జమ్మూలో 6..కశ్మీర్‌లో 1

Delimitation Commission proposes six additional seats for Jammu, one for Kashmir - Sakshi

కొత్త నియోజకవర్గాలను ప్రతిపాదించిన డీలిమిటేషన్‌ కమిషన్‌

బీజేపీ ఎజెండా అంటూ ఎన్‌సీ నేత ఒమర్‌ అబ్దుల్లా ధ్వజం

న్యూఢిల్లీ: జమ్మూ ప్రాంతంలో అదనంగా ఆరు నియోజకవర్గాలు, కశ్మీర్‌ ప్రాంతంలో ఒక అసెంబ్లీ స్థానాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ ప్రతిపాదించింది. ఎస్‌సీలు, ఎస్టీలకు 16 నియోజకవర్గాలను రిజర్వు చేసింది. ప్రస్తుతం కశ్మీర్‌ డివిజన్‌లో 46, జమ్మూ డివిజన్‌లో 37 అసెంబ్లీ సీట్లున్నాయి. అయితే, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతానికి చెందిన 24 అసెంబ్లీ స్థానాలు కశ్మీర్‌ అసెంబ్లీలో ఖాళీగానే కొనసాగుతాయి.

జమ్మూకశ్మీర్‌ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే డీలిమిటేషన్‌ కమిషన్‌ ప్రతిపాదనలపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ), పీడీపీ తదితర పార్టీలతోపాటు బీజేపీ మిత్రపక్షం పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ కూడా తీవ్ర నిరసన తెలిపాయి. ఈ సిఫారసులను బీజేపీ రాజకీయ ఎజెండాగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అభివర్ణించింది. 2019 ఆగస్ట్‌లో జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు బిల్లును పార్లమెంట్‌ ఆమోదించిన తర్వాత, 2020 ఫిబ్రవరిలో పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది.

సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ రంజనా దేశాయ్‌ నేతృత్వంలోని ఈ కమిషన్‌లో జమ్మూకశ్మీర్‌కు చెందిన ఐదుగురు లోక్‌సభ ఎంపీలు అసోసియేట్‌ సభ్యులుగా, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌చంద్ర ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఉన్నారు. సోమవారం జరిగిన కమిషన్‌ మొట్టమొదటి సమావేశానికి ఎన్‌సీ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా, ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ సహా బీజేపీ ఎంపీలు ఇద్దరు హాజరయ్యారు. ఈ ప్రతిపాదనలపై ఆయా పార్టీలు డిసెంబర్‌ 31వ తేదీలోగా తమ అభిప్రాయాలను తెలపాల్సి ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. సమావేశం అనంతరం ఫరూక్‌ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ.. గుప్కార్‌ డిక్లరేషన్‌లో భాగమైన ఐదు పార్టీల నేతలతో చర్చించాకే ఈ ప్రతిపాదనలపై నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు.

ప్రతిపాదనలను అంగీకరించం
ఈ ప్రతిపాదనలు నిరుత్సాహాన్ని కలిగిం చాయని ఎన్‌సీ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. ‘ప్రతిపాదనల కోసం అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన కమిషన్‌.. బీజేపీ రాజకీయ అజెండాను ముందుకు తీసుకురావడానికే మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. శాస్త్రీయ విధానాలకు బదులు రాజకీయ ఉద్దేశాలతోనే ప్రతిపాదనలకు రూపకల్పన చేశారు. 2011 జనగణన వివరాలను ఆధారంగా తీసుకోలేదు. వీటిని మేం అంగీకరించం’అని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనలపై సంతకం పెట్టేది లేదని ఎన్‌సీ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొంది. ప్రజలను మత, ప్రాంతాల వారీగా విభజించేందుకు, బీజేపీ రాజకీయ ప్రయోజనాలను కాపాడేందుకే ప్రభుత్వం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని పీడీపీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ దుయ్యబట్టారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top