.

ప్రపంచ పరిణామాలు మారిపోతున్నాయి. దానికి అనుగుణంగా ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్యసమితిలో అన్ని దేశాల గొంతుకలకు ప్రాతినిధ్యం దక్కాలి. జీ20లో ఆఫ్రియన్‌ యూనియన్‌కు పూర్తిస్థాయి సభ్యత్వం          కలి్పంచాలి. అందుకు మేము మద్దతు ఇస్తాం. అన్ని గొంతుకలను గుర్తించకుండా, ప్రాతినిధ్యం కలి్పంచకుండా.. ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టే ఏ ప్రణాళిక కూడా సఫలం కాదు’’ అని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.   

Advertisement
Advertisement