టిక్‌ టిక్‌ టిక్‌.. నోయిడా జంట భవనాల కూల్చివేత

Demolishing Of Noida Twin Towers In Final Stage - Sakshi

నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సూపర్‌టెక్‌ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాల కూల్చివేతకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజల్లో దడ మొదలైంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ జంట భవనాలను ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకి కూల్చివేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక్క బటన్‌ నొక్కడంతో 100 మీటర్లకు పైగా పొడవైన ఆ భవనాలు కేవలం 10 సెకండ్లలోపే పేకమేడల్లా నేలమట్టం కానున్నాయి.  భవనాల కూల్చివేతను చేపట్టిన ఎడిఫైస్‌ ఇంజనీరింగ్‌ సంస్థ సీఈఓ ఉత్కర్‌ మెహతా శనివారం పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూల్చివేతపై ఎలాంటి భయాలు వద్దని తాము చేపట్టిన ప్రక్రియ 150 శాతం సురక్షితమైనదని హామీ ఇచ్చారు.  

వాటర్‌ఫాల్‌ ఇంప్లోజన్‌ టెక్నిక్‌  
ఈ తరహా భవనాలు కూల్చివేయడానికి మూడు మార్గాలున్నాయి. డైమండ్‌ కటర్, రోబోటిక్‌ టెక్నిక్, పేలుడు పదార్థాలు.. ఇలా మూడు రకాలుగా భవనాల్ని కూల్చేయవచ్చు. అయితే కూల్చడానికయ్యే ఖర్చు, సమయం, భద్రత అంశాలను దృష్టిలో ఉంచుకొని పేలుడు పదార్థాల ద్వారా ‘‘కంట్రోల్డ్‌ ఇంప్లోజన్‌ ’’ (వాటర్‌ఫాల్‌ ఇంప్లోజిన్‌) విధానంతో  కొన్ని సెకండ్లలో కూల్చేయనున్నారు. ఈ టెక్నిక్‌ను 1773లో ఐర్లాండ్‌లోని వాటర్‌ఫోర్డ్‌లో హోలీ ట్రినిటీ కేథడ్రాల్‌ భవనం కూల్చివేతకు తొలిసారిగా ఉపయోగించారు. 2020లో కేరళలోని కొచికి సమీపంలో మారాడు పట్టణంలో కోస్తా తీర ప్రాంత నిబంధనలను అతిక్రమించి  నిర్మించిన నాలుగు లగ్జరీ అపార్ట్‌మెంట్లను కూడా పేలుడు పదార్థాలను వినియోగించి కూల్చివేశారు. వంతెనలు, సొరంగాలు, భవనాలు, ఇతర నిర్మాణాలను కూల్చివేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ విధానమే అత్యంత భద్రమైనదని తేలింది.  

వాయు కాలుష్యంతో అనారోగ్య సమస్యలు  
జంట భవనాల కూల్చివేత సమయంలో తమ ఇళ్లకి ఏం జరుగుతుందోనని, దుమ్ము ధూళి కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయేమోనని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనాల కూల్చివేత సమయంలో వచ్చే ధూళి కొన్ని వారాల పాటు గాల్లోనే ఉండడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు రావచ్చునని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దేశంలో అత్యంత కాలుష్య నగరాల్లో నోయిడా ముందు వరసలోనే ఉంది. ఇప్పుడు వాయుకాలుష్యం మరింతగా పెరిగే అవకాశాలున్నాయి.

ఆ భవనాల పక్కనే ఉన్న ఎమరాల్డ్‌ కోర్టు, ఏటీఎస్‌ విలేజ్‌లో ఉంటున్న 5 వేల మందికిపైగా ఆదివారం ఉదయం ఇళ్లు ఖాళీ చేసి వెళ్లనున్నారు. ‘‘మేము చాలా ప్రమాదంలో ఉన్నాం. భవనాల కూల్చివేత సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా మా ఇళ్లు ఏమయిపోతాయోనన్న భయాన్ని మాటల్లో చెప్పలేను’’ అని సీనియర్‌ రెసిడెంట్‌ ఆర్‌కె రస్తోగి ఆందోళన వ్యక్తం చేశారు. ఏటీఎస్‌ విలేజ్‌లో నివాసం ఉండే మౌసమి భవనాల కూల్చివేసిన తర్వాత ఏర్పడే దుమ్ము, ధూళికి ఎలాంటి శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయోనని ఆందోళన వ్యక్తం చేశారు.

నోయిడా జంట భవనాల నిర్మాణం : 2012
రెండు జంట భవనాలు : అపెక్స్‌ (32 అంతస్తులు), సియాన్‌ (29 అంతస్తులు)  
భవనాలకు చేసిన రంధ్రాలు : 9,600
నింపిన పేలుడు పదార్థాలు : 3,700 కేజీలకు పైగా
టవర్స్‌ నిర్మాణ వ్యయం : రూ.70 కోట్లు  
కూల్చివేతకు ఖర్చు : రూ.20 కోట్లు
శిథిలాలు : 55,000 నుంచి 80 వేల టన్నులు 
శిథిలాల తరలింపునకు పట్టే సమయం: 3 నెలలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top