
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ప్రకంపనలు ఇంకా చల్లారకముందే థర్డ్ వేవ్ ఆందోళన దేశ ప్రజలను వణికిస్తోంది. ముఖ్యంగా థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందన్న అంచనాలు తల్లిదండ్రులను మరింత భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) వెలువరించిన అధ్యయన పత్రం కాస్త ఊరటనిస్తోంది. ఇతర దేశాల అనుభవాలతో పోలిస్తే థర్డ్ వేవ్ .. రెండో దశ అంత ఉధృతంగా ఉండవకపోవచ్చని అంచనా వేసింది. అయితే మెరుగైన ఆరోగ్య సదు పాయాలు, 12-18 ఏళ్ల పిల్లలు, టీనేజర్లకు త్వరగా కరోనా టీకాలు వేయాలని పిలుపు నిచ్చింది.
'ఎకోర్యాప్’ పేరుతో వెల్లడించిన ఈ నివేదికలో ఆర్థిక వ్యవస్థ పనితీరును విశ్లేషించింది. 2022 ఆర్థిక సంవత్సరానికి రియల్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ప్రొజెక్షన్‌ను 10.4 శాతం నుంచి 7.9 శాతానికి తగ్గించింది ఎస్‌బీఐ. థర్డ్ వేవ్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం, వైద్య వసతులు మెరుగవుతుండటంతో ప్రభావం తక్కువగానే ఉండొచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. తీవ్రంగా కరోనా బారిన పడిన దేశాల్లో సెకండ్ వేవ్ 108 రోజులపాటు కొనసాగగా థర్డ్ వేవ్ 98 రోజులకే పరిమితమైందని తెలిపింది. దీని బట్టి థర్డ్ వేవ్ తీవ్రత అంతగా ఉండకపోవచ్చని తెలిపింది.
అలాగే రానున్న థర్డ్‌వేవ్‌కు దేశం బాగా సిద్ధం కావాలని, తద్వారా తీవ్రమైన కేసుల రేటు తగ్గడంతోపాటు మరణాలు కూడా తగ్గుతాయని ఎస్‌బీఐ తన నివేదికలో తెలిపింది. సీరియస్ కేసుల ఉధృతి 20 శాతం నుండి 5 శాతానికి (మంచి ఆరోగ్య మౌలిక సదుపాయాలు, కఠినమైన టీకా విధానంతో) తగ్గితే, సెకండ్ వేవ్‌లో 1.7 లక్షలకు పైగా మరణాలతో పోలిస్తే థర్డ్ వేవ్‌లో మరణాల సంఖ్య గణనీయంగా 40వేలకు తగ్గుతుందని అంచనా వేసింది. ముఖ్యంగా పిల్లలకు టీకాలు వేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. 12-18 వయస్సులో సుమారు 15-17 కోట్ల పిల్లలున్న దేశంలో ఒక అధునాతన వ్యూహాన్ని అనుసరించాలని సూచించింది. అలాగే ప్రభుత్వ అంచనాల ప్రకారం జూలై మధ్య నుండి రోజుకు ఒక కోటి టీకాలు వేయాలన్న లక్ష్యంపై సంతృప్తి వ్యక్తం చేసింది.
కాగా కరోనా సెకండ్ వేవ్ దేశంలో అల్లకల్లోలం సృష్టించింది. ఆక్సిజన్ కొరత, మందుల కొరత, ఆసుపత్రుల్లో బెడ్స్ దొరక బాధితుల అవేదన అంతా ఇంతా కాదు. అయితే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నలాక్‌డౌన్ ఆంక్షలతో గత కొద్ది వారాలుగా రోజువారీ కేసులు తగ్గుముఖం పడు తున్నాయి. ఒక దశలో రోజుకు రికార్డు స్థాయిలో 4 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
చదవండి : కరోనా: రిలయన్స్ మరో సంచలన నిర్ణయం
vaccine: మినహాయింపులపై సీరం కీలక వ్యాఖ్యలు