భారత్‌లో ఒమిక్రాన్‌ ఎక్స్‌బీబీ కేసులు.. ఆ ఐదురాష్ట్రాల్లో 70 కేసులు నమోదు

Coronavirus Update: Omicron XBB sub variant Cases In India - Sakshi

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం.. ‘తీవ్రత దృష్ట్యా’ ప్రజలు సైతం వైరస్‌ను పెద్దగా పట్టించుకోని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పూర్తి స్థాయిలో కరోనా కథ మాత్రం ఇంకా ముగియలేదు. ఈ నేపథ్యంలో.. తాజాగా కరోనా వైరస్‌ వేరియెంట్‌ ఒమిక్రాన్‌లో అత్యంత వేగంగా కేసుల వ్యాప్తికి కారణమయ్యే ఒక ఉప రకాన్ని భారత్‌లో గుర్తించారు. 

ఒమిక్రాన్‌ ఎక్స్‌బీబీ వేరియెంట్‌ కేసులు మన దేశంలో వెలుగు చూశాయి.  ఒమిక్రాన్‌ ఎక్స్‌బీబీ వేరియెంట్‌ అంటే.. బీఏ.2.75, బీజే.1ల రీకాంబినెంట్‌. శాస్త్రీయ నామం బీఏ.2.10 (BA.2.10) మహారాష్ట్ర, కేరళ, ఇతర ప్రాంతాల్లో ఈ వేరియెంట్‌కు సంబంధించిన కొత్త కేసులు వెలుగు చూశాయి.

అయితే ఈ వేరియెంట్‌ విషయంలో నిపుణులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అందుకు కారణం.. సింగపూర్‌లో గత కొన్నిరోజులుగా కేసులు రెట్టింపు సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి కాబట్టి. ఒమిక్రాన్‌లో అత్యంత వేగంగా ఇన్‌ఫెక్షన్‌ను వ్యాపించే గుణం ఈ వేరియెంట్‌కు ఉందని పరిశోధకులు నిర్ధారించారు. 

ఇక గుజరాత్‌లో ఇప్పటికే బీఏ.5.1.7, బీఎఫ్‌.7 కేసులు వెలుగు చూశాయి. ఇవి కూడా వైరస్‌ను వేగంగా వ్యాపింపజేసే గుణం ఉన్న వేరియెంట్లే కావడం గమనార్హం. 

Omicron XBB తీవ్రత.. 

ఒమిక్రాన్‌ ఎక్స్‌బీబీ వేరియెంట్‌ తీవ్రత ప్రమాదకరమేమీ కాదు. కరోనా తరహా దగ్గు, లో ఫీవర్‌, జలుబు, వాసన గుర్తింపు లేకపోవడం, ఒళ్లు నొప్పులు.. ఇలా కరోనా తరహాలోనే లక్షణాలే కనిపిస్తున్నాయి. అలాగే మంచి చికిత్సతో తొందరగానే కోలుకోవచ్చు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కానీ, దాని గుణం వల్ల ఇన్‌ఫెక్షన్‌ను అతిత్వరగా.. వేగంగా వ్యాపింపజేస్తుంది. అంతేకాదు ఆస్పత్రిలో చేర్చే కేసుల్ని పెంచే అవకాశాలు ఎక్కువని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఒమిక్రాన్‌ ఎక్స్‌బీబీ కేసులు ప్రస్తుతం భారత్‌లో ఐదు రాష్ట్రాల్లో 70 దాకా నమోదు అయ్యాయి. ఒకవేళ ఈ వేరియెంట్‌ గనుక విజృంభిస్తూ.. మూడు నుంచి నాలుగు వారాల్లో కేసులు మళ్లీ పుంజుకునే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
► ఆగస్టులో ఈ వేరియెంట్‌ను మొదట అమెరికాలో గుర్తించారు. 

► సింగపూర్‌లో ఒక్కరోజులోనే 4,700 నుంచి 11,700 కేసులు పెరిగాయంటే తీవ్రత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. చాలామంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు కూడా.

► ఇతర వైరస్‌లలాగే.. Corona Virus  కూడా తన రూపాల్ని మార్చుకుంటూ పోతోంది.    

► ఎక్స్‌బీబీ వేరియెంట్‌పై వ్యాక్సినేషన్‌ ప్రభావం పెద్దగా ఉండదని.. ఎందుకంటే దాని మ్యూటేషన్‌ అంతుచిక్కడం లేదని సైంటిస్టులు చెప్తున్నారు.

► ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌, ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియెంట్‌పై స్పందించారు. పండుగ సీజన్‌ దృష్ట్యా భారత్‌ సహా మరికొన్ని దేశాల్లో ఈ వేరియెంట్‌ మరో వేవ్‌కు కారణం కావొచ్చని ఆమె అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: ఈ కెమెరాతో 15 మైళ్ల దూరంలో ఉన్న గోల్ఫ్ బంతిని కూడా క్లియర్‌గా చూడవచ్చు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top