‘ఫాస్ట్‌’గా అనర్థాలు | Effect of junk food on human Health Issues | Sakshi
Sakshi News home page

‘ఫాస్ట్‌’గా అనర్థాలు

May 3 2026 6:04 AM | Updated on May 3 2026 6:06 AM

Effect of junk food on human Health Issues

ఫాస్ట్, జంక్, అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌లతో తీవ్ర అనారోగ్య సమస్యలు 

మరణాల రేటు 21% పెరుగుదల, ఊబకాయం, టైప్‌ 2 మధుమేహం, గుండె జబ్బులు,  

కొన్ని రకాల కేన్సర్లు కూడా.. ముఖ్యంగా పెద్దపేగు కేన్సర్‌ వచ్చే ప్రమాదం

సాక్షి, హైదరాబాద్‌: ఫాస్ట్, జంక్‌ ఇంకా అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌ (యూపీఎఫ్‌)తో అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. యూపీఎఫ్‌లను అధికంగా తీసుకోవడం వల్ల హృదయ సంబంధ మరణాల ప్రమాదం 50 శాతం పెరగడంతోపాటు గుండెపోటు, పక్షవాతం, ఆంజైనా వంటి అధిక ముప్పు కూడా పొంచి ఉంది. ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్న వారిలో మరణాల రేటు 21 శాతం పెరగడంతోపాటు ఊబకాయం, టైప్‌ 2 మధుమేహం, గుండె జబ్బులు, మానసిక ఆరోగ్య రుగ్మతలు తలెత్తుతున్నట్లు వెల్లడైంది. కొన్ని రకాల కేన్సర్లతో ముడిపడి ఉన్నట్టు కూడా ఆధారాలున్నాయి.

ముఖ్యంగా పెద్దపేగు కేన్సర్‌ వచ్చే ప్రమాదం అధికంగా ఉండటంతోపాటు ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌), ఇతర సమస్యలకు మూలంగా దీనిని భావిస్తున్నారు. భారత్‌లో యూపీఎఫ్‌లు ప్రత్యక్షంగా ఆరోగ్య సంక్షోభానికి కారణమవుతున్నాయని 2025–26లో నిర్వహించిన పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. భారత వైద్య విద్యార్థులపై 2025లో జరిపిన ఒక అధ్యయనంలో... 87.2% మంది అధిక మొత్తంలో యూపీఎఫ్‌లను వినియోగిస్తున్నారని , దీనివల్ల వారిలో ఒత్తిడి పెరిగిందన్న విషయాన్ని కనుగొన్నారు.  

యూపీఎఫ్‌లు ఇవీ..  
బ్రెడ్డు, చిప్స్, చక్కెర కలిపిన పానీయాలు, సోడాలు, ప్యాక్‌ చేసిన కేకులు, స్నాక్స్, ఇన్‌స్టంట్‌ మీల్స్, నగ్గెట్స్, హాట్‌ డాగ్‌లు, బేకన్, డెలి మీట్స్‌ తదితరాలు  
ఏ అధ్యయనం ఏం చెప్పిందంటే... 

⇒ కేంద్రప్రభుత్వ ఎకనమిక్‌ సర్వే 2025–26: భారత్‌లో ఊబకాయం పెరుగుదలకు యూపీఎఫ్‌ను ప్రధానకారణంగా గుర్తించింది. ఈ ఉత్పత్తుల ధరలను అత్యధిక జీఎస్టీ స్లాబ్‌లో పెట్టి వీటి వినియోగాన్ని తగ్గించాలని సిఫార్సు చేసింది. 
⇒  ఐసీఎంఆర్‌–ఎన్‌ఐఎన్‌ గైడ్‌లైన్స్‌–2026: యూపీఎఫ్‌లో ముఖ్యమైన న్యూట్రియెంట్స్‌ లేవని, ఆరోగ్యానికి హానికరంగా పరిణమించే ఎమల్సిఫైర్స్, స్టెబిలైజర్స్‌ వంటివి ఉన్నాయంది. 

⇒  లాన్సెట్‌ అధ్యయనం 2026: యూపీఎఫ్‌లు టైప్‌ 2 డయాబెటీస్‌కు, కుంగుబాటుకు, గుండె సంబంధిత జబ్బులకు కారణమవుతున్నట్టు ఆధారాలు లభించాయని చెప్పింది. 
⇒ డబ్ల్యూహెచ్‌వో సౌత్‌–ఈస్ట్‌ ఏషియా రిపోర్ట్‌: భారత్‌లో యూపీఎఫ్‌ల వినియోగం ఏటా 13.3 శాతం పెరుగుతోందని, అత్యవసరంగా ప్రభుత్వ విధానాలను సవరించి ఫ్రంట్‌–ఆఫ్‌ ప్యాకేజీలపై హెచ్చరికల లేబుళ్లు ప్రచురించాలని సూచించింది. 

⇒  సేపీయన్‌ ల్యాబ్స్‌–2026: భారత్‌లో 44 శాతం యువత (18–34 ఏళ్లలోపు వారు) యూపీఎఫ్‌లు రెగ్యులర్‌గా తింటున్నారు. ఇది మెదడు ఆధారిత మానసిక సామర్థ్యంపై ప్రభావం చూపడానికి లంకె ఉన్నట్టుగా తెలిపింది.

ఇంటి ఆహారం బెస్ట్‌..
ముఖ్యంగా అధిక చక్కెర, ఉప్పు, అనారోగ్య కొవ్వు, ఇతర పదార్థాలు ఓవర్‌లోడ్‌ అయ్యి కాలేయంపై ప్రతికూల ప్రభావంతో ఫ్యాటీలివర్, ఇన్‌ఫ్లమేషన్‌తో కాలేయ దీర్ఘకాలిక డ్యామేజీకి దారితీస్తుంది. ఈ ఆహారాన్ని అధికంగా తీసుకుంటే ఆస్తమా, వీజింగ్, క్రానిక్‌ బ్రాంకైటిస్, సీవోపీడీ, స్లీప్‌ ఆప్నియాకు దారితీస్తాయి. ఇవి స్కూల్‌ పిల్లలు మొదలుకుని పెద్దవారిపైనా తీవ్ర ప్రభావం చూపుతాయి.

పిల్లల్లో ఎదుగుదల సమస్యలతోపాటు అన్నివర్గాల వారిలో రోగనిరోధకశక్తి తగ్గుతుంది. వీటికంటే కూడా ఇంట్లో తయారుచేసిన ఆహారం, తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, ప్రొటీన్‌ అధికంగా ఉన్న ఫుడ్‌ తీసుకోవాలి. షుగరీ డ్రింక్స్‌కు బదులు మంచినీళ్లు తాగాలి. ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ లేబుళ్లపై చక్కెర, ఉప్పు, ట్రాన్స్‌ఫాట్, ఇతర పదార్థాలు ఎంత మేరకు ఉన్నాయో తెలుసుకోవాలి. రెగ్యులర్‌గా వ్యాయామాలు, మంచినిద్ర తదితరాల ద్వారా కాలేయం, గుండె, శ్వాసకోశాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. – డా.హరికిషన్‌ గోనుగుంట్ల, చీఫ్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్ట్, యశోద   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement