Censorship Of OTT Platforms: ఓటీటీ కంటెంట్‌కు కళ్లెం వేయాలని కేంద్రం నిర్ణయం, in Telugu - Sakshi
Sakshi News home page

‘సిరీస్‌’ అశ్లీలత.. సీరియస్‌ అడ్డుకట్ట

Nov 12 2020 7:54 AM | Updated on Nov 12 2020 5:35 PM

Central Government Has Decided To Crack Down OTT Content - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘హరియాణాలో ఓ యువకుడు తనను ప్రేమించలేదన్న కోపంతో యువతిని కాల్చి చంపాడు. అలా ఎందుకు చేశావంటే.. ఓ వెబ్‌ సిరీస్‌లోని పాత్ర స్ఫూర్తితో చంపాను’అని చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. పట్టుమని పదిహేనేళ్లు కూడా లేని పిల్లలు లైంగికదాడికి యత్నించడం, అసభ్యపదజాలం వాడటం కొంతకాలంగా పెరుగుతోంది. టీనేజీ పిల్లలు పెడదోవ పట్టడానికి ఓవర్‌ ద టాప్‌(ఓటీటీ)లోని పలు సిరీస్‌లే కారణమని తల్లిదండ్రులు అంటున్నారు. 

‘సిరీస్‌’అశ్లీలతపై కేంద్రం సీరియస్‌గా ఉంది. ఇంతకాలం ఓటీటీ వేదికల్లో పట్టపగ్గాలు లేకుండా సాగిన అసభ్య సన్నివేశాలు, సంభాషణలకు ఇక అడ్డుకట్ట పడనుంది. తాజాగా ఓటీటీలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ పరిధిలోకి తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో సిరీస్‌ల కంటెంట్‌కు సెన్సార్‌షిప్‌ తప్పనిసరిగా మారింది. మార్చిలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడటంతో ప్రజలంతా వినోదం కోసం అనేక ఓటీటీ వేదికలను ఆశ్రయించారు. అయితే వెబ్‌ సిరీస్‌ల ప్రసారానికి ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఇప్పటిదాకా రాలేదు. ఫలితంగా వీటిలో శృంగారం, అసభ్యపదజాలం, అశ్లీలత, హింస, అక్రమసంబంధాలు వంటి వాటికి అడ్డూఅదుపు లేకుండాపోయింది. దీంతో వీటికి కళ్లెం వేయాలని సుప్రీం కోర్టును కొందరు ఆశ్రయించారు. సుప్రీం ఆదేశాలతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.     (షాకింగ్‌: కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఐదుగురిలో)

విద్యార్థులే వీక్షకులు: పలు ఓటీటీ యాప్‌లు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లలో ఇన్‌బిల్ట్‌గా వచ్చేస్తున్నాయి. విద్యార్థులే ప్రధాన వీక్షకులు. ఆన్‌లైన్‌ క్లాసుల పుణ్యమాని ఇప్పుడు ప్రతి విద్యార్థి దగ్గర స్మార్ట్‌ఫోన్‌ ఉంది. వీరికి సమయం దొరికితే చాలు ఓటీటీల్లో వెబ్‌ సిరీస్‌లు చూస్తున్నారు. వెబ్‌ సిరీస్‌లకు అలవాటు పడ్డ టీనేజీ, యువత భాష క్రమంగా మారుతోంది. కోపం వచ్చినా, సంతోషం వచ్చినా బూతులు వాడుతుండటం గమనార్హం. విదేశీ సిరీస్‌లు మరీ దారుణం. మనుషులను చంపడం, హింసించడమే నేపథ్యంగా తెరకెక్కిన సైకోథ్రిల్లర్‌ సినిమాలకు ఓటీటీల్లో కొదవలేదు. ఇవి టీనేజీ యువత మానసిక ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని సైకాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిలను వేధించడం, డేటింగ్, సహజీవనం, ర్యాగింగ్‌ వంటి విదేశీ సంప్రదాయాలను ప్రోత్సహిస్తాయని వాపోతున్నారు. ఇందులో ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్న తెలుగు సిరీస్‌ లు సైతం అశ్లీలత, బూతులు దట్టించి జనాలపైకి దూసుకువస్తున్నాయి. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంపై పోలీసులు, సైకాలజిస్టులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   

పెరుగుతున్న మార్కెట్‌..!
ప్రైస్‌వాటర్‌ హౌస్‌కూపర్స్‌(పీడబ్ల్యూసీ) రిపోర్ట్‌ ప్రకారం.. 2024 నాటికి ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఓటీటీ మార్కెట్‌గా ఇండియా అవతరించనుంది. వచ్చే నాలుగేళ్లలో ఈ మార్కెట్‌ వార్షికంగా 28.6 శాతం వృద్ధి చెంది, రూ.21,362 కోట్ల(2.9 బిలియన్‌ డాలర్ల) రెవెన్యూను తాకుతుందని పేర్కొంది. ప్రపంచంలోని అనేక భాషల సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు సులువుగా అర్థమయ్యేలా సబ్‌టైటిళ్లు ఉండటంతో వీటికి భాషాభేదం లేకుండా పోతోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement