
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు, మరణాల్లో భారీగా తగ్గుముఖం కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 34,703 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 101 రోజుల్లో ఇంత తక్కువ స్థాయిలో కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి. నిన్న కోవిడ్‌తో 553 మంది మృత్యువాత పడ్డారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం అందించిన సమాచారం మేరకు గత మూడు నెలల్లో ఇంత తక్కువలో మరణాలు సంభవించడం ఇదే ప్రథమం.
నిన్న ఒక్క రోజే 51,864 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 4,64,357 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పటి వరకు 3,06,19,932కు పెరిగాయి. ఇప్పటి వరకు 4,03,281 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 2,97,52,294 మంది కోలుకున్నారు. సోమవారం నాడు 16,47,424 మంది పరీక్షలు చేసుకున్నారు. ఇప్పటి వరకు 42,14,24,881 మందికి టెస్టులు చేశారు. ప్రస్తుతం రికవరీరేటు 97.17కు పెరిగింది.