నేడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రానున్న సీఎం
అమిత్‌షాతో భేటీ కానున్న చంద్రబాబు
సీఐఐ సమ్మిట్‌కు హాజరు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సోమవారం మరోసారి ఢిల్లీకి రానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఆయన హస్తినబాట పట్టడం ఇది 30వ సారి. చంద్రబాబు సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి రానున్నారు. ఆయన తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. అనంతరం జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను కలవనున్నారు. ఆ తర్వాత కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సమ్మిట్‌కు హాజరుకానున్నారు. అయితే, సీఎం తరచూ ఢిల్లీ పర్యటనకు వచ్చి కేంద్ర మంత్రులను కలుస్తున్నా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సాధించింది శూన్యమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చంద్రబాబు పరపతితో తెచ్చిందేమీ లేదు!
చంద్రబాబు 2024లో సీఎం అయిన తర్వాత ఢిల్లీకి వచ్చి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం ఇది 13వ సారి. ఆయన ఢిల్లీకి వచి్చన ప్రతిసారి ‘రాష్ట్రం కోసం అది తెస్తాం.. ఇది తెస్తాం’ అని లీకులు ఇవ్వడం, పెద్ద ఎత్తున ప్రచారం చేయడం... కేంద్ర మంత్రులతో భేటీ ముగిశాక మాత్రం ‘కేంద్రం సహకరిస్తోంది. లేఖలు ఇచ్చాం’ అనే పాత పాటే పాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేసే సాధారణ స్కీములు మినహా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా చంద్రబాబు తెచ్చిందేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కేంద్రం ఇచ్చే నిధులే తప్ప, తనకున్న పరపతితో రాష్ట్రానికి అదనపు బడ్జెట్ కేటాయింపులు సాధించడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుకు ఇప్పటికీ నిధుల కేటాయింపులు, సాంకేతిక అనుమతుల విషయంలో జాప్యం జరుగుతుండటం దీనికి నిదర్శనమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘అయినను పోయిరావలె హస్తినకు‘ అన్న చందంగా చంద్రబాబు 30వ సారి ఢిల్లీ పర్యటనకు వస్తున్నారు. ఈసారి అయినా రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తారా? లేక రాజకీయ అవసరాలే అజెండాగా ఈ పర్యటన ఉంటుందా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


